Share News

ఆచరణే ప్రధానం

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:29 AM

ఎవరైనా రెండు మంచి మాటలు చెబితే విని సంతోషిస్తాం. వారిని రోజూ కలిసి వారి మాటలు వినాలనుకుంటాం. ఇంకేదైనా బోధించాలని వేడుకుంటాం. కానీ వారు చెప్పిన మాటలు అనుసరించి...

ఆచరణే ప్రధానం

సద్బోధ

ఎవరైనా రెండు మంచి మాటలు చెబితే విని సంతోషిస్తాం. వారిని రోజూ కలిసి వారి మాటలు వినాలనుకుంటాం. ఇంకేదైనా బోధించాలని వేడుకుంటాం. కానీ వారు చెప్పిన మాటలు అనుసరించి మన జీవన విధానాన్ని మార్చుకోం. వారిని మాత్రం గురువులుగా, గొప్ప జ్ఞానులుగా భావిస్తూ వారి పాద సేవలు చేస్తూ గడుపుతాం. కొందరు సంఘ సేవకులు ఆ గురువు మాటలను ప్రతి ఒక్కరూ వినాలనే ఉద్దేశంతో అతణ్ణి సమావేశాలకు ఆహ్వానించి, ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. ఇంకొందరు ఉత్సాహవంతులు విరాళాలు సేకరించి... ఆశ్రమాన్నో, సభా ప్రాంగణాన్నో నిర్మించి, ఆ గురువుకు ఇచ్చి... రోజూ సాయంత్రం ప్రవచనాలు చేయాలనీ, జనాన్ని ఉద్ధరించాలనీ మనవి చేస్తారు. ఆ గురువు రోజూ క్రమం తప్పకుండా ప్రసంగించి, తనకు ఉన్న శాస్త్ర జ్ఞానాన్ని ధారాళంగా అందరికీ పంచుతాడు. అంతమందిలో ఎందరు తన బోధల్ని గ్రహించి మార్పు చెందారని మాత్రం ఆలోచించడు. జనానికి రోజూ ఓ రెండు గంటలు హాయిగా గడిచిపోతాయి. గురువు ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతుంది. అంతకుమించి జనం మనస్తత్వంలో పెద్ద మార్పు ఉండదు. ఇలాంటి సందర్భంలోనే ఒక జెన్‌ గురువు గుర్తుకు వస్తాడు.

ఆ గురువు ఒక నిర్మానుష్యమైన ప్రాంతంలో నివసించేవాడు. సమయానికి ఏదో కాస్త తినేవాడు. ఏకాంతంగా, మౌనంగా గడిపేవాడు. అటువైపు వెళ్ళేవారు అప్పుడప్పుడు ఆయన దగ్గరకు వచ్చి కూర్చొనేవారు. మాటల్లో దించేవారు. వారికి ఆయన ముక్తసరిగా జవాబు చెప్పి మళ్ళీ మౌనం దాల్చేవాడు. ఆయన చెప్పిన ఆ రెండు మాటలే వారికి ఎంతో విలువైనవిగా అనిపించేవి. క్రమంగా ఆ ప్రాంత ప్రజలు తమకు వీలైనప్పుడల్లా ఆయన ముందు కూర్చొని, ఆయన మాటలు విని సంతోషపడేవారు. ఇదంతా కొందరు ప్రముఖుల దృష్టిలో పడింది. ‘‘జనాన్ని మీరు తప్ప ఇంకెవరు ఉద్ధరించగలరు?’’ అని ఆయనకు నచ్చజెప్పి, ఆ ఊళ్ళోని మందిరానికి పూజారిగా నియమించారు. రోజూ సాయంత్రం అనుగ్రహ భాషణం ఇవ్వవలసిందిగా కోరారు. ఆయన ‘‘సరే’’ అన్నాడు.

మొదటి రోజు కార్యక్రమానికి ఎంతోమంది హాజరయ్యారు. ఆయన కొంతసేపు ప్రసంగించాడు. అందరూ ‘‘అద్భుతం, అమోఘం. ఇలాంటి ప్రసంగాన్ని మా జీవితంలో ఎన్నడూ వినలేదు’’ అంటూ ఆయనకు నమస్కరించారు. ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్పారు. ఆ రోజు కార్యక్రమానికి రానివారు ఎంతో బాధపడి, ఆ మర్నాడు ప్రసంగ సమయానికి చాలాసేపటి ముందే వచ్చేశారు. ఆ ప్రదేశం జనంతో కిక్కిరిసిపోయింది. సరిగ్గా సమయానికి ఆ గురువు వేదిక పైకి చేరుకున్నాడు. అందరూ ఆయన ప్రసంగం వినడానికి తహతహలాడుతున్నారు. ఆయన తన ప్రసంగం ప్రారంభించాడు. ముందురోజు చెప్పిన విషయాన్నే యథాతథంగా మళ్ళీ చెప్పి ముగించాడు. చాలామందికి నిరాశ కలిగింది. ఆ రోజు తమకుతాము సర్ది చెప్పుకొన్నారు. మూడో రోజు ఆయన ప్రసంగం కోసం ఆత్రుతగా వచ్చారు. ఆ రోజు కూడా ఆయన మునుపటి రోజుల్లో చెప్పిందే చెప్పాడు.


ఓపిక నశించిన ఒక వ్యక్తి ‘‘గురువుగారూ! మీకు తెలిసింది ఆ ఒక్క విషయమేనా?’’ అని అడిగాడు. ‘‘మీరు చెప్పగలిగేది ఈ ఒక్క ప్రసంగమేనా?’’ అని మరొకరు ప్రశ్నించారు.

అప్పుడు ఆ గురువు ‘‘నాకు ఎన్నో విషయాలు తెలుసు. ఎన్నో చెప్పగలను. కానీ నేను మొదటి రోజు చెప్పిన విషయాన్నే మీరు గ్రహించి ఆచరించలేదు, అలాంటప్పుడు మిమ్మల్ని ఎలా ముందుకు నడిపించగలను? ‘పోనీ వదిలేద్దామా?’ అంటే అలా మిమ్మల్ని మధ్యలో వదిలెయ్యలేను. తెలుసుకోవడం కాదు... తెలుసుకున్నదాని ఆచరణే ప్రధానం. కాబట్టి నాకు శ్రమ అయినప్పటికీ... నేను చెప్పేది మీరు గ్రహించి, ఆచరించేవరకూ మిమ్మల్ని వదలను’’ అంటూ వేదిక దిగిపోయాడు.

రాచమడుగు శ్రీనివాసులు

గురువు రోజూ క్రమం తప్పకుండా ప్రసంగించి, తనకు ఉన్న శాస్త్ర జ్ఞానాన్ని ధారాళంగా అందరికీ పంచుతాడు. అంతమందిలో ఎందరు తన బోధల్ని గ్రహించి మార్పు చెందారని మాత్రం ఆలోచించడు. జనానికి రోజూ ఓ రెండు గంటలు హాయిగా గడిచిపోతాయి. గురువు ఆశ్రమం దినదినాభివృద్ధి చెందుతుంది. అంతకుమించి జనం మనస్తత్వంలో పెద్ద మార్పు ఉండదు.

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 05:29 AM