గురువు చూపిన దారి
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:53 AM
గురువులకు అతీత శక్తులు ఉంటాయనీ, వాటిని ఎలాగైనా తెలుసుకోవాలని తపించే శిష్యులు కొందరు ఉంటారు. అటువంటి ఒక శిష్యుణ్ణి ఉపాయంతో సన్మార్గం వైపు మళ్ళించిన గురువు కథ ఇది...
సద్బోధ
గురువులకు అతీత శక్తులు ఉంటాయనీ, వాటిని ఎలాగైనా తెలుసుకోవాలని తపించే శిష్యులు కొందరు ఉంటారు. అటువంటి ఒక శిష్యుణ్ణి ఉపాయంతో సన్మార్గం వైపు మళ్ళించిన గురువు కథ ఇది. టిబెట్‌కు చెందిన సుప్రసిద్ధ బౌద్ధ గురువులలో మిలారెపా ఒకరు. మిలారెపా గొప్పతనం గురించి విన్న ఒక యువకుడు ఆయనను కలుసుకున్నాడు. వినయంగా నమస్కరించి ‘‘గురువుగారూ! మీకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని తెలిసి వచ్చాను. మీరు దయతలచి... ఆ శక్తులు నాకు కూడా వచ్చేలా ఏదైనా మంత్రం చెప్పండి’’ అని కోరాడు.
‘‘నాయనా! నాకు ఎలాంటి శక్తులు లేవు. ఏ మంత్రాలూ రావు. మేము మంత్రగాళ్ళం కాదు. ధ్యానంలో కాలం గడుపుతాం. మాకు తెలిసిన నాలుగు మంచి మాటలు ఇతరులకు చెబుతాం అంతే!’’ అన్నాడు మిలారెపా.
‘‘మీరు అలాగే అంటారు. కానీ మీరు అద్భుతాలు చేయగలరని నాకు బాగా తెలుసు. మిమ్మల్ని అంత సులువుగా వదలను. ఏదో ఒక మంత్రం నాకు చెప్పి తీరాల్సిందే. చెప్పేవరకూ ఇక్కడినుంచి కదలను’’ అని ఆ యువకుడు మొండిపట్టు పట్టాడు. మిలారెపా ఏకాంతంగా ధ్యానం చేసుకోవడానికి వీలులేకుండా వెంటపడ్డాడు. ఏదో ఒకటి చేస్తే కాని అతను తనను వదలడని మిలారెపాకు అర్థమయింది. ఒక కాగితం మీద ఏవో కొన్ని మాటలు రాసి ఇచ్చి... ‘‘ఈ రోజు అమావాస్య. రాత్రి ఇందులో ఉన్నదాన్ని అయిదుసార్లు పఠించు. అద్భుతమైన శక్తులు కలుగుతాయి’’ అన్నాడు మిలారెపా.
ఆ యువకుడు కాగితాన్ని లాక్కున్నాడు. మిలారెపాకు కనీసం కృతజ్ఞతలైనా చెప్పకుండా పరుగు తీయడం మొదలెట్టాడు. అతను కొంతదూరం వెళ్ళగానే వెనుకనుంచి మిలారెపా ‘‘బాబూ! ఒక ముఖ్యమైన విషయం చెప్పడం మరచిపోయాను. దాన్ని పఠించేటప్పుడు కోతుల గురించి మాత్రం ఆలోచన రానీయవద్దు. ఆ ఆలోచనలు వస్తే మంత్రం ఫలించదు సుమా! జాగ్రత్త’’ అన్నాడు.
ఆయన మాటలు వినగానే ఆ యువకుడికి అన్ని చోట్లా కోతులే కనిపించసాగాయి. కళ్ళు మూసినా కోతులే, కళ్ళు తెరిచినా కోతులే. రాత్రంతా వాటిని మరచిపోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. అతను ఎంత ఎక్కువగా ప్రయత్నిస్తే అంత ఎక్కువ స్పష్టంగా కోతులు కనిపించాయి. బాగా అలసిపోయి, ఇక చేసేది లేక... మిలారెపా దగ్గరకు వెళ్ళాడు. ‘‘అయ్యా! ఇదిగో మీ మంత్రం. మీరే తీసుకోండి. నాకు నిద్ర పట్టకుండా, ఆ మంత్రాన్ని చదవకుండా కోతుల ఆలోచనలే రాత్రంతా సతాయించాయి. నాకు ఏ శక్తులూ వద్దు. విశ్రాంతి కలిగే మార్గం చూపించండి’’ అని ప్రార్థించాడు. అప్పుడు మిలారెపా ‘‘ప్రశాంతతను మించిన శక్తి లేదు. మనశ్శాంతే గొప్ప శక్తి. ధ్యానం ద్వారా దాన్ని సాధించవచ్చు’’ అని ఆ యువకుడికి బోధించాడు. అందుకు అవసరమైన పద్ధతులను బోధించి, ఆ యువకుణ్ణి ధ్యాన మార్గంలో ప్రవేశపెట్టాడు.
రాచమడుగు శ్రీనివాసులు
ఇవి కూడా చదవండి
ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..
IPL 2026 : రెండో దశ షెడ్యూల్ వచ్చేసింది..