Share News

కష్టంలో సహనం, సుఖంలో కృతజ్ఞత

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:40 AM

మనిషి జీవితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు కష్టాలు అలల్లా విరుచుకుపడతాయి. మరికొన్ని సార్లు సుఖాలు పూలవానలా కురుస్తాయి. ఈ రెండూ అల్లాహ్‌ మనకు ..

కష్టంలో సహనం, సుఖంలో కృతజ్ఞత

సందేశం

మనిషి జీవితం ఎల్లప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు కష్టాలు అలల్లా విరుచుకుపడతాయి. మరికొన్ని సార్లు సుఖాలు పూలవానలా కురుస్తాయి. ఈ రెండూ అల్లాహ్‌ మనకు పెట్టే పరీక్షలే. ‘‘కష్టంలో సహనం, సుఖంలో కృతజ్ఞత చూపినవాడే నిజమైన విశ్వాసి. కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశారు. ఈ వాక్యం... చీకటి ఎంత గాఢమైనదైనా ఉదయం తప్పకుండా వస్తుందనీ, ప్రతి కష్టం తరువాత ఉపశమనం ఉంటుందనే నమ్మకం కలిగిస్తుంది.

దైవ ప్రవక్త మహమ్మద్‌ తన జీవితంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నారు. అనాథగా పెరిగారు, ప్రియమైన వారిని కోల్పోయారు, శత్రువుల హింసను భరించారు. అయినప్పటికీ అల్లాహ్‌పై విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఆయన జీవితం లోకానికి ఆదర్శంగా నిలిచింది. ‘‘విశ్వాసి పరిస్థితి ఎంతో ఆశ్చర్యకరమైనది. అతనికి సుఖం కలిగితే అల్లాహ్‌ కృతజ్ఞతలు తెలుపుతాడు. కష్టం కలిగితే సహనం వహిస్తాడు. ఆ రెండూ అతనికి మేలు చేసేవే. అల్లాహ్‌ ఎవరిని ప్రేమిస్తాడో వారిని పరీక్షిస్తాడు’’ అని ఆయన చెప్పారు. సుఖంలో అహంకారం వద్దని, కష్టంలో నిరాశ కూడదని, కష్టాలు శాపాలు కావనీ, అవి అల్లాహ్‌ ప్రేమకు సూచికలు కూడాననీ, కష్టాల ద్వారా మన పాపాలకు క్షమాపణ కలుగుతుందని ప్రవక్త మాటల్లోని అంతరార్థం.

చాలామంది సుఖం వచ్చినప్పుడు అల్లా్‌హను మరచిపోతారు. వారు సంపద, అధికారం, కీర్తి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలి. కృతజ్ఞత లేని సుఖం చివరకు బాధను మిగుల్చుతుంది. అలాగే మరికొందరు కష్టం వచ్చినప్పుడు నిరాశ చెందుతారు. కానీ ప్రతి కష్టం వెనుక అల్లాహ్‌ ప్రణాళిక ఉంది. ప్రతి ప్రార్థనకు సమయం వచ్చినప్పుడు సమాధానం లభిస్తుంది. సుఖంగా ఉన్నప్పుడు దానం చేయడం, పేదలను ఆదుకోవడం, అనాథలను ప్రేమించడం, తల్లిదండ్రులను గౌరవించడం, కృతజ్ఞతతో ఉండడం, నమాజ్‌ చేయడం, ఖుర్‌ఆన్‌ పఠించడం మనసుకు శాంతిని ఇస్తాయి. కష్టసుఖాలు శాశ్వతం కాదనీ, అల్లాహ్‌ కరుణ మాత్రమే శాశ్వతమని హృదయపూర్వకంగా విశ్వసించాలి. కష్టాలను సహనంతో ఎదుర్కొనే శక్తిని, సుఖాలను కృతజ్ఞతతో స్వీకరించే హృదయాన్ని ప్రసాదించాలని అల్లాహ్‌ను ప్రార్థించాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:40 AM