Share News

ఆస్కార్‌లో ఆటం విప్లవం

ABN , Publish Date - Mar 18 , 2026 | 01:40 AM

ఆస్కార్‌ వేదికపై ఒక అపురూప దృశ్యం. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, పురుషాధిక్య సినిమాటోగ్రఫీ కోటను బద్దలుగొడుతూ ఒక మహిళ విజేతగా నిలిచింది. ‘సిన్నర్స్‌’ చిత్రానికి గాను ఆటం డ్యూరాల్డ్‌ ఆర్కాపా...

ఆస్కార్‌లో ఆటం విప్లవం

ఆస్కార్‌ వేదికపై ఒక అపురూప దృశ్యం. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ, పురుషాధిక్య సినిమాటోగ్రఫీ కోటను బద్దలుగొడుతూ ఒక మహిళ విజేతగా నిలిచింది. ‘సిన్నర్స్‌’ చిత్రానికి గాను ఆటం డ్యూరాల్డ్‌ ఆర్కాపా ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా అవార్డు అందుకోవడం ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కెమెరా వెనుక పనిచేస్తున్న వేలాదిమంది మహిళల సమష్టి గెలుపు.

సోమవారం ఉదయం ప్రపంచ సినీవేదికపై ఒక చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. సినిమాటోగ్రఫీ విభాగంలో తొలిసారిగా ఒక మహిళ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. ‘సిన్నర్స్‌’ చిత్రానికి అద్భుతమైన దృశ్యాలను అందించిన సినిమాటోగ్రాఫర్‌ ఆటం డ్యూరాల్డ్‌ ఆర్కాపా పేరును ప్రకటించినప్పుడు చప్పట్ల మోత మోగింది. అవార్డు అందుకున్న సమయంలో ఆమె చేసిన ప్రసంగం అందరినీ ఆలోచింపజేసింది. ‘‘ఈ గదిలో ఉన్న మహిళలందరూ లేచి నిలబడి ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనందరి కృషితో దక్కిన గౌరవం’’ అన్న ఆమె మాటలు మహిళల సమష్టి ఎదుగుదలకు నిదర్శనంగా నిలిచాయి. ఈ విజయం ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. ఏ రంగంలోనైనా, ముఖ్యంగా పురుషాధిక్యత బలంగా ఉన్న సినిమాటోగ్రఫీ వంటి సాంకేతిక విభాగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకోవడానికి ఏళ్ల తరబడి పోరాటం చేయాల్సి ఉంటుంది. ఆటం డ్యూరాల్డ్‌ విజయం ఈ సుదీర్ఘ పోరాటానికి దక్కిన ఒక గుర్తింపు. ఈ గెలుపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళా టెక్నీషియన్లలో కొత్త ఉత్సాహాన్ని నింపగా, భారతీయ సినీ పరిశ్రమలో.. ముఖ్యంగా కేరళలో దీనిపై లోతైన చర్చ మొదలైంది.

ఎంతకాలం కాదంటారు?

మలయాళ చిత్రపరిశ్రమలోకి దాదాపు రెండు దశాబ్దాల క్రితం అడుగుపెట్టిన సీనియర్‌ సినిమాటోగ్రాఫర్‌ ఫౌజియా ఫాతిమా ఈ విజయంపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ‘‘ఒక గదిలో ఉన్న మహిళను మీరు ఎంతకాలం పట్టించుకోకుండా ఉంటారు? ఏదో ఒక రోజు ఆమె ప్రతిభను గుర్తించి తీరాల్సిందే’’ అని చెప్పుకొచ్చారు. 2002లో రేవతి దర్శకత్వం వహించిన ‘మిత్ర-మై ఫ్రెండ్‌’ చిత్రంతో కెరీర్‌ ప్రారంభించిన ఫౌజియా 10కిపైగా చిత్రాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీ (డీవోపీ)గా పనిచేశారు. ‘‘ఇప్పుడు తొలి విజయం దక్కి ఉండొచ్చు, కానీ గతంలో ఎందరో మహిళలు నామినేట్‌ అయ్యారు. ఇది డీవోపీ పాత్రలో మహిళల ఎంతటి ప్రతిభ కనబరుస్తున్నారో చూపిస్తుంది’’ అని వివరించారు.


మన దగ్గర అవకాశాలు ఎక్కడ?

భారతదేశంలో మరీ ముఖ్యంగా కేరళలో మహిళా సినిమాటోగ్రాఫర్లకు అవకాశాలు చాలా పరిమితం. ఫౌజియా చెబుతున్న దాని ప్రకారం.. ప్రాంతీయ సినిమాల్లో మహిళలను టెక్నీషియన్లుగా చేర్చుకోవాలనే స్పృహ చాలా తక్కువగా ఉంది. అందుకే ఇక్కడి ప్రతిభావంతులు ముంబై వంటి నగరాలకు వలస వెళ్తున్నారు. షాజీ ఎన్‌ కరుణ్‌ వంటివారు కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ (కేఎ్‌సఎ్‌ఫడీసీ) చైర్మన్‌గా ఉన్నప్పుడు మహిళా టెక్నీషియన్లకు ప్రాధాన్యం ఇచ్చే వారని, అటువంటి చొరవ ప్రతిచోటా అవసరమని ఆమె గుర్తుచేశారు.

3333Navya.jpg

కొనసాగుతున్న వివక్ష

మలయాళంలో పలువురు డీవోపీల వద్ద అసిస్టెంట్‌గా పనిచేసిన త్రిసూర్‌కు చెందిన యువ సినిమాటోగ్రాఫర్‌ ఉమాకుమారపురం కూడా ఫౌజియా అభిప్రాయాలతో ఏకీభవించారు. ‘‘ఆటం వంటి మహిళలకు ఈ గుర్తింపు ఎప్పుడో రావాల్సి ఉంది. ఇది నమ్మశక్యం కాని విజయం, కానీ చాలా ఆలస్యంగా దక్కింది’’ అని అన్నారామె. మహిళల పట్ల పరిశ్రమలో ఇంకా కొన్ని అపోహలు ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘చాలామంది దర్శకులకు మహిళల మీద నమ్మకం ఉండదు. ఒక మహిళ ఈ పని పూర్తిచేయగలదా? అని ప్రశ్నిస్తారు. అనుభవం లేదనే వాదన కొంతవరకు సరైనదే కావొచ్చు. కానీ అసలు అవకాశమే ఇవ్వనప్పుడు అనుభవం ఎలా వస్తుంది’’ అని ఉమ తన ఆవేదనన పంచుకున్నారు. మహిళా సినిమాటోగ్రాఫర్లను ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలకే పరిమితం చేస్తున్నారని, దీనివల్ల ఇతర జానర్లలో వారి ప్రతిభను నిరూపించుకునే అవకాశం లేకుండా పోతోందని చెప్పుకొచ్చారు. యాక్షన్‌, థ్రిల్లర్‌ వంటి భారీ చిత్రాలకు పనిచేసే అవకాశం దొరికితేనే వారి పూర్తి సామర్థ్యం బయటపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు.

తోడుగా నిలుస్తున్న ‘కలెక్టివ్‌’

మొదట్లో ఈ రంగంలో మహిళలు తమనుతాము ఒంటరిగా భావించేవారు. బి.ఆర్‌.విజయలక్ష్మి వంటివారు తమిళ సినిమాల్లో ట్రెండ్‌ సెట్టర్లుగా ఉన్నా, మిగిలినవారికి ఒక సపోర్ట్‌ సిస్టం ఉండేది కాదు. ఈ లోటును పూడ్చేందుకే ‘ఇండియన్‌ ఉమెన్‌ సినిమాటోగ్రఫీ కలెక్టివ్‌’ (ఐడబ్ల్యూసీసీ) ఏర్పడింది. అప్పట్లో ఒకరిద్దరితో మొదలైన ఈ గ్రూప్‌ నేడు వివిధ భాషాలకు చెందిన 200 మందికిపైగా మహిళా సినిమాటోగ్రాఫర్లతో ఒక బలమైన వ్యవస్థగా ఎదిగింది.

ఇవి కూడా చదవండి..

ప్రతీకారమే.. మధ్యవర్తి దేశాలకు తేల్చిచెప్పిన మొజ్తాబా

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్‌ను చంపేశాం.. ఇజ్రాయెల్ ప్రకటన

Updated Date - Mar 18 , 2026 | 01:40 AM