Share News

New Year Resolutions: గమ్యం కాదు.. సంకల్పం ముఖ్యం

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:26 AM

కొత్త ఏడాది వస్తోందంటే చాలు ‘న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌’ గుర్తొస్తుంది. అయితే, ‘ఎలాగూ పాటించం కదా.. ఆమాత్రానికి కొత్తగా ఈ సంకల్పాలు దేనికి...

New Year Resolutions: గమ్యం కాదు.. సంకల్పం ముఖ్యం

కొత్త ఏడాది వస్తోందంటే చాలు ‘న్యూ ఇయర్‌ రిజల్యూషన్‌’ గుర్తొస్తుంది. అయితే, ‘ఎలాగూ పాటించం కదా.. ఆమాత్రానికి కొత్తగా ఈ సంకల్పాలు దేనికి?’

అన్న సందేహం రావడం కూడా సహజం. అయితే అవి నిలవకపోయినా రిజల్యూన్స్‌ చెప్పుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఆశకు ప్రతిరూపం.. రిజల్యూషన్‌

మనం తీర్మానం చేసుకున్నప్పుడు మన జీవితంపై మనకు నియంత్రణ ఉందనే భావనను అది ఇస్తుందని, మార్పు సాధ్యమనే నమ్మకాన్ని పెంచుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మనం ఆ తీర్మానాన్ని నిలబెట్టుకోలేకపోయినా, దానిని మొదలుపెట్టేటప్పుడు కలిగే ఉత్సాహం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని అంటున్నారు. ప్రయత్నంలో విఫలం కావడం అంటే కష్టం వృథా అయినట్టు కాదు, మన బలాలేంటి? బలహీనతలేంటి? అన్న విషయంలో స్పష్టత వస్తుందని, ఇది వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడుతుందని చెబుతున్నారు.

విజయం సంగతి తరువాత

మనం చేసిన తీర్మానంలో ఎంతవరకు విజయం సాధించామనే విషయాన్ని పక్కనపెడితే, మన సంకల్పం ఏంటన్నదే ముఖ్యం. సంకల్పం అనేది దిశను చూపిస్తుందని.. ఫలితాన్ని కాదని అంటారు నిపుణులు. ఫలితం ఎప్పుడూ మన చేతుల్లో ఉండదు. కానీ ప్రయత్నం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఉదాహరణకు.. ‘నేను బరువు తగ్గాలి’ అనుకోవడం కంటే ‘నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి’ అని సంకల్పించుకోవడం వల్ల విఫలమైనప్పుడు వచ్చే గిల్టీ ఫీలింగ్‌ తక్కువగా ఉంటుంది.


క్యాలెండర్‌తో కొత్త ఉత్సాహం

ఏడాది మారగానే అన్నీ మారిపోవు. కానీ, మానసికంగా ‘కొత్త ఏడాది’ అనేది ఒక తెల్ల కాగితం లాంటిది. పాత వైఫల్యాలు, పశ్చాత్తాపాలను అక్కడే వదిలేసి మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టడానికి ఇదొక గొప్ప అవకాశం. ఈ ‘క్యాలెండర్‌ రీసెట్‌’ మన జీవితానికి ఒక పద్ధతిని, క్రమశిక్షణను ఇస్తుంది. మన అలవాట్లను మనం సరిచూసుకోవడానికి ఇదొక చక్కని సమయం.

పొరపాటు ఎక్కడ?

తీర్మానాలు తప్పడం సహజం, అయితే ఆ తప్పు తీర్మానానిది కాదు. మనం దాన్ని చూసే విధానానిది. చాలామంది తమ శక్తికిమించి అతిపెద్ద లక్ష్యాలు పెట్టుకుంటారు. మరికొందరు చిన్నచిన్న విషయాలకే పరిమితమవుతారు. కచ్చితమైన గడువులు పెట్టి ఒత్తిడిని ఏరికోరి తెచ్చి నెత్తిన పెట్టుకుంటారు. దీనికి బదులుగా మార్పు అనేది ఒక్క రోజులో రాదని గుర్తుంచుకోవాలి. లక్ష్యం కంటే ప్రయాణం మీదే దృష్టిపెట్టాలి. పరిపూర్ణత కోసం కాకుండా పురోగతి కోసం ప్రయత్నించాలి.

ఈసారి తీర్మానం ఎందుకు చేసుకోవాలి?

ఈసారి కూడా కచ్చితంగా రిజల్యూషన్‌ తీసుకోవాలి. ఎందుకంటే.. అందుకు చేసే ప్రయత్నం వృథాపోదు. ఉదాహరణకు మీరు ప్రతిరోజు నడవాలని తీర్మానం చేసి మూడువారాలే నడిచారనుకుందాం. ఆ 21 రోజులు నడవడం వల్ల మీ శరీరానికి, మనసుకు మేలే జరిగింది కదా! ఆ ప్రయోజనం ఎక్కడికీ పోదు. మనం పెద్దవాళ్లం అవుతున్న కొద్దీ ‘మనం మారలేం.. పరిస్థితులు ఇంతే’ అనే నిరాశలో ఉంటాం. కానీ, తీర్మానం చేసుకోవడం అంటే ‘నేను మారగలను.. రేపు బాగుంటుంది’ అని మన మీద మనకు ఉన్న నమ్మకం. అలాగే, ఏదైనా కొత్తగా చేయాలని అనుకున్నప్పుడు మన మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి తీర్మానాలు అనేవి మనల్ని మనం కట్టడి చేసుకోవడానికి కాదు, మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి. అది రెండు రోజులు నిలిచినా, 200 రోజులు నిలిచినా ఆ ప్రయత్నం వెనుక ఉన్న మీ తపన గొప్పది. కాబట్టి ఈ కొత్త ఏడాది కూడా ధైర్యంగా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. అది విఫలమైనా పర్లేదు. ఎందుకంటే ఎదుగుదలకు గ్యారెంటీ కార్డు అక్కర్లేదు. గట్టి ప్రయత్నం ఉంటే చాలు!

ఇవి కూడా చదవండి

ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..

వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..

Updated Date - Jan 01 , 2026 | 07:26 AM