New Year Home Decor Ideas: ఇల్లంతా కొత్తగా..
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:24 AM
కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఇంటిని సరికొత్తగా అలంకరించేస్తే కుటుంబసభ్యుల ఆనందానికి అవధులుండవు. న్యూ ఇయర్ శోభ ఉట్టిపడేలా...
కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఇంటిని సరికొత్తగా అలంకరించేస్తే కుటుంబసభ్యుల ఆనందానికి అవధులుండవు. న్యూ ఇయర్ శోభ ఉట్టిపడేలా అందంగా తక్కువ సమయంలో ఇల్లంతా ఎలా ముస్తాబు చేయాలో చూద్దాం...
కొత్తదనాన్ని స్వాగతించడానికి బెలూన్లను మించినవి లేవు. బంగారం, వెండి లేదంటే మీకిష్టమైన రంగుల్లో మెరిసే బెలూన్లను తోరణాల్లా కట్టి ఇంట్లో వేలాడదీస్తే ఇల్లంతా శోభగా కనిపిస్తుంది. తలుపులు, కిటికీలకు కూడా ఈ బెలూన్లను అలంకరించవచ్చు. కొన్ని బెలూన్లను ఇంట్లోనే అక్కడక్కడ నేలమీద వదిలేస్తే బాగుంటుంది. ఇంట్లో ఉన్న వాల్ క్లాక్, టీవీల మీద కూడా బెలూన్లు, నక్షత్రాల దండలు అమర్చవచ్చు.
ప్రస్తుతం రకరకాల ఫెయిరీ లైట్లు అందుబాటులో ఉంటున్నాయి. రాత్రిపూట వీటిని వెలిగిస్తే ఇల్లంతా శోభాయమానంగా వెలిగిపోతుంది. రంగురంగుల ఫెయిరీ లైట్ల దండలను కర్టెన్ల మీద, కిటికీ ఫ్రేమ్‌ల చుట్టూ, డ్రెస్సింగ్ మిర్రర్ ఇరు పక్కల, సోఫా వెనకాల, అరల మీదుగా ఏర్పాటు చేస్తే ఇల్లు సరికొత్తగా కనిపిస్తుంది.
డైనింగ్ టేబుల్‌ను కూడా నూతన సంవత్సర శోభ కనిపించేలా సర్దేయాలి. సాధ్యమైనంత వరకు గాజు గిన్నెలు, పింగాణి ప్లేట్లు, డిజైనర్ గాజు గ్లాసులను పొందికగా సర్దాలి. మధ్య మధ్యలో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపే క్యాండిల్స్, టిష్యూ పేపర్ హోల్డర్స్ లాంటివి అరేంజ్ చేస్తే బాగుంటుంది. టేబుల్‌కు ఓ పక్కగా బెలూన్లు, ఫ్లవర్ బొకేలను అందంగా అమర్చవచ్చు.

హాల్, బాల్కనీల్లో తేలికపాటి పేపర్ లాంతర్లను వేలాడదీయవచ్చు. అందరూ కలిసి కబుర్లు చెప్పుకునే చోట గోడలకు గోల్డ్ కలర్ లేదా లేత రంగుల పేపర్ ఫ్లవర్స్‌ను అతికిస్తే అహ్లాదకరంగా ఉంటుంది.
హాల్లో ఒక మూలగా చిన్న ఫొటో బూత్‌ను ఏర్పాటు చేస్తే బంధు మిత్రుల సందడి మొత్తం అక్కడే ఉంటుంది. గోడకు వేలాడే లైట్లు, బెలూన్ల గుత్తులు ఏర్పాటు చేస్తే ఫొటోలు బాగా వస్తాయి. ఓ పక్కగా చిన్న టేబుల్ వేసి దాని మీద సువాసన వెదజల్లే క్యాండిల్స్, శుభాకాంక్షలు తెలిపే చిన్న హోర్డింగ్‌ను ఉంచితే ఫొటోలు మంచి మెమరీని క్రియేట్ చేస్తాయి. అతిథులు చేత్తో పట్టుకోవడానికి కొన్ని బెలూన్లు, స్టార్లు, అందమైన బాటిల్స్‌ను ఓ పక్కగా ఉంచితే వాటితో రకరకాల ఫోజులు ప్రయత్నిస్తారు.
ఇంట్లోకి ప్రవేశిస్తూనే అహ్లాదం పంచేలా లైట్లు, బెలూన్లు, పూలతో తయారుచేసిన స్వాగత తోరణాన్ని గుమ్మం చుట్టూ అలంకరిస్తే ఇంటి అందం రెట్టింపవుతుంది.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..