Share News

అంతా ఒక నాటకం

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:39 AM

టిబెట్‌కు చెందిన జెన్‌ గురువుల్లో ప్రముఖుడు నరోపా. అతను 84 మంది మహా సిద్ధ గురువుల్లో ఒకడు. ఆరు రకాల యోగ పద్ధతుల్ని అతను ఆవిష్కరించాడు. నరోపా.. నలందా విశ్వవిద్యాలయంలో...

అంతా ఒక నాటకం

జెన్‌ కథ

టిబెట్‌కు చెందిన జెన్‌ గురువుల్లో ప్రముఖుడు నరోపా. అతను 84 మంది మహా సిద్ధ గురువుల్లో ఒకడు. ఆరు రకాల యోగ పద్ధతుల్ని అతను ఆవిష్కరించాడు. నరోపా.. నలందా విశ్వవిద్యాలయంలో వేదాంత తత్త్వాన్ని, తంత్ర శాస్త్రాన్ని అభ్యసించాడు. బౌద్ద గురువు తిలోపా శిష్యరికంలో ధ్యానమార్గంలోకి ప్రవేశించాడు. సుప్రసిద్ధ జెన్‌ గురువు మిలారెపాకు గురువు మార్పా. ఆ మార్పాకు గురువు నరోపా అంటే.. నరోపా గొప్పదనం ఏమిటో అర్థమవుతుంది.

అయితే నరోపాలో అన్నీ సద్గుణాలు, మంచి అలవాట్లే ఉన్నాయనుకుంటే పొరపాటే. అతన్ని ‘వికారాలు కలిగిన గురువు’గా చాలామంది పరిగణించేవారు. శిష్యులకు మంచి విషయాలను అతను బోధించేవాడు. ధ్యానం నేర్పించేవాడు. తనూ ధ్యానం చేసేవాడు. కానీ ఖాళీ సమయాల్లో అతను పానశాలలకు వెళ్ళేవాడు. అక్కడ ఉన్నవారితో మద్యం సేవించేవాడు. తమ గురువును తాగుబోతుల మధ్య తాగుబోతుగా ఊహించుకోవడం అతని శిష్యులకు కష్టంగా ఉండేది. కానీ నరోపాకు జనం, తన శిష్యులు ఏమంటారో అనే ఆలోచన ఉండేది కాదు.

‘‘అయ్యా! మీరు కొన్ని వందలమందికి బోధించే గురువు. ధ్యానాన్ని నేర్పించే వ్యక్తి. జ్ఞాన సిద్ధిని సాధించుకున్న గొప్పవారు. మీరు ఇలా పానశాలకు వచ్చి, ఈ తాగుబోతుల మధ్య కూర్చొని, మత్తు పానీయాలు తాగితే... ఎలా?’’ అని అతన్ని ఎరిగినవారు ప్రశ్నించేవారు. ‘‘నాయనలారా! ఇదంతా ఒక ఆట అని నాకు తెలుసు. నాటకం అని చాలా బాగా తెలుసు. నాటకం అనే స్పృహ నిరంతరం ఉన్నప్పుడు... అందులో ఏ పాత్ర పోషిస్తే ఏమిటి? అందులో తప్పేముంది? సద్గుణ సంపన్నుడి పాత్ర పోషిస్తే ఒప్పు, తాగుబోతు పాత్ర పోషిస్తే తప్పూనా? అంతర్ముఖుడినై, శాశ్వత తత్త్వమే అసలైన ‘నేను’ అనే ఎరుక కలిగిన నాకు వీటి గురించి కానీ, ఎవరు ఏమనుకుంటారని కానీ భయం ఎందుకుంటుంది? ఈ మత్తు పానీయమూ ఒక కలే. అది కలిగించే మత్తూ కలే. ఆ స్పృహ నాలో ఎన్నటికీ చెక్కు చెదరదు. ఏకాంతంగా ధ్యానంలో ఉన్నా, అందరితో కూర్చొని తాగుతూ ఉన్నా... నేను నేను గానే ఉన్నాను’’ అని చెప్పేవాడు. నరోపా తీరు గురించి ఓషో ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ ‘‘అవధూతల ప్రవర్తన గురించి మన గ్రంథాలు వివరిం చాయి. నరోపా కూడా అటువంటివాడే’’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:39 AM