Share News

లఖ్‌నవూ నుంచి నాసా వరకు

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:13 AM

ఆమెది ఒక సాదాసీదా ప్రయాణం కాదు. అది అడ్డంకులను ఛేదించిన ఒక ధ్రువతార గాధ. 1957లో లఖ్‌నవూ వీధుల్లో నిలబడి ఆకాశంలో వెళ్తున్న ‘స్పుత్నిక్‌’ ఉపగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ కళ్లు.....

లఖ్‌నవూ నుంచి నాసా వరకు

ఆమెది ఒక సాదాసీదా ప్రయాణం కాదు. అది అడ్డంకులను ఛేదించిన ఒక ధ్రువతార గాధ. 1957లో లఖ్‌నవూ వీధుల్లో నిలబడి ఆకాశంలో వెళ్తున్న ‘స్పుత్నిక్‌’ ఉపగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ కళ్లు.. కొన్నేళ్ల తర్వాత అదే అంతరిక్ష రహస్యాలను ప్రపంచానికి విడమర్చి చెబుతాయని ఎవరూ ఊహించి ఉండరు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో అత్యున్నత స్థాయికి ఎదిగి ‘జేమ్స్‌ వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ వంటి ప్రాజెక్టులకు దిశానిర్దేశం చేస్తున్న డాక్టర్‌ హషీమా హసన్‌ జీవితం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక అద్భుత ప్రస్థానం.

ఉత్తర ప్రదేశ్‌లోని చారిత్రక నగరం లఖ్‌నవూ. గంగా-జమున తెహజీబ్‌కు నిలయమైన ఆ నగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు హషీమా హసన్‌. అప్పట్లో ఆడపిల్లలు చదువుకోవడం, అది కూడా సైన్స్‌ వంటి క్లిష్టమైన సబ్జెక్టులను ఎంచుకోవడం ఒక సాహసమే. కానీ, హషీమా తాతగారు ఆమెలోని జిజ్ఞాసను గుర్తించారు. ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఆమె వేసే ప్రశ్నలకు ఆయన ఓపికగా సమాధానం చెప్పేవారు. 1957లో రష్యా ప్రయోగించిన స్పుత్నిక్‌ ఉపగ్రహం రాత్రివేళ ఆకాశంలో మెరిసే చుక్కలా కదులుతుంటే తన ఇంటి డాబా పై నుంచి చూసిన హషీమా మనసులో ఒక బలమైన బీజం పడింది. ‘‘ఆ మెరిసే చుక్క అక్కడికి ఎలా వెళ్లింది? అక్కడ ఏముంది?’’ అన్న ప్రశ్నలే ఆమెను నాసా గడప దాకా నడిపించాయి.


ఆక్స్‌ఫర్డ్‌లో పీహెచ్‌డీ

లక్నో విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసిన హషీమా అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో మాస్టర్స్‌ చేశారు. అక్కడ ఆమె ప్రతిభకు గోల్డ్‌ మెడల్‌ వరించింది. అయితే, ఆమె లక్ష్యం ఇంకా పెద్దది. ఫిజిక్స్‌లో లోతైన పరిశోధనలు చేయాలనే తపనతో ఆమె ప్రతిష్ఠాత్మక ‘టాటా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్స్‌’లో చేరారు. ఆ తర్వాత ఆమెకు ఆక్స్‌ఫర్డ్‌లో విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేసే అవకాశం లభించింది. న్యూక్లియర్‌ ఫిజిక్స్‌లో ఆమె చేసిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ఆ కాలంలో విదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయడం ఒక మహిళగా ఆమెకు ఎన్నో సామాజిక సవాళ్లను విసిరింది. కానీ ఆమె లక్ష్యం ముందు అవేవీ నిలవలేదు.

నాసాలో ‘మిషన్‌ క్రిటికల్‌’ బాధ్యతలు

1994లో నాసాలో చేరడం హషీమా జీవితంలో అతిపెద్ద మలుపు. అప్పట్లో నాసా ప్రతిష్ఠాత్మక ‘హబుల్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటోంది. టెలిస్కోప్‌ కంటిచూపు సరిగా లేకపోవడంతో అది పంపే చిత్రాలు మసకగా వస్తున్నాయి. ఆ సమయంలో ‘ఆప్టికల్‌ టెలిస్కోప్‌ అసెంబ్లీ సైంటి్‌స్ట’గా హషీమా రంగంలోకి దిగారు. టెలిస్కోప్‌ లోపాలను సరిదిద్దే సాఫ్ట్‌వేర్‌, లెన్స్‌ అమరికలో ప్రతిభ చూపడంతో హబుల్‌ మళ్లీ స్పష్టమైన చిత్రాలను పంపడం మొదలుపెట్టింది.

విశ్వ రహస్యాల వేట

హషీమా ప్రస్తుతం నాసా ప్రధాన కార్యాలయంలో సీనియర్‌ సైంటి్‌స్టగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ముఖ్యంగా మానవ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ‘జేమ్స్‌వెబ్‌ స్పేస్‌ టెలిస్కోప్‌’ ప్రాజెక్ట్‌లో డిప్యూటీ ప్రోగ్రాం సైంటి్‌స్టగా వ్యవహరిస్తున్నారు. బిలియన్‌ ఏళ్ల క్రితం విశ్వం ఎలా ఉండేదో తెలుసుకునే ఈ మహాయజ్ఞంలో ఆమె పాత్ర ఎంతో కీలకం. అనంతమైన విశ్వంలో నక్షత్రాల పుట్టుకను, గ్రహాల ఆవిర్భావాన్ని అధ్యయనం చేసే ఈ ప్రాజెక్ట్‌లో ఒక భారతీయ మహిళా శాస్త్రవేత్త కీలక నిర్ణయాలు తీసుకోవడ మనందరికీ గర్వకారణం.

సైన్స్‌పై మమకారం

హషీమా కేవలం ప్రయోగశాలకే పరిమితం కాలేదు. నాసాలో ఆమె అనేక విద్యా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. సైన్స్‌ అంటే భయం పోగొట్టి పిల్లల్లో ముఖ్యంగా అమ్మాయిల్లో పరిశోధనా తృష్ణను పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. ‘‘శాస్త్రవేత్త కావడానికి మేధస్సు కంటే ముందు పట్టుదల, ఆసక్తి ముఖ్యం’’ అని ఆమె ఎప్పుడూ చెబుతుంటారు. మాతృదేశం భారత్‌ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడినా తన మూలాలను ఆమె ఎప్పుడూ గౌరవిస్తారు. భారతీయ శాస్త్రవేత్తలతో, విద్యార్థులతో సంభాషించడానికి ఆమె ఎప్పుడూ ఉత్సాహం చూపుతారు. నాసా నుంచి ఆమె పొందిన అనేక అవార్డులు, రివార్డులు, ఆమె కృషితోపాటు భారతీయ మేధస్సుకు నిదర్శనం.

ఇవి కూడా చదవండి

మచిలీపట్నంలో భారీ చోరీ.. ఉపాధ్యాయురాలి ఇంట్లో 50 తులాల బంగారం దొంగతనం

మీ పరిశీలనా శక్తికి టెస్ట్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 45 సెకెన్లలో కనిపెట్టండి..

Updated Date - Feb 26 , 2026 | 03:13 AM