దర్శనం ఏడాదికి నాలుగు వారాలే
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:57 AM
పశ్చిమ కనుమల్లో, బావలీ నదీ తీరాన, దట్టమైన అడవిలో పరమశివుడు కొలువైన చోటు... కేరళలోని కొట్టియూర్. దీన్ని అత్యంత పురాతనమైన యాత్రా ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ నదికి ఇరువైపులా...
ఆలయదర్శనం
దక్ష యజ్ఞ భూమిలో...
పశ్చిమ కనుమల్లో, బావలీ నదీ తీరాన, దట్టమైన అడవిలో పరమశివుడు కొలువైన చోటు... కేరళలోని కొట్టియూర్. దీన్ని అత్యంత పురాతనమైన యాత్రా ప్రదేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు. ఇక్కడ నదికి ఇరువైపులా రెండు ఆలయాలున్నాయి. పశ్చిమ తీరాన ఉన్నది ఇక్కరె కొట్టియూర్ ఆలయం. ఇది ఏడాది పొడుగునా తెరచి ఉంటుంది. తూర్పున ఉన్న అక్కరె కొట్టియూర్‌లో ఏడాదిలో దాదాపు నాలుగు వారాలు మాత్రమే శివుడు దర్శనమిస్తాడు. శక్తిపీఠాల జన్మస్థలంగా పేరుపొందిన ఈ ప్రదేశం వెనుక కథేమిటంటే....
స్థల పురాణం: దక్షిణ కాశీగా కేరళీయులు పిలుచుకొనే ఈ ప్రాంతంలోనే దక్ష యజ్ఞం జరిగిందని, సతీదేవి ఆత్మార్పణ చేసుకున్న చోటు, వీరభద్రుడు దక్ష యజ్ఞ వాటికను ధ్వంసం చేసిన చోటు ఇదేనని (హరిద్వార్ సమీపంలోని కన్‌ఖల్‌ను దక్షయజ్ఞ భూమిగా ఉత్తరాదివారు భావిస్తారు) స్థలపురాణం చెబుతోంది. అందుకే అక్కరె కొట్టియూర్‌లో శాశ్వతమైన ఆలయం ఉండదు. మళయాళ పంచాంగం ప్రకారం... ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో ఇక్కడ మహోత్సవాలను నిర్వహిస్తారు. నది నుంచి రాళ్ళను తీసుకువచ్చి ఒక వేదికను ఏర్పాటు చేస్తారు. దాని మీద స్వయంభువైన శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు. ఆ లింగం ముందు భక్తులు లేత కొబ్బరికాయలను మొక్కుగా సమర్పిస్తారు. హోమగుండంలో నెయ్యి పొయ్యడంతో మొదలయ్యే ఈ ఉత్సవాలు... విగ్రహానికి చేసే నారికేళ జలాభిషేకంతో ముగుస్తాయి. కేవలం ఈ ఉత్సవాల సమయంలో మాత్రమే అక్కరె కొట్టియూర్ ఆలయాన్ని తెరుస్తారు.

ఆ సందర్భంలో తాత్కాలికంగా కొబ్బరి, ఈత ఆకులతో మండపాలు నిర్మిస్తారు. ఊత్సవాలు పూర్తయ్యాక వాటిని తొలగిస్తారు. వయనాడులోని ముతిరేరికావు నుంచి ఖడ్గాన్ని తీసుకురావడం, మనతాన గ్రామంలో భద్రపరచిన బంగారు, వెండి పాత్రలను, ఆభరణాలను కొట్టియూర్‌కు తరలించడం, కొబ్బరి నీళ్ళ సమర్పణ, ఏనుగులపై శివుడు, పార్వతి, విగ్రహాల ఊరేగింపు లాంటి అనేక కార్యక్రమాలు ఈ ఉత్సవాల్లో భాగంగా జరుగుతాయి. ఉత్సవ సమయాల్లో చుట్టుపక్కల ఆలయాల నుంచి ఇక్కడికి వివిధ వస్తువులు కానుకలుగా వస్తాయి. తీరానికి ఆవలవైపు ఉన్న ఇక్కరె కొట్టియూర్ ఆలయాన్ని వడక్కేశ్వరం ఆలయంగా వ్యవహరిస్తారు. ఇక్కడ నిత్యపూజలు జరుగుతాయి. ఈ పూజా విధానాన్ని ఆదిశంకరులు ఏర్పాటు చేశారని చెబుతారు. ఈ క్షేత్రాన్ని త్రిమూ ర్తి క్షేత్రంగా, శక్తి క్షేత్రంగా భక్తులు ఆరాధిస్తారు.
ఎలా వెళ్ళాలి?: కేరళలోని కన్నూర్ విమానాశ్రయానికి 50 కిలోమీటర్ల దూరంలో కొట్టియూర్ ఉంది. సమీప రైల్వే స్టేషన్ దాదాపు 55 కిలోమీటర్ల దూరంలోని తలస్సేరిలో ఉంది. కేరళలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News