సౌత్ నన్ను ఆదరించింది
ABN , Publish Date - May 24 , 2026 | 03:12 AM
వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక ముద్రవేసిన స్టార్ హీరోయిన్ జ్యోతిక. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘సిస్టమ్’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
వైవిధ్యమైన పాత్రలతో దక్షిణాది సినీ పరిశ్రమలో ప్రత్యేక ముద్రవేసిన స్టార్ హీరోయిన్ జ్యోతిక. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘సిస్టమ్’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ ప్రాజెక్ట్ ప్రమోషన్స్ సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, నార్త్-సౌత్ చిత్ర పరిశ్రమల మధ్య ఉన్న పని సంస్కృతి, మహిళా నటుల హక్కుల గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడారు. నటిగా తన అంతరంగాన్ని ఆవిష్కరించిన ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
నా మొదటి హిందీ సినిమా ‘డోలీ సజాకే రఖ్నా’ బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అయినప్పుడు.. బాలీవుడ్ ఇండస్ట్రీ నాకు ఒక్కసారిగా తలుపులు మూసేసింది. మొదటి సినిమాతోనే వైఫల్యాన్ని ఎదుర్కోవడం నన్ను తీవ్ర నిరాశకు గురిచేసింది. బాలీవుడ్ తిరస్కరించిన ఆ సమయంలో సౌత్ పరిశ్రమ నన్ను ఎంతగానో ఆదరించింది. నా మొదటి తమిళ సినిమా ఆశించిన విజయం సాధించకపోయినా అక్కడి మేకర్స్, ప్రేక్షకులు నా వైఫల్యాన్ని చూడలేదు.
సొంతింటి అమ్మాయిలా గుర్తింపు
సౌత్ మేకర్స్ నాలోని నటిని, నా ప్రతిభను గుర్తించి వరుసగా ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు. నిజం చెప్పాలంటే చెన్నై నగరం, అక్కడి ప్రేక్షకులు నేను ఊహించిన దానికంటే ఎంతో ఎక్కువే ఇచ్చి నన్ను వారి సొంత ఇంటి అమ్మాయిలా గుండెల్లో పెట్టుకున్నారు. ఆ ఆదరణే నన్ను సౌత్‌లో దశాబ్దాలపాటు స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత వివాహం, పిల్లల బాధ్యతల వల్ల నేను సినిమాలకు చాలా కాలంపాటు లాంగ్ బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత పూర్తిస్థాయిలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు నాలో తెలియని ఒక భయం, చేతుల్లో వణుకు మొదలయ్యాయి.
సున్నా నుంచి సరికొత్త ప్రయాణం
గతంలో నాకు ఎంత అనుభవం ఉన్నా.. కెరీర్‌ను మళ్లీ మొదటి నుంచి, సున్నా నుంచి ప్రారంభిస్తున్నట్టు అనిపించింది. నటన మాత్రమే కాదు.. సుదీర్ఘ విరామం కారణంగా హిందీ భాషపై పట్టు కోల్పోవడంతో లాంగ్వేజ్ కూడా నాకు పెద్ద సవాలుగా మారింది. అయితే నా ఈ సెకండ్ ఇన్నింగ్స్‌లో బాలీవుడ్‌కు తిరిగి వచ్చాక ఇక్కడ గొప్ప సానుకూల మార్పును గమనించాను. ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా డిజిటల్ యుగంలో ఓటీటీ రంగం విస్తరించిన తర్వాత 40 ఏళ్లు పైబడిన మహిళా నటుల కోసం ఎంతో వైవిధ్యమైన, సవాలుతో కూడిన పవర్‌ఫుల్ పాత్రలు రాస్తున్నారు.
వయసు హద్దులు చెరిపేసే ఓటీటీ
ఒకప్పుడు హీరోయిన్లకు 30 ఏళ్లు దాటితే కెరీర్ ముగిసిపోయిందనే ముద్ర వేసేవారు. కానీ నేడు ఆ హద్దులు పూర్తిగా చెరిగిపోయాయి. మహిళా ప్రాధాన్యం ఉన్న వైవిధ్యమైన కథలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయి. నిజాయతీగా చెప్పాలంటే ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీ ఇంకా ఎంతో మారాల్సి ఉంది. 40 ప్లస్ మహిళల కోణంలో కథలను అన్వేషించడంలో సౌత్ ఇంకా వెనుకబడే ఉంది. నార్త్, సౌత్ పరిశ్రమలు రెండింటిలోనూ ప్లస్‌లు, మైనస్‌లు ఉన్నాయి.
పనిగంటల వివాదం
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన ‘8 గంటల పనివేళల’ అంశంపై నా అభిప్రాయం చాలా స్పష్టం. దీపికా పదుకొణె తన సినిమాల్లో 8 గంటల షిఫ్ట్ అడగడంలో ఎలాంటి తప్పు లేదు. నిజానికి సౌత్ ఇండస్ట్రీలో నేను పనిచేసినప్పుడు ఇలాంటి డిమాండ్‌ను ప్రత్యేకంగా అడగాల్సిన అవసరమే ఎప్పుడూ రాలేదు. ఎందుకంటే అక్కడ 99 శాతం సినిమాల షూటింగ్స్ సాయంత్రం 6 గంటలకల్లా ప్యాకప్ అయిపోతాయి. ఉదయం 7 గంటలకో, లేదా 9 గంటలకో షూటింగ్ ప్రారంభించి సాయంత్రం కచ్చితంగా 6 గంటలకు ముగించడం అక్కడ దశాబ్దాలుగా పాటిస్తున్న ఒక ఆరోగ్యకరమైన అలవాటు. కానీ బాలీవుడ్‌లో మాత్రం ఉదయం నుంచి రాత్రి వరకు 12 గంటలపాటు విరామం లేకుండా సుదీర్ఘమైన షిఫ్ట్‌లు నడుస్తుంటాయి. ఇది శారీరకంగా, మానసికంగా ఎంతో అలసటను కలిగిస్తుంది. చిత్ర పరిశ్రమలో ఎంతోమంది స్టార్ హీరోలు 8 గంటల సమయం ముగియగానే.. ఆఖరికి షాట్ పూర్తయిందా లేదా అని కూడా చూడకుండా నేరుగా కారెక్కి వెళ్లిపోతుంటారు. వారిని ఎవరూ ప్రశ్నించరు. వారినెవరూ తప్పుబట్టరు.
మాపైనే ఎందుకీ వివక్ష?
కెరీర్‌లో ఒక మంచి స్థానానికి చేరుకుని, ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్న ఒక నటి తన పనిగంటల గురించి, పని-వ్యక్తిగత సమతుల్యత గురించి అడిగితే ఎందుకింత వివాదం చేయాలి? ఎందుకంత వివక్ష చూపాలి? ఒక వ్యక్తిగా, అంతకంటే ముఖ్యంగా ఒక తల్లిగా మహిళలకు ఇలాంటి సమయ పాలన ఎంతో అవసరం. మన సమాజంలో స్త్రీలు కెరీర్ మాత్రమే చూసుకుంటే సరిపోదు.
పరస్పర సహకారంతోనే విజయం
సూర్య షూటింగ్స్‌లో బిజీగా ఉన్నప్పుడు నేను ఇల్లు, పిల్లల బాధ్యతలు చూసుకుంటాను. నేను షూటింగ్‌ల కోసం ముంబై వచ్చినప్పుడు సూర్య పిల్లల బాధ్యత తీసుకుంటారు. ఈ పరస్పర సహకారం వల్లే మేము వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను విజయవంతంగా సమన్వయం చేసుకోగలు గుతున్నాం.
ప్రేక్షకుల ముందుకు ‘సిస్టమ్’
ఈ సరికొత్త ఆలోచనలు, మారుతున్న సినిమా ధోరణుల మధ్యే నా తాజా చిత్రం ‘సిస్టమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన ఈ సిరీస్ ఒక ఇంటెన్స్ కోర్ట్ రూమ్ డ్రామా. ఇందులో నేను సమాజంలో ఎలాంటి ఆర్థిక వనరులు, బ్యాక్ గౌండ్ లేని ఒక సాధారణ కోర్టు స్టెనోగ్రాఫర్ పాత్రను పోషించాను. సోనాక్షి సిన్హా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా, ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవారికర్ డిఫెన్స్ లాయర్‌గా కీలక పాత్రలో నటించారు. ప్రసిద్ధ దర్శకురాలు అశ్విని అయ్యర్ తివారీ ఈ చిత్రాన్ని అద్భుతంగా, ఎంతో సహజంగా తెరకెక్కించారు. ఒక దర్శకురాలి సెట్స్‌లో పనిచేయడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజంలో మహిళల వాణిని బలంగా వినిపించే ఇలాంటి కథలు, పాత్రలు మరిన్ని రావాల్సిన అవసరం ఉంది.

దీపిక నిర్ణయం సరైనదే
షూటింగ్ ముగించుకుని ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లలను చూసుకోవాల్సిన బాధ్యత, వారి చదువులు, ఎదుగుదలలో భాగం పంచుకోవాల్సిన అవసరం తల్లులకు ఉంటుంది. దీపిక ఇటీవల ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఒక తల్లిగా ఆ పాపను క్షేమంగా పెంచాల్సిన బాధ్యత ఇప్పుడు ఆమెపై ఉంది. కాబట్టి ఆమెకు 8 గంటల షిఫ్ట్ కచ్చితంగా అవసరం. ఒక తల్లిగా ఆమె దానికి పూర్తిగా అర్హురాలు. శ్రమ అనేది ఎప్పుడూ శరీరానికి, మనసుకు హాని కలిగించేలా ఉండకూడదు. పనికి, వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఎవరైనా తమ వృత్తిలో ప్రతిభ కనబరచగలరు. నా వ్యక్తిగత జీవితంలో కూడా నా భర్త సూర్య, నేను ఇదే బ్యాలెన్స్ పాటిస్తాం. మా కుటుంబంలో ఒకరి నిర్ణయాలను, కెరీర్‌ను మరొకరం ఎంతో గౌరవించుకుంటాం.