యొహోషువా ప్రార్థనా బలం
ABN , Publish Date - Jul 03 , 2026 | 05:22 AM
కురుక్షేత్రం యుద్ధంలో సైంధవుణ్ణి అర్జునుడు చంపడానికి ... శ్రీకృష్ణుడు తన చక్రాన్ని అడ్డువేసి సూర్యాస్తమయాన్ని సృష్టించిన ఘట్టం మహాభారతంలో ప్రసిద్ధమైనది. అటువంటి...
దైవమార్గం
కురుక్షేత్రం యుద్ధంలో సైంధవుణ్ణి అర్జునుడు చంపడానికి ... శ్రీకృష్ణుడు తన చక్రాన్ని అడ్డువేసి సూర్యాస్తమయాన్ని సృష్టించిన ఘట్టం మహాభారతంలో ప్రసిద్ధమైనది. అటువంటి సంఘటనే బైబిల్‌లోనూ కనిపిస్తుంది. మోషే ప్రవక్తకు వారసుడిగా దేవుడు పంపిన మరో ప్రవక్త యెహోషువా. అతణ్ణే ‘జాషువా ప్రవక్త’ అని కూడా అంటారు. మోషేకు ఆయన ప్రియ సహచరుడు. ఇజ్రాయేలీయులకు కష్టనష్టాల్లో తోడుగా నిలిచాడు. ఎప్పటికప్పుడు వారికి దిశానిర్దేశం చేశాడు. అడ్డుపడిన శత్రువుల్ని జయించడంలో వారికి అండగా నిలిచాడు. వారి 12 తెగలకు 12 భూభాగాలను పంచి ఇచ్చే బృహత్తరమైన బాధ్యతను తన భుజాన వేసుకున్నాడు. అతను మహా భక్తుడు. గొప్ప యోధుడు. దేవుడికి పరిపూర్ణమైన విధేయుడు. దేవునికీ, ప్రజలకూ మధ్యవర్తి.
ఇజ్రాయేలీయులు తమ సొంత భూముల్లోకి తిరిగి వస్తున్నారని తెలియగానే చాలామంది భయపడ్డారు. వారిలో యెరికో రాజు ఒకడు. యెరికో పట్టణం దుర్భేధ్యమైనది. ‘ఇనుముతో తయారయ్యాయా?’ అనేంత పటిష్టమైన గోడలతో అక్కడి కోట ఉండేది. అది దైవ వ్యతిరేక కార్యక్రమాలకు కేంద్రం. దేవుని మార్గదర్శకత్వంలో... దైవశక్తితో ఆ కోటను జాషువా కూల్చగలిగాడు. ఆ పట్టణం దగ్ధమైంది, పునర్నిర్మాణానికి పనికిరాకుండా శాపగ్రస్తమైపోయింది.
కాగా... ఇజ్రాయేలీయులకు, జాషువాకు వ్యతిరేకంగా అయిదు ప్రాంతాల నుంచి శత్రువులు ఒక్కసారిగా విజృంభించారు. ఒక్క గిబియోన్లు మాత్రమే ఇజ్రాయేలీయులకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆ శత్రువులందరూ గిబియోన్లమీద విరుచుకుపడ్డారు. అప్పుడు యెహోవా దేవుడు పెను వడగళ్ళ వాన కురిపించాడు. సగానికి పైగా శత్రువులు నాశనమైపోయారు.
ఇంతలో సాయంత్రమయింది. చీకటి పడితే శత్రువులు దాక్కొని ప్రాణాలు దక్కించుకుంటారనీ, మరుసటి రోజు దొంగ దెబ్బ తీస్తారనీ గ్రహించిన జాషువా... ‘‘తండ్రీ! ఈ రోజు గడవనీయకు. పగటిపూటే పోరు జరగాలి. లేకుంటే మాకు ఓటమి తప్పదు’’ అని వేడుకున్నాడు. ‘‘సూర్యుడా! గిబియోను మీద నీవు నిలిచిపో. చంద్రుడా! అయ్యాలోను లోయ మీద నీవు ఆగిపో’’ అంటూ ప్రార్థించాడు.
దాంతో సూర్యుడు దాదాపు ఒక రోజంతా అస్తమించకుండా నిలిచిపోయాడు. జాషువా నాయకత్వంలో ఇజ్రాయేలీయులు తమ శత్రువులను పూర్తిగా ఓడించేవరకూ పగలు కొనసాగింది. ఆ వెలుతురులో శత్రువులందరినీ ఇజ్రాయేలీయులు తుదముట్టించారు. ఒక మహా ప్రవక్త ప్రార్థనా బలంతో గ్రహాలు ఎక్కడివక్కడ నిలిచిపోయిన ఈ ఘట్టం... ఆశ్చర్యకరమైనదిగా, అద్భుతమైనదిగా నిలిచిపోయింది.
డాక్టర్ యం. సోహినీ బెర్నార్డ్,
9866755024
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది