రథం...కదిలే ఆలయం
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:40 AM
విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ఒక ప్రదేశానికి ఆహ్వానించి, ఆరాధనలు చేసే ప్రదేశమే ఆలయం. భగవంతుడికి జరిగే సేవలు, ఉత్సవాలు అనేకం. వాటన్నిటిలో అతి ముఖ్యమైనది..
తెలుసుకుందాం
విశ్వమంతా వ్యాపించి ఉన్న భగవంతుణ్ణి ఒక ప్రదేశానికి ఆహ్వానించి, ఆరాధనలు చేసే ప్రదేశమే ఆలయం. భగవంతుడికి జరిగే సేవలు, ఉత్సవాలు అనేకం. వాటన్నిటిలో అతి ముఖ్యమైనది రథోత్సవం. ఆలయాన్ని పోలి ఉన్న ఒక రథాన్ని ఎక్కి... తానే స్వయంగా ఆలయం బయటకు వచ్చి భక్తులందరికీ భగవంతుడు దర్శనమిస్తాడు. శరీరమే ఒక ‘రథం’ అనీ. మన ఆత్మ ‘రథికుడు’ అనీ, మన బుద్ధి ‘సారథి’ అనీ, మనసు ‘పగ్గం’ అనీ, ఇంద్రియాలు గుర్రాలనీ, అవి సంచరించే విషయాలే వాటి గమ్యస్థానాలనీ ‘కఠోపనిషత్తు’ వివరిస్తోంది. శరీర రథాన్ని అధిరోహించిన మానవుడు తన జీవితాన్ని ఎలా గడపాలో ఈ ఉపనిషత్ వాక్యం మనకు బోధిస్తోంది. కాగా దేవాలయాన్ని కూడా రథంగా భావిస్తారు. ఆలయ నిర్మాణం చేసే స్థపతులను ‘రథకారులు’ అని ఆగమాలు పేర్కొన్నాయి. కోణార్క్ సూర్య దేవాలయం, కుంభకోణంలోని సారంగపాణి ఆలయాల్లో రథాకృతిని చూడవచ్చు. ఆలయం అచల నిర్మాణమైతే... రథం కదిలే దేవాలయం. విశేషానుగ్రహంతో స్వయంగా బయటకు వచ్చి, రథంపై ఊరేగే కేశవుణ్ణి దర్శిస్తే పునర్జన్మ ఉండదన్నారు పూర్వులు.
ఆలయాల్లోని రథాలు ఆయా దేవాలయ నిర్మాణ రీతులను అనుసరించి ఉంటాయి. తిరుమల శ్రీవారి రథం... చోళ, విజయనగర ఆలయ నిర్మాణ శైలుల సమ్మేళనంగా... ప్రధాన ఆలయాన్ని పోలి ఉంటుంది. అలాగే ఉడుపి లాంటి చోట్ల ఆ ఆలయ రీతుల ప్రకారం రథాలు ఉంటాయి. పూరీ జగన్నాథ ఆలయం రేఖానాగరి శైలితో ప్రభావితమైన వేసారా శైలిలో ఉండే ఒక ప్రత్యేకమైన నిర్మాణం. ఈ రథాలు ప్రతి సంవత్సరం రథయాత్ర కోసం ప్రత్యేకంగా నిర్మితమవుతాయి. వీటి తయారీకి ఎలాంటి రేఖా చిత్రాలు ఉండవు. కానీ ప్రతి సంవత్సరం ఒకే రీతిలో, ఒకే కొలతతో తయారవుతాయి. ఎన్నో తరాలుగా అక్కడి విశ్వకర్మ వంశీయులు ఆ కొలతలను తమ పిల్లలకు, శిష్యులకు బోధిస్తున్నారు. ఈ గురుశిష్య సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది.
రెండు నెలల ముందు నుంచే...
జగన్నాథ రథయాత్ర చాంద్రమానం ప్రకారం ఆషాఢశుద్ధ విదియ రోజున ఆరంభమై... తొమ్మిది రోజులపాటు జరుగుతుంది. దానికి రెండు నెలల ముందు నుంచి... వైశాఖ బహుళ విదియ నాడు రథ నిర్మాణానికి ఏర్పాట్లు మొదలవుతాయి. సమీపంలోని అడవుల్లో పవిత్రమైన 12 వివిధ జాతులకు చెందిన వృక్షాలను ముఖ్య శిల్పులైన స్థపతులు గుర్తిస్తారు. ఆగమోక్తంగా పూజలు చేసిన తరువాత ఆ చెట్లను నరికించి... పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి పూజ చేసిన అనంతరం... తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, వారి సహాయ శిల్పులు మరో 125 మంది కలిసి... అక్షయ తృతీయ రోజున రథ నిర్మాణం మొదలుపెడతారు. మొత్తం వృక్షాన్ని 2188 భాగాలుగా విభజిస్తారు. వాటిలో 832 భాగాలను జగన్నాథుడి రథం తయారీకి, 763 భాగాలను బలభద్రుడి రథ నిర్మాణానికి, 593 భాగాలను సుభద్రాదేవి రథానికి వినియోగిస్తారు. ఏ భాగం ఎంతెంత పరిమాణంలో ఉండాలి, ఎలా తయారు చేయాలి? అనేవి సహజంగా జరిగిపోతాయి. రథయాత్రకు ఒక రోజు ముందు రథ నిర్మాణాలు పూర్తవుతాయి.
దేనికదే ప్రత్యేకం...
జగన్నాథుడి రథాన్ని ‘నందిఘోష’ అంటారు. 45 అడుగుల ఎత్తులో, 34 అడుగుల, ఆరు అంగుళాల పొడవు, వెడల్పులతో, పదహారు చక్రాలతో మిగిలిన రెండిటికన్నా ఇది పెద్దదిగా ఉంటుంది. ఎర్రటి చారలున్న పసుపు వస్త్రంతో దీన్ని అలంకరిస్తారు. ప్రధాన రథానికి రక్షణ బాధ్యతను గరుడాళ్వార్ వహిస్తాడు. శంఖ, బలాహక, శ్వేత, హరిదాశ్వ అనే నాలుగు తెల్లని గుర్రాలతో ఉండే ఈ రథానికి దారకుడు అనే సారథి ఉంటాడు. బలభద్రుడి రథాన్ని ‘తాళధ్వజం’ అంటారు. దాని ఎతు 44 అడుగులు. 33 అడుగుల పొడవు, వెడల్పులతో ఉండే ఈ రథానికి పధ్నాలుగు చక్రాలు ఉంటాయి. దీనికి వాసుదేవుడు రక్షకుడు. తిబ్ర, ఘోర, దీర్ఘ శర్మ, స్వర్ణనవ అనే నాలుగు గుర్రాలు ఉండే ఈ రథానికి మాతలి అనే సారథి ఉంటాడు. తాటిచెట్టు చిహ్నం ఉండే ఎర్రటి చారలు ఉన్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం పేరు ‘దర్పదళనం’. దీని ఎత్తు 42 అడుగుల మూడు అంగుళాలు. 31 అడుగుల ఆరు అంగుళాల పొడవు, వెడల్పులతో ఉండే ఈ రథానికి పన్నెండు చక్రాలు ఉంటాయి. రుచిక, మోచిక, కొత్త, అపరాజిత అనే ఎర్రని గుర్రాలను కలిగి ఉండే ఈ రథం మీద ఎర్రటి చారలున్న నలుపు వస్త్రాన్ని, పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతి రథానికి 250 అడుగుల పొడవు, ఎనిమిది అంగుళాల మందం ఉండే... కొబ్బరిపీచుతో చేసిన గట్టి తాళ్ళను లాగడానికి వీలుగా కడతారు. రథంపై ఇద్దరేసి చొప్పిన ద్వారపాలకులు, ఒక ఉపదేవత, తొమ్మిదిమంది పార్శ్వదేవతలు ఉంటారు. వస్త్రాలపై పుష్పాలంకరణలు, లతలు, ప్రకృతి రూపాలు, రాహువు, చంద్రుడు లాంటి పురాణ ప్రతీకలను చిత్రిస్తారు. రథంలోని చెక్క భాగాల మీద ఒడిశా నిర్మాణ శైలిని ప్రతిబింబించే శిల్పాలను చెక్కుతారు. సూక్ష్మమైన రూపురేఖలు ఏమాత్రం కోల్పోకుండా, ఆధునిక యంత్రాలు, సాంకేతికతల సాయం లేకుండా... సంప్రదాయ శిల్పులు తమ చేతులతో నైపుణ్యంగా ఈ అందమైన, అత్యంత కచ్చితత్వంతో కూడిన రథాలను నిర్మించడం గొప్ప విశేషం.
డి.యన్.వి. ప్రసాద్ స్థపతి
9440525788

కళల సమాహారం
విశ్వరక్షకుడైన జగన్నాథుడు స్వయంగా అధిష్ఠించి, విహరించే రథాల నిర్మాణ బాధ్యతను తరతరాలుగా నిర్వర్తిస్తున్న శిల్పులను ‘విశ్వకర్మ సేవకులు’ అని పిలుస్తారు. ఈ రథ నిర్మాణం... ఎన్నో కళల సమాహారం. విభిన్న నైపుణ్యాలు కలిగిన నిపుణులు, కళాకారులు వారికి నిర్దేశించిన నిర్దిష్టమైన భాగాన్ని మాత్రమే తయారు చేస్తారు. ప్రతి బృందాన్ని ‘నియోగ’ అని పిలుస్తారు. పూరీ జగన్నాథ రథ నిర్మాణంలో పాల్గొనే ప్రధాన శిల్పులు:
బడ్ఢేయి మహారాణాలు: ఈ బృందం రథ నిర్మాణంలో ముఖ్య బాధ్యతను నిర్వహిస్తుంది. ప్రధాన నిర్మాణం వీరి ద్వారానే జరుగుతుంది. వీరి విశేష నైపుణ్యాలు రథ నిర్మాణంలో కీలకం.
గుణకారులు: వీరు రథ నిర్మాణానికి అవసరమైన వివిధ కొలతలను, ప్రమాణాలను, నిర్మాణ నియమాలను నిర్ణయిస్తారు.
పాహి మహారాణాలు: ఈ బృందం రథ చక్రాలను తయారు చేసి, వాటిని సక్రమంగా అమర్చే బాధ్యతను నిర్వహిస్తుంది. కమ్మర కాంత నాయకులు లేదా ఓఝా మహారాణాలు: వీరు ఇనుప పనుల్లో నైపుణ్యం కలిగినవారు. రథ నిర్మాణానికి అవసరమైన మేకులు, ఇనుప ముళ్లు, క్లాంపులు, ఇరుసులు, లోపల అమర్చే చక్రాలు లాంటి అవసరమైన అన్ని ఇనుప భాగాలను తయారు చేస్తారు.
చందకారులు: రథంలోని ప్రధాన భాగాలను తయారీ ప్రాంతం నుంచి మోసుకు వెళ్ళడం, వాటిని ఒకదానితో ఒకటి అమర్చడం లాంటి పనులను ఈ బృందం నిర్వహిస్తుంది.
రూపకారులు: ఈ శిల్పులు రథాల అలంకరణ కోసం చెక్కపై ఆకృతుల్ని, సంప్రదాయ చిహ్నాల్ని చెక్కుతారు.
మూర్తికారులు: వీరు ప్రత్యేక నైపుణ్యం కలిగిన శిల్పులు. మూడు రథాలపై అలంకరించాల్సిన వివిధ దేవతా శిల్పాలను, అలంకార రూపాలను చెక్కలమీద రూపొందిస్తారు. ప్రతి రథం అంచులలో అమర్చే ‘అష్ట మంజరి’ అనే ఎనిమిదిమంది స్త్రీ పరిచారికల శిల్పాలను కూడా వీరే తయారు చేస్తారు.
చిత్రకారులు: ఈ బృందం వారు రథాలపై రంగురంగుల రేఖాచిత్రాలు గీస్తారు. సంప్రదాయ అలంకార నమూనాలను చిత్రిస్తారు. విభిన్నమైన రంగులు వేస్తారు. రథాలపై చెక్కిన శిల్పాలకు, దేవతా ప్రతిమలకు రంగులు అద్దేది కూడా వీరే.
సూచికారులు లేదా దర్జీ సేవకులు: వీరు రథాలకు అవసరమైన వస్త్రాలు, వస్త్రావరణాలు, చిన్న గుడారాలు, జెండాలు తయారు చేస్తారు. అలాగే ఇతర అలంకార నమూనాలతో వస్త్రాలను అందంగా తయారుచేసి రథాలకు అలంకరిస్తారు.
రథ బోయీలు: వీరు కాయకష్టం చేసే కార్మికులు. నైపుణ్యం కలిగిన శిల్పులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ రథ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు.
ఇంతమంది నైపుణ్యంతో రూపు దిద్దుకున్న రథాలను ప్రధాన ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. లోక రక్షకుడైన జగన్నాథ స్వామి అధిరోహించేందుకు వీలుగా సిద్ధంచేసి ఉంచుతారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక