కళల సమాహారం
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:31 AM
విశ్వరక్షకుడైన జగన్నాథుడు స్వయంగా అధిష్ఠించి, విహరించే రథాల నిర్మాణ బాధ్యతను తరతరాలుగా నిర్వర్తిస్తున్న శిల్పులను ‘విశ్వకర్మ సేవకులు’ అని పిలుస్తారు. ఈ రథ నిర్మాణం..
విశ్వరక్షకుడైన జగన్నాథుడు స్వయంగా అధిష్ఠించి, విహరించే రథాల నిర్మాణ బాధ్యతను తరతరాలుగా నిర్వర్తిస్తున్న శిల్పులను ‘విశ్వకర్మ సేవకులు’ అని పిలుస్తారు. ఈ రథ నిర్మాణం... ఎన్నో కళల సమాహారం. విభిన్న నైపుణ్యాలు కలిగిన నిపుణులు, కళాకారులు వారికి నిర్దేశించిన నిర్దిష్టమైన భాగాన్ని మాత్రమే తయారు చేస్తారు. ప్రతి బృందాన్ని ‘నియోగ’ అని పిలుస్తారు. పూరీ జగన్నాథ రథ నిర్మాణంలో పాల్గొనే ప్రధాన శిల్పులు:
బడ్ఢేయి మహారాణాలు: ఈ బృందం రథ నిర్మాణంలో ముఖ్య బాధ్యతను నిర్వహిస్తుంది. ప్రధాన నిర్మాణం వీరి ద్వారానే జరుగుతుంది. వీరి విశేష నైపుణ్యాలు రథ నిర్మాణంలో కీలకం. గుణకారులు: వీరు రథ నిర్మాణానికి అవసరమైన వివిధ కొలతలను, ప్రమాణాలను, నిర్మాణ నియమాలను నిర్ణయిస్తారు.
పాహి మహారాణాలు: ఈ బృందం రథ చక్రాలను తయారు చేసి, వాటిని సక్రమంగా అమర్చే బాధ్యతను నిర్వహిస్తుంది. కమ్మర కాంత నాయకులు లేదా ఓఝా మహారాణాలు: వీరు ఇనుప పనుల్లో నైపుణ్యం కలిగినవారు. రథ నిర్మాణానికి అవసరమైన మేకులు, ఇనుప ముళ్లు, క్లాంపులు, ఇరుసులు, లోపల అమర్చే చక్రాలు లాంటి అవసరమైన అన్ని ఇనుప భాగాలను తయారు చేస్తారు.
చందకారులు: రథంలోని ప్రధాన భాగాలను తయారీ ప్రాంతం నుంచి మోసుకు వెళ్ళడం, వాటిని ఒకదానితో ఒకటి అమర్చడం లాంటి పనులను ఈ బృందం నిర్వహిస్తుంది.
రూపకారులు: ఈ శిల్పులు రథాల అలంకరణ కోసం చెక్కపై ఆకృతుల్ని, సంప్రదాయ చిహ్నాల్ని చెక్కుతారు.
మూర్తికారులు: వీరు ప్రత్యేక నైపుణ్యం కలిగిన శిల్పులు. మూడు రథాలపై అలంకరించాల్సిన వివిధ దేవతా శిల్పాలను, అలంకార రూపాలను చెక్కలమీద రూపొందిస్తారు. ప్రతి రథం అంచులలో అమర్చే ‘అష్ట మంజరి’ అనే ఎనిమిదిమంది స్త్రీ పరిచారికల శిల్పాలను కూడా వీరే తయారు చేస్తారు.
చిత్రకారులు: ఈ బృందం వారు రథాలపై రంగురంగుల రేఖాచిత్రాలు గీస్తారు. సంప్రదాయ అలంకార నమూనాలను చిత్రిస్తారు. విభిన్నమైన రంగులు వేస్తారు. రథాలపై చెక్కిన శిల్పాలకు, దేవతా ప్రతిమలకు రంగులు అద్దేది కూడా వీరే.
సూచికారులు లేదా దర్జీ సేవకులు: వీరు రథాలకు అవసరమైన వస్త్రాలు, వస్త్రావరణాలు, చిన్న గుడారాలు, జెండాలు తయారు చేస్తారు. అలాగే ఇతర అలంకార నమూనాలతో వస్త్రాలను అందంగా తయారుచేసి రథాలకు అలంకరిస్తారు.
రథ బోయీలు: వీరు కాయకష్టం చేసే కార్మికులు. నైపుణ్యం కలిగిన శిల్పులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ రథ నిర్మాణ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తారు.
ఇంతమంది నైపుణ్యంతో రూపు దిద్దుకున్న రథాలను ప్రధాన ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా నిలబెడతారు. లోక రక్షకుడైన జగన్నాథ స్వామి అధిరోహించేందుకు వీలుగా సిద్ధంచేసి ఉంచుతారు.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక