నాకు నేనే పోటీ
ABN , Publish Date - Feb 16 , 2026 | 05:23 AM
పదమూడేళ్లకే జాతీయ చాంపియన్. పదిహేడేళ్లకు ప్రపంచ జూనియర్ చాంపియన్. పద్దెనిమిదేళ్లకు ఒలింపిక్స్ బరి. పోటీ ఏదైనా ఆమె బరిలోకి దిగితే ప్రత్యర్థులు పతకంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇటీవల...
పదమూడేళ్లకే జాతీయ చాంపియన్. పదిహేడేళ్లకు ప్రపంచ జూనియర్ చాంపియన్. పద్దెనిమిదేళ్లకు ఒలింపిక్స్ బరి. పోటీ ఏదైనా ఆమె బరిలోకి దిగితే ప్రత్యర్థులు పతకంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇటీవల జరిగిన ఆసియా షూటింగ్ చాంపియన్‌షి్‌పలో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యంతో మెరిసిన 21 ఏళ్ల ‘యంగ్ గన్’...
అర్జున పురస్కార గ్రహీత... ఇషా సింగ్ జర్నీ ‘నవ్య’కు ప్రత్యేకం.
‘‘పదేళ్ల కెరీర్‌లో వెనక్కి తిరిగి చూసుకొంటే ఎంతో గర్వంగా, అంతకుమించి ఆత్మసంతృప్తిగా ఉంది. అందరూ ‘21 ఏళ్లకే చాలా సాధించావు. ఆహా.. ఓహో’ అని పొగుడుతుంటే మనసులో నవ్వుకుంటా. నేనేమీ వండర్ కిడ్, అసాధారణమైన శక్తులు కలిగిన అమ్మాయిని కాను. సాధారణ మహిళనే. పట్టుదల, క్రమశిక్షణ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఉంటే అనుకున్నది సాధించవచ్చు. సరదాగా ప్రారంభించిన షూటింగ్‌ను తొలి పసిడి పతకం సాధించాక కెరీర్‌గా ఎంచుకోవాలని నిశ్చయించుకున్నా. అంతకుముందు వరకు సన్‌గ్లాసె్‌స మొదలు రకరకాల బహుమతులిచ్చి మా నాన్న నన్ను షూటింగ్ ప్రాక్టీస్టుకు తీసుకెళ్లేవారు. ఎప్పుడైతే రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రథమ స్థానం దక్కించుకున్నానో... అప్పటి నుంచి నాకు షూటింగ్‌పై మక్కువ కలిగింది. దీన్నే కెరీర్‌గా మలుచుకొంటానని చెప్పినప్పటి నుంచీ నా ప్రతి అడుగులో అమ్మ శ్రీలత, నాన్న సచిన్ తోడుగా ఉన్నారు. ఇంటి దగ్గరలో సరైన షూటింగ్ రేంజ్ లేకపోవడంతో ఇంట్లోనే ప్రాక్టీసు చేసుకొనేలా ఏర్పాటు చేయించారు. ఇంట్లోనే ఉందని అదేపనిగా సాధన చేయలేదు. నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు షూటింగ్ రేంజ్‌లోకి వెళ్లేదాన్ని. ఆసక్తి లేనప్పుడు వేరే పనులు చూసుకొనేదాన్ని.
మానసికంగా బలంగా ఉండాలి...
షూటింగ్ చాలా సాధారణ క్రీడ. అయితే శారీరకంగా కంటే మానసికంగా బలంగా ఉండాలి. ఇందులో కండ బలం కంటే గురి తప్పని ఏకాగ్రత, మానసిక దృఢత్వం ముఖ్యం. నేరుగా ప్రత్యర్థులతో తలపడేది ఉండదు కాబట్టి ఎవరితోనూ ప్రత్యక్షంగా పోటీ ఉండదు. ప్రత్యర్థులు ఉండరు. నా పిస్టల్‌కు ఎదురుగా ఉండే టార్గెట్‌తోనే నాకు పోటీ. నాతో నేనే యుద్ధం చేస్తా. నాకు నేనే పోటీ. అంతేకానీ మనకంటే పెద్ద ప్లేయర్, సీనియర్ బరిలో ఉన్నారనే భావనతో పోటీ పడితే అనవసరమైన ఒత్తిడికి లోనై, చిత్తవుతాం. ఎలాంటి పోటీలోనైనా విజయం కోసం వంద శాతం ప్రయత్నిస్తా. ఒక్కోసారి ఫలితాలు నాకు అనుకూలంగా రాకపోయినా నిరాశపడను. ఏ తప్పిదంవల్ల విజయానికి దూరమయ్యానో వాటిని సరిదిద్దుకొని నూతనొత్తేజంతో బరిలోకి దిగుతా. ఒక్కోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని షూటింగ్ రేంజ్‌ల్లోని వెలుతురు నా కంటికి సరిపడినట్టు ఉండదు. ఆ ప్రతికూల అంశాన్ని త్వరగా ఆకళింపు చేసుకొని, దానికి తగ్గట్టు నా షూటింగ్ శైలిని మార్చుకుంటా. తాజాగా ఢిల్లీలో జరిగిన ఆసియా చాంపియన్‌షి్‌ప సందర్భంగా ఇలాంటి సమస్యే ఎదుర్కొన్నా. ఆ తరుణంలో తొలి రౌండ్లలో కొంచెం వెనుకపడ్డా... వెంటనే పుంజుకొని స్వర్ణ పతకాలు సాధించాను.
వైఫల్యాలను చూసి జంకొద్దు...
నేను షూటింగ్ నేర్చుకునేటప్పుడు అభిమానించే క్రీడాకారుడు ఎవరూ లేరు. ఎప్పుడైతే కెరీర్‌గా షూటింగ్‌ను ఎంచుకున్నానో ఆ తర్వాత అందులో గొప్పవారి గురించి తెలుసుకున్నా. దిగ్గజ షూటర్లు గగన్ నారంగ్, అభినవ్ బింద్రా తమ అనుభవాలను, జ్ఞానాన్ని నాతో పంచుకున్న వైనం చూసి వారిని ఆరాధించడం ప్రారంభించా. ‘వైఫల్యాలను చూసి భయపడవద్దు. వాటిని అధిగమించేందుకు కష్టపడాల’ని వారు చెప్పినప్పుడు అర్థంకాలేదు. నా పరాజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, విజయవంతమైనప్పుడు వారి మాటల్లోని సారం తెలుసుకున్నా. 2022 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో నాలుగు పతకాలు గెలిచినప్పుడు... అంతకముందు కంటే తీవ్ర సాధన ఏమీ చేయలేదు. అలాగే ఆ తర్వాత జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో సరైన సాధన లేక పతకాలు కోల్పోలేదు. తాజాగా ఆసియా చాంపియన్‌షి్‌పలోనూ అంతే. ఎప్పుడైనా నా సాధన చేసే విధానం ఒక్కటే. దిగ్గజ షూటరైనా, సీనియరైనా, జూనియరైనా ఆ రోజు మెరుగైన ప్రదర్శన చేసినవారే విజేతలుగా నిలుస్తారు. షూటింగ్ గణిత శాస్త్రం లాంటిది. లెక్కల్లో ఏ చిన్న తప్పు చేసినా ఫలితం ఎలా రాదో... షూటింగ్‌లో కూడా అంతే. లాస్‌ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు ఇంకా రెండేళ్ల సమయం ఉన్నందున ఇప్పటి నుంచే ప్రణాళికబద్ధంగా సిద్ధమవుతున్నా.

కష్టానికి తగిన ప్రతిఫలం...
కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినప్పుడే అసలైన గుర్తింపు లభించినట్టు. దేశంలో నాతో పాటు ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన వారందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురు క్రీడాకారులకు వారి ప్రతిభ ఆధారంగా గత ప్రభుత్వాలు మంచి ఉద్యోగాలిచ్చి ప్రోత్సహించాయి. కానీ నా విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుందో తెలియడంలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం నా కష్టాన్ని గుర్తించి, ఉద్యోగం ఇస్తే నాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది.’’
ఎస్.ఎ్‌స.బి.సంజయ్
ఆత్మసంతృప్తి...
మనం చేసే పనిలో ఆత్మసంతృప్తి ఉండాలి. షూటింగ్‌లో నాకు కావాల్సిన ఆనందం లభిస్తోంది. అందుకే నేను నిలకడగా విజయాలు సాధించగలుగుతున్నా. నా ఆనందం కోసం నేను ఇష్టపడి ఆడుతున్నా కాబట్టే పదేళ్లగా రాణించగలుగుతున్నా. ఇందుకు క్రమశిక్షణ చాలా ముఖ్యం. సమయానికి తినడం, పడుకోవడం, ఏ సమయంలో ఏ పని చేయాలనేది చిన్నప్పుడే మా అమ్మ నాకు నేర్పింది. ఆ క్రమశిక్షణను ఇప్పటికీ కొనసాగిస్తున్నా. రెండు వారాలకు ఒకసారి బ్యాగ్ సర్దుకొని ఏదో ఒక పోటీలకు వెళ్తూనే ఉంటా. అందుకే కొంచెం సమయం దొరికినా కుటుంబ సభ్యులతో గడపడానికి ఇష్టపడతా. నాకు మా అమ్మ చేతి వంట చాలా ఇష్టం. తను చేసే పచ్చళ్లు ఎంతో రుచిగా ఉంటాయి.
షూటర్‌ని కాకపోతే..!
నాన్న ర్యాలీ డ్రైవర్ కావడంతో చిన్నప్పటి నుంచి కార్లు, రేసింగ్‌పై మక్కువ ఎక్కువ. అందుకే ఎక్కువగా ఫార్ములా-1 రేస్‌లు చూస్తుంటా. ఒకవేళ షూటర్‌ని కాకపోయుంటే రేసర్‌ని అయ్యేదానినేమో. ప్రస్తుత ఎఫ్-1 డ్రైవర్లలో మ్యాక్స్ వెర్‌స్టాపెన్ ఇష్టం. షూటింగ్ బోరు కొడితే గో-కార్టింగ్‌కి వెళ్తా. షూటింగ్‌కి వీడ్కోలు పలికిన తర్వాత అప్పటికీ ఆసక్తి ఉంటే రేసింగ్‌లోకి అడుగు పెడతా.
ఫైటర్‌ని...
పోటీల ప్రారంభ రౌండ్ నుంచి ఆఖరి రౌండ్ వరకు విజయం కోసం ఫైటర్‌లా పోరాడతా. అదే నా బలం. ఒక్కోసారి మంచి ఆరంభం లభించదు. అలాంటి సందర్భాల్లో తొలి రెండు రౌండ్లలో సరైన స్కోర్లు సాధించలేకపోయినా డీలా పడను. చివరిదాకా పోరాడతా. మరింత మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా.
ఇవి కూడా చదవండి..
ఈ ఫొటోల్లోని ఏడు తేడాలను 16 సెకెన్లలో కనిపెట్టండి.. మీ కళ్ల పవర్ సరి చూసుకోండి ..
ఇషాన్ కిషన్ సూపర్ ఇన్నింగ్స్..