మానవతే మార్గదర్శి
ABN , Publish Date - Apr 03 , 2026 | 02:55 AM
ప్రతి తరంలో వైద్యరంగానికి దాని భవిష్యత్తును పునర్నిర్వచించే సందర్భాలు అనుభవంలోకి వస్తాయి. ఒకప్పుడు స్కెతస్కోప్ అనేది రోగ నిర్ధారణలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యాంటీబయాటిక్స్...
యోగా
ప్రతి తరంలో వైద్యరంగానికి దాని భవిష్యత్తును పునర్నిర్వచించే సందర్భాలు అనుభవంలోకి వస్తాయి. ఒకప్పుడు స్కెతస్కోప్ అనేది రోగ నిర్ధారణలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చింది. యాంటీబయాటిక్స్ ఆవిష్కరణ మానవుల మనుగడను రూపాంతరీకరించింది. ఇమేజింగ్ టెక్నాలజీలు మానవ శరీరంలోకి కొత్త గవాక్షాన్ని తెరిచాయి. ఈ రోజున, ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) రాకతో మరో కీలకమైన మలుపునకు మనం సాక్షులం అవుతున్నాం. యంత్రాలు నానాటికీ తెలివి మీరుతున్నా... సాంకేతికతతో పాటు మానవ వివేకం, కరుణ కూడా పెరుగుతున్నాయని మనం ఎలా నిర్థారించుకోవాలి? అనే ముఖ్యమైన మరో ప్రశ్న తలెత్తుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆసుపత్రులలో... వైద్యులు వ్యాధులను నిర్ధారించే, పరీక్షలను విశ్లేషించే, చికిత్సలకు ప్రణాళికలు రూపొందించే పద్ధతులను కృత్రిమమేధ నిశ్శబ్దంగా పునర్నిర్మిస్తోంది. ఈనాటి అల్గారిథమ్‌లు అపారమైన వైద్య సమాచారాన్ని క్షణాల్లో విశ్లేషించగలవు. ఎంతో అనుభవం ఉన్న వైద్యులు సైతం గుర్తించలేని నమూనాలను గుర్తించగలవు. అసాధారణమైన కచ్చితత్వంతో గుండెను, రక్తనాళాలను వైద్యులు పరిశీలించడానికి ఈ సాంకేతికతలోని అద్భుతమైన స్పష్టత, వేగం దోహదం చేస్తాయి, వ్యాధిని తొలి దశలోనే గుర్తించడానికి సాయపడతాయి.
వైద్యం ఒక కళ
ఇలాంటి పరిణామాలు ఏఐ తాలూకు అసాధారణమైన సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. కార్డియాలజీ విషయానికొస్తే... కార్డియాక్ స్కాన్‌లలోని సూక్ష్మమైన అపసవ్యతలను గుర్తించడంలో, గుండెపోటు సంభవించే అవకాశాన్ని అంచనా వేయడంలో, వైద్యులు సకాలంలో, సరైన సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో కృత్రిమ మేధ సాయపడుతుంది. ముందస్తు రోగ నిర్ధారణ అనేది తరచుగా చావుకీ, బతుక్కీ మధ్య వ్యత్యాసం అవుతున్న పరిస్థితుల్లో... రోగిని కాపాడడం అనే లక్ష్యాన్ని సాధించడంలో ఒక శక్తిమంతమైన భాగస్వామిగా ఏఐ తననుతాను నిరూపించుకుంటోంది. అయినప్పటికీ, వైద్యం అనేది కేవలం సమాచారం, రోగ నిర్ధారణకు సంబంధించిన శాస్త్రం కాదు. ఇది మానవుల స్థితిగతులను అర్థం చేసుకొనే ఒక కళ కూడా. ప్రతి మెడికల్ రిపోర్ట్ వెనుక ఆందోళన, ఆశ, భయం, విశ్వాసాల మధ్య సతనమమయ్యే ఒక వ్యక్తి ఉంటారు. లక్షలాది డేటా పాయింట్లను యంత్రాలు ప్రాసెస్ చెయ్యగలిగినప్పటికీ... అనారోగ్యానికి సంబంధించిన భావోద్వేగ, ఆధ్యాత్మిక కోణాలను అవి అర్థం చేసుకోలేవనేది వాస్తవం.
మూడిటి కలయికతో...
రాబోయే దశాబ్దాలలో, ఆరోగ్య సంరక్షణ అనేది బహుశా ‘మానవ మేధస్సు, కృత్రిమ మేధస్సు, ఆధ్యాత్మిక మేధస్సు’ అనే మూడిటి కలయిక మీద ఆధారపడుతుంది. మానవ మేధస్సు వైద్యపరమైన విచక్షణను, అనుభవాన్ని, కృత్రిమ మేధస్సు గణన శక్తిని, నమూనాలను గుర్తించే సామర్థ్యాన్ని, ఆధ్యాత్మిక మేధస్సు కరుణను, నైతిక స్పష్టతను, లోతైన ప్రయోజనాన్ని అందిస్తాయి. ఈ మూడు కోణాలు కలిసినప్పుడు... ఆరోగ్య సంరక్షణ సాంకేతికంగా అభివృద్ధి చెందడమే కాదు... నిజంగానే పరివర్తనాత్మకంగానూ మారుతుంది. వైద్యులకు మెరుగైన పరికరాలు అందుబాటులోకి వస్తాయి. రోగులకు ముందస్తుగా రోగ నిర్ధారణ జరుగుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మరింత సమర్థవంతమవుతుంది. అదే సమయంలో... సేవ చేయాలనే మానవత నుంచి ఈ పురోగతి మనల్ని దూరం చేయకుండా ఆధ్యాత్మిక చైతన్యం దోహదపడుతుంది. నిజానికి, ఎంతటి ఆధునిక యంత్రమైన ఒక ఆప్యాయమైన మాటలోని వెచ్చదనాన్ని, కరుణ కలిగిన వైద్యుడు ఇచ్చే భరోసాను, అంతర్గత సమతుల్యత నుంచి జనించే శాంతిని భర్తీ చేయలేదనే లోతైన విషయాన్ని సాంకేతికత తాలూకు వేగవంతమైన పురోగతి మనకు గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో ఆసుపత్రులు తెలివైన యంత్రాలు, అధునాతనమైన స్కానర్లు, ఆటోమేటెడ్ వ్యవస్థలతో నిండి ఉండవచ్చు. కానీ స్వస్థత తాలూకు సారం మానవుల హృదయంలో... సహానుభూతి, అవగాహన, బాధలను తగ్గించాలనే చిత్తశుద్ధి కలిగిన సంకల్పంలో ఉంటుంది.
అదే కొలమానం
ఆధునిక ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ లాంటి శక్తిమంతమైన సాధనాలను మనం స్వీకరిస్తున్నప్పుడు... ధ్యానం లాంటి అభ్యాసాల ద్వారా అంతర్గత అవగాహనను కూడా పెంచుకోవాలి. మానవ చైతన్యంతో పాటు సాంకేతికత కూడా అభివృద్ధి చెందినప్పుడు... పురోగతి అర్థవంతంగా, సుస్థిరంగా మారుతుంది. అంతిమంగా, మన యంత్రాలు ఎంత అధునాతనంగా మారాయనే దానితో మాత్రమే కాకుండా... వైద్య వృత్తిలో ఉన్నవారు కరుణ, వినయం, వివేకాలను ఎంత లోతుగా కాపాడుకుంటున్నారనేది వైద్య వృత్తిలో నిజమైన విజయానికి కొలమానం అవుతుంది. కృత్రిమ మేధ ఆరోగ్య సంరక్షణను రూపాంతరీకరించగలదు. కానీ ఈ మార్పు నిజంగా మానవాళికి ప్రయోజనం చేకూరుస్తుందని నిర్ధారించేది... మేలుకొన్న మానవ హృదయమే
ఒక కార్డియాలజిస్టుగా, ‘హార్ట్‌ఫుల్‌నెస్ పద్ధతి’ ద్వారా ధ్యానం చేసే వ్యక్తిగా... స్వస్థత తాలూకు లోతైన అర్థం గురించి నేను తరచుగా ఆలోచిస్తూ ఉంటాను. భౌతికమైన హృదయం మన జీవితకాలం అంతటా అలసట లేకుండా రక్తాన్ని పంప్ చేస్తుంది. కానీ ఆధ్యాత్మిక హృదయం... భావాలు, అంతర్ దృష్టి, ఉన్నత చైతన్యాలకు కేంద్ర స్థానం... అది మన జీవితాన్ని ఎలా అనుభవించాలనే మార్గాన్ని చూపిస్తుంది. ‘హార్ట్‌ఫుల్‌నెస్’ సిద్ధాంతం ప్రకారం... మన చర్యలలో సమతుల్యత, స్పష్టత, కరుణలను తీసుకువచ్చి... అంతర్గత హృదయంతో మనల్ని అనుసంధానించడానికి ధ్యానం సహాయపడుతుంది. సాంకేతికత మన మేధస్సును పదునుపెట్టగలదు. కానీ ధ్యానం మన చైతన్యాన్ని శుద్ధి చేస్తుంది. ఈ రెండూ కలిసి పని చేసినప్పుడు... వైద్యం మరింత మానవీయంగా, సమగ్రంగా మారుతుంది. ‘‘సాంకేతికతకు హృదయం తాలూకు మార్గదర్శకత్వం ఉండాలి. లేకపోతే అది సామర్థ్యాన్ని పెంచగలదేమో కాని మానవత్వాన్ని కాదు’’ అంటూ ఈ సాంకేతిక యుగానికి సంబంధించిన లోతైన ఒక విషయాన్ని హార్ట్‌ఫుల్‌నెస్ గ్లోబల్ మార్గదర్శి దాజీ (కమలేశ్ డి.పటేల్) గుర్తు చేశారు. సరళమైన ఈ అంతర్ దృష్టిలో గొప్ప జ్ఞానం ఉంది. కృత్రిమ మేధ వైద్య నిర్ణయాల వేగాన్ని, కచ్చితత్వాన్ని నాటకీయంగా మెరుగుపరచవచ్చు, కానీ దానికి మానవతా విలువలే ఎల్లప్పుడూ మార్గదర్శకత్వం వహించాలి.
ఇవి కూడా చదవండి...
ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి
రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి
Read Latest Telangana News And Telugu News