Share News

ప్రతికూలతను తొలగించుకుందాం

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:47 AM

జీవితం ఆనందంగా ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథం అవసరం. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల, సంఘటనల వల్ల ప్రతికూలమైన ఆలోచనలు మనల్ని నిరంతరం...

ప్రతికూలతను తొలగించుకుందాం

చింతన

జీవితం ఆనందంగా ముందుకు సాగాలంటే సానుకూల దృక్పథం అవసరం. కానీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, వ్యక్తుల వల్ల, సంఘటనల వల్ల ప్రతికూలమైన ఆలోచనలు మనల్ని నిరంతరం వేధిస్తూ ఉంటాయి. ఈ ధోరణిని వదుల్చుకోవడానికి కొన్ని ఆచరణాత్మకమైన మార్గాలు ఉన్నాయి. ముందుగా... మీలో ఒక ప్రతికూల ఆలోచనను గుర్తించగానే... మంచి పనిలో నిమగ్నం అవ్వండి. లేదా కూర్చొని చక్కటి విషయం గురించి ఆలోచించండి. మీ మనసు అనేక ఆలోచనలతో సతమతం అవుతున్నట్టయితే... గచ్చు మీదనో, మంచం మీదనో పడుకోండి. మెల్లగా అటూ ఇటూ దొర్లుతూ ఉండండి. దాన్ని ‘శయన ప్రదక్షిణ’ అంటాం. అలా చేస్తున్నప్పుడు... మీ మనసులో కలిగే మార్పు మీకే తెలుస్తుంది.

సాక్షిలా గమనించండి...

కొన్నిసార్లు ప్రతికూల ఆలోచనలు దెయ్యాల్లా వెంటపడుతూ ఉంటాయి. మీరు వాటికి భయపడితే... అవి మీ మీద ఆధిపత్యం చెలాయిస్తాయి. వాటిని పట్టించుకోకండి. క్రమంగా అవే మాయమవుతాయి. కల్లోలంగా ఉన్న మనసును ప్రశాంతపరచుకోవడానికి ప్రాణాయామం, ధ్యానం ఉత్తమమైన మార్గాలు. అలాగే వ్యాయామం, యోగాభ్యాసం, పాటలు పాడడం, నృత్యం... ఇవన్నీ శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా అపారమైన ఆనందం కలిగిస్తాయి. ప్రతికూల ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తాయి. ఆలోచనల్లో నిమగ్నం కావడానికి బదులు... వాటిని సాక్షిలా గమనిస్తూ, విశ్లేషించుకోవడం క్రమంగా అలవాటు చేసుకోవాలి. క్రమంగా ‘ఏది మంచి, ఏది చెడ్డ’ అనే విచక్షణ అలవడుతుంది. ప్రతికూల ఆలోచనలన్నీ తొలగిపోతాయి. తద్వారా మీలో ఏర్పడే సానుకూల ధోరణి వల్ల... ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు.

శ్రీశ్రీ రవిశంకర్‌

ఇవి కూడా చదవండి...

ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 02:47 AM