నామాన్ని జపించడమంటే
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:44 AM
ఆ గుణాన్ని ఆవాహన చేయడమే మానవుల సర్వతోముఖ శ్రేయస్సుకు ఆధ్యాత్మికతలోనే మార్గదర్శకత్వం ఉందంటారు డాక్టర్ పూజా దవార్‌రావు. విద్యావేత్తగా, సైకాలజిస్టుగా..
ఆ గుణాన్ని ఆవాహన చేయడమే మానవుల సర్వతోముఖ శ్రేయస్సుకు ఆధ్యాత్మికతలోనే మార్గదర్శకత్వం ఉందంటారు డాక్టర్ పూజా దవార్‌రావు. విద్యావేత్తగా, సైకాలజిస్టుగా విదేశాల్లోనూ ఖ్యాతి పొందిన ఈ పంజాబీ మహిళ... ఢిల్లీ హైకోర్ట్ జస్టిస్ తుషార్‌రావును వివాహం చేసుకొని... తెలుగింటి కోడలయ్యారు. తాజాగా ‘విష్ణు సహస్రనామ స్తోత్రం’ మీద డాక్టరేట్ చేసి... ఆ నామాలలోని విశిష్టతను, వాటి పారాయణవల్ల కలిగే ప్రయోజనాలను వెల్లడించారు. ఆ విశేషాలను ‘నవ్య’తో పంచుకున్నారు.
విష్ణు సహస్రనామ స్తోత్రం మీద డాక్టరేట్ చేయాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది?
ఆధ్యాత్మికత, వైదిక తాత్త్వికత, గొప్ప ఋషుల ఆధ్యాత్మిక వ్యాఖ్యానాల మీద నిత్యం చర్చ జరిగే ఇంట్లో నేను పెరిగాను. సైకాలజీలో మాస్టర్స్ చేస్తున్నప్పుడు ఒక లోపాన్ని గమనించాను... అక్కడ మాకు బోధిస్తున్న పాశ్చాత్య సిద్ధాంతాలు భారతీయుల మనస్తత్వానికి అనుగుణమైనవి కావు. దానివల్ల నాకు కలిగిన అసౌకర్యం... 21 ఏళ్ళ వయసులోనే నాలో ఒక విత్తనాన్ని నాటింది. మానసిక ఆరోగ్యానికి, భారతీయ తత్త్వశాస్త్రానికి మధ్య ఉన్న ఒక సంబంధాన్ని అన్వేషించాలనుకుంటున్నాను. కొన్నేళ్ళ తరువాత... శ్రీవిష్ణు సహస్రనామ సత్సంగంలో చేరాను. ఆ బృందం 1969 నుంచి ప్రతి ఆదివారం స్తోత్ర పారాయణ చేస్తోంది. అందులో ఎనభై ఏళ్ళకు పైబడినవారు నన్ను ఆకర్షించారు. ఎనభయ్యేళ్ళ వయసులో వీరికి ఇంత చైతన్యం, జ్ఞాపకశక్తి ఎలా ఉంది?’ అనుకొనేదాన్ని. మంత్ర జపం మనుషుల మనస్సు మీద, ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావాలు చూపిస్తుంది? ఆందోళన, కుంగుబాటు, అలాగే ఆత్మగౌరవం లేకపోవడం, ఒత్తిడికి గురికావడం లాంటి మానసిక సమస్యలతో ప్రజలు సతమతం కాకుండా కాపాడగలమా? మంత్ర జపాన్ని ఒక ముందు జాగ్రత్త చర్యగా తీసుకోగలమా? ఈ అంశాలను అన్వేషించాలని అనుకున్నాను. 46 ఏళ్ళ వయసులో.. ఒక పరిశోధకురాలిగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పరిశీలించడం ప్రారంభించాను.
విష్ణు సహస్రనామం ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏమిటి?
అది నామస్మరణ అనే సూత్రం మీద నిర్మితమయింది. అంటే నామం ద్వారా దైవాన్ని స్మరించుకోవడం. హిందూ ఆధ్యాత్మిక చింతనలో నామం, అది సూచించే దేవత వేరు కాదు, అది దేవతతో ఏకమవుతుంది. విష్ణు సహస్రనామాలలోని ప్రతీదీ విష్ణువు గుణాల సారాన్ని, శక్తిని తనలో ఇముడ్చుకొని ఉంటుందనే విశ్వా సం ఉంది. నామాన్ని జపించడమంటే... ఆ నామం గుణాన్ని ఆవాహన చేయడం... అది రక్షకుడిగా విష్ణువు కావచ్చు, సర్వవ్యాపకుడైన పరమాత్మ కావచ్చు. ఈ సృష్టికి మూలాధారమూ కావచ్చు.
ఈ స్తోత్రం మూలం, దాని ప్రయోజనమేమిటో చెబుతారా?
విష్ణు సహస్రనామం... ఇది మహాభారతంలోని అనుశాసన పర్వంలోనిది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత అంపశయ్యపై ఉన్న భీష్ముడు దీన్ని వివరించాడు. ధర్మం కోసం, అంతర్గతమైన శాంతి కోసం తనకు మార్గదర్శనం చేయాల్సిందిగా భీష్ముణ్ణి యుద్ధానంతర దుఃఖంలో ఉన్న ధర్మరాజు అభ్యర్థిస్తాడు. పుణ్యం, శాంతి, మోక్షం లాంటి అత్యున్నతమైన శ్రేయస్సుల కోసం ఒక మార్గంగా భీష్ముడు దీన్ని వెల్లడించాడు. సంప్రదాయికంగా వ్యాసమహర్షి ప్రణీతమైన ఈ గ్రంథం... విష్ణువు తాలూకు ప్రతి విశిష్టమైన గుణాన్ని, విశ్వం తాలూకు పనితీరును వెల్లడిస్తుంది.
మీరు కనుగొన్న విషయాలు ఎలాంటివి?
ఏదో పవిత్రమైన విషయాన్ని నిరూపించడానికి ప్రయత్నించే భక్తురాలిలా కాకుండా... ఒక భారతీయ మనస్తత్వ శాస్త్రవేత్తగా ఈ అధ్యయనం చేపట్టాను. పూర్వం సవాలు విసిరిన కాలాల్లో భారతీయులు నిలదొక్కుకోవడానికి ప్రాచీనమైన మన వేద జ్ఞానం ఎలా సాయపడిందో, నేటి యువతరం మానసిక ఆరోగ్యాన్ని నిలబెట్టడంలో విష్ణు సహస్రనామ జపం ఎలా దోహదపడుతుందో అర్థం చేసుకోవాలనేదే నా లక్ష్యం. నా పరిశోధన ఫలితాలు సముద్రంలో నీటిబొట్టు లాంటివి. అది విష్ణు సహస్రనామ పారాయణ అభ్యాసంలోని పూర్తి లోతులకు చేరిందని చెప్పలేను. అయితే జపం చేసే వ్యక్తులు తాము శూన్యాన్ని... అంటే నిశ్చలతను అనుభవించినట్టు చెప్పారు. ఆ స్థితిలో జపించే వ్యక్తులకు, వారు దేనికోసం జపిస్తున్నారో ఆ శక్తికీ మధ్య హద్దులు చెరిగిపోతున్నట్టు అనిపించింది. చాలామందిలో ఈ స్థితి క్షణికమే అయినప్పటికీ... తాము సాక్షాత్తూ విష్ణుమూర్తితో ఏకమైన ఒక వాస్తవిక అనుభూతిని పొందామని వర్ణించారు. ఏదో ఒక గొప్ప శక్తి తమను సంరక్షిస్తోందని తమకు తెలుసనీ వారు చెప్పారు.
వారితో మీ అనుభవాలేమిటి?
వారంలో ఆరు రోజులపాటు వారందరూ వేర్వేరు ఉద్యోగాలు చేస్తూ, వేర్వేరు సమస్యలను ఎదుర్కొంటూ, వేర్వేరు జీవితాలను గడిపే వేర్వేరు తరాలకు చెందిన సాధారణమైన ప్రజలు. ఆదివారాల్లో... కేవలం విష్ణు సహస్రనామ పారాయణ కోసం మాత్రమే వారు ఒక కుటుంబంగా మారేవారు. విష్ణు సహస్రనామ పారాయణ సంప్రదాయం తరతరాలుగా ఎలా కొనసాగుతోందనేది పరిశోధనల్లో వెల్లడయింది. పైౖకి ఇదొక మతపరమైన సంప్రదాయంలా అనిపిస్తుంది. కానీ ఇలా మళ్ళీ మళ్ళీ చేయడంవల్ల పిల్లల్లో క్రమశిక్షణ, బాధ్యత అనే బలమైన భావనలు నిశ్శబ్దంగా నిర్మితమవుతాయి. ఈ క్రమశిక్షణ వారి చదువులకే పరిమితం కాలేదు, తరువాత వారి పని తీరులో నిలకడగా, ప్రేరణ తగ్గినప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండే తత్వంగా ప్రతిఫలించింది. లోకం నిలకడను గుర్తించి, గౌరవిస్తుంది కాబట్టి... ఆ వ్యక్తులు భక్తిపరులుగా కాకుండా... నమ్మదగిన వ్యక్తులుగా సమాజంలో ఒక నిశ్శబ్ద గౌరవాన్ని సంపాదించుకున్నారు. వారు తమవంతుగా తరువాతి తరంలో కూడా అదే క్రమశిక్షణను పెంపొందించారు. వీటన్నిటినీ కలిపి చూసినప్పుడు... ఆధ్యాత్మికమైన, సామాజికమైన, మానసికమైన పొరలు ఎంత గట్టిగా అల్లుకుపోయాయనే అంశం నాకు చాలా ఆసక్తిగా అనిపించింది. ప్రజలు వ్యక్తిగతంగా అనుభూతి చెందిన అంతర్గత ప్రశాంతతే... ఆ సామూహిక పారాయణను అంత శక్తిమంతంగా మార్చినట్టు అనిపించింది. సామూహికంగా, వ్యక్తిగతంగా చేసిన జపం.... వారికి తమ జీవితాలపట్ల, అన్ని వేళలా తమను రక్షించే దేవుని పట్ల విశ్వాసాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించింది. కష్టాలు ఎదురైతే ఎదుర్కొనేలా నిలబెట్టింది.
అంటే శబ్దమే దీన్ని ప్రధానంగా చేస్తోందా లేదా నామంలోనే ప్రయోజనాలు కూడా ఇమిడి ఉన్నాయా?
నిజం చెప్పాలంటే రెండూ. ప్రతి కణం ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో ప్రకంపిస్తుంది. అలాగే ప్రతి దేవత ఒక నిర్దిష్టమైన ఫ్రీక్పెన్సీలో ప్రతిధ్వనిస్తుంది. అందుకే ప్రతి దేవతకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ప్రతి మంత్రం ప్రాథమికంగా ఆ ఫ్రీక్సెన్సీకి అనుగుణంగా ట్యూన్ చేసి ఉన్న ఒక సోనిక్ కీ లాంటిది. అందుకే దీన్ని ‘దైవాన్ని ఆవాహన చేయడం’ అంటారు. మన వైదిక సంప్రదాయంలో శ్రుతికి, శ్రవణానికి చాలా ప్రాధాన్యం ఉంది. సరిగ్గా ఆ కారణం వల్లే... కచ్చితమైన ఉచ్చారణ, స్వరభేదం అనేవి జపించేవారి సొంత కణాలను అనునాదంలో ప్రకంపించేలా చేస్తాయి. శరీరాన్ని ఆ బృహత్ విశ్వశక్తితో లేదా దైవంతో అనుసంధానం చేస్తాయి. కాబట్టి ఇది కేవలం ఆచారపరమైన లాంఛనం కాదు, క్రియాత్మకమైనది. మరోవైపు... ఆ వెయ్యి నామాలలో ప్రతి ఒక్కటీ విష్ణువు తాలూకు నిర్దిష్టమైన ఒక గుణాన్ని సూచిస్తుంది. కాబట్టి ఒక పేరును పలికితే... శరీరాన్ని ప్రకంపింపజేయడమే కాదు, జపించేవారి చైతన్యంలో ఆ నిర్దిష్ట గుణాన్ని ఆవాహన చేస్తుంది. మొత్తంగా.. ధ్వని శరీరాన్ని అనుసంధానం చేస్తే, అర్థం మనస్సును అనుసంధానం చేస్తుంది. ప్రకంపన, సంకల్పాల ఉమ్మడి చర్య కారణంగానే ఆధ్యాత్మిక ప్రశాంతత, భావోద్వేగపరమైన స్థితిస్థాపకత, సామాజికమైన క్రమశిక్షణ లాంటి ప్రభావాలు విభిన్న స్థాయిల్లో ఒకేసారి వ్యక్తమైనట్టు నేను కనుగొన్నాను.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
మాది పంజాబీ కుటుంబం. సైకాలజీలో గ్రాడ్యుయేషన్, క్లినికల్ సైకాలజీలో మాస్టర్స్, పీహెచ్‌డీ చేశాను. ‘ప్రయాగ్ సంగీత సమితి’లో సంగీత్ ప్రభాకర్ కోర్సు, ఎన్‌సీఈఆర్‌టీ నుంచి ఎడ్యుకేషనల్ కౌన్సెలింగ్‌లో పీజీ డిప్లమా, చౌధురీ చరణ్ సింగ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ చేశాను. దేశవ్యాప్తంగా పలు పాఠశాలల్లో, కళాశాలల్లో కౌన్సెలింగ్ సైకాలజిస్టుగా, కన్సల్టెంట్‌గా పని చేశాను. అనేక విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్, సైకాలజీ విభాగాలను ఏర్పాటు చేశాను. వివిధ అంశాలపై డాక్యుమెంట్లు, హ్యాండ్ బుక్స్ రాశాను. 500కు పైగా వర్క్‌షాపులు నిర్వహించి... పాజిటివ్ పేరెంటింగ్, వ్యక్తిత్వ వికాసం బోధించాను. ప్రధానమంత్రి కార్యాలయం, ఢిల్లీ పోలీస్, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్. ఢిల్లీ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న అనేక కళాశాలలు నా క్లయింట్లలో ఉన్నాయి. అలాగే పలు దేశాల్లో అంతర్జాతీయ కౌన్సెలర్ల వర్క్‌షా్‌పలకు నాయకత్వం వహించాను. 2023 నుంచి ఇండిపెండెంట్ థెరపి్‌స్టగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ‘అనుభూతి వెల్పేర్ ట్రస్ట్’ పేరుతో ఒక ఎన్జీవో నడుపుతున్నాను. మంత్ర జపం ప్రయోజనాల గురించి శాస్ర్తీయమైన అధ్యయనం చేసి, ఆ సమాచారాన్ని వ్యాప్తి చేయాలన్నది నా లక్ష్యం. ఇక... నా భర్త జస్టిస్ గేదెల తుషార్ రావు ఆంధ్రప్రదేశ్‌లోని పూర్వ శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. మాకు ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి బ్రహ్మకృత్‌రావు న్యాయవాది. లండన్‌లోని ఒక న్యాయ సంస్థలో పని చేస్తున్నాడు. చిన్నబ్బాయి మహీధర్‌రావు లా చదువుతున్నాడు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్