Share News

పెద్దల్లో అదుపు తప్పే.. మలమూత్ర విసర్జన

ABN , Publish Date - May 19 , 2026 | 02:44 AM

పెద్ద వయసులో మలమూత్ర విసర్జన మీద నియంత్రణ తప్పడం సహజమనే భావన సర్వత్రా నెలకొని ఉంటుంది. అయితే పైబడే వయసులో ఈ ముప్పు పెరిగినా, దీంతోనే...

పెద్దల్లో అదుపు తప్పే.. మలమూత్ర విసర్జన

ఇన్‌కాంటినెన్స్‌

పెద్ద వయసులో మలమూత్ర విసర్జన మీద నియంత్రణ తప్పడం సహజమనే భావన సర్వత్రా నెలకొని ఉంటుంది. అయితే పైబడే వయసులో ఈ ముప్పు పెరిగినా, దీంతోనే సర్దుకుపోతూ జీవించవలసిన అవసరం లేదంటున్నారు వైద్యులు

తుమ్మినా, దగ్గినా మూత్రం లీక్‌ అయిపోతూ ఉండడం, మలవిసర్జన మీద నియంత్రణ కోల్పోతూ ఉండడం, తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తూ ఉండడం, బాత్రూమ్‌కు వెళ్లేలోపే మూత్రవిసర్జన జరిగిపోవడం లాంటి ఇబ్బందులు పెద్దల్లో చూస్తూ ఉంటాం. ఈ ఇబ్బందులన్నిటినీ పెరిగే వయసుతో ముడిపెడుతూ ఉంటాం. కొందరు పెద్దలు మూత్రం మీద నియంత్రణ కోల్పోతే (యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌), ఇంకొందరు మలమూత్రాలు రెండింటి మీదా నియంత్రణ కోల్పోతూ (డబుల్‌ ఇన్‌కాంటినెన్స్‌) ఉంటారు. ఈ సమస్యలు పెద్దల ఆత్మవిశ్వాసాన్నీ, నిద్రనూ, కదలికలనూ, మానసిక ఆరోగ్యాన్నీ, సామాజిక జీవితాన్నీ దెబ్బతీస్తూ ఉంటాయి. 65 ఏళ్లు దాటిని ప్రతి ముగ్గురు పెద్దల్లో ఇద్దరు, ఈ రెండింట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి నాడీసంబంధ రుగ్మతలు లేదా డిమెన్షియా రోగుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ.

ఎందుకీ సమస్య?

పెరిగే వయసుతో, మూత్రాశయం చిన్నదైపోయి మరింత సున్నితంగా మారిపోతుంది. మూత్రాశయానికీ, పెద్దపేగులకూ దన్నుగా ఉండే కటి కండరాలు బలహీనపడతాయి. దాంతో అర్జెన్సీ పెరిగి, తరచూ మూత్రవిసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది, మలం మీద కూడా నియంత్రణ తప్పుతుంది. అలాగే మహిళల్లో మెనోపాజ్‌, ప్రసవాల కారణంగా కటి కండరాలు బలహీనపడడం వల్ల పెద్ద వయసులో మూత్ర సమస్య వేధిస్తుంది. సహజ ప్రసవ సమయంలో పురీషనాళంలోని స్ఫింక్టర్‌ గాయపడడం వల్ల, పెద్దవయసు మహిళల్లో మలవిసర్జన మీద పట్టు తప్పుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్‌ గ్రంథి పెద్దదవడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవక, తరచూ మూత్రవిసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. పెరిగే వయసుతో పేగుల కదలికలు తగ్గి, మలబద్ధకం కూడా పెరుగుతుంది. అలాగే పురీషనాళంలోని కండరాలు పట్టు కోల్పోయి, మలవిసర్జన మీద నియంత్రణ తప్పుతుంది. పురుషుల్లో యానోరెక్టల్‌ సర్జరీ, పెల్విక్‌ రేడియోథెరపీల వల్ల కూడా మలవిసర్జన అదుపు తప్పుతుంది. మెదడుకూ, మూత్రాశయం, పెద్దపేగులకూ, కండరాలకూ మధ్య నాడీ సంకేతాల ప్రభావం కూడా, పెరిగే వయసుతో పాటు తగ్గిపోతుంది. ఈ సమస్యలన్నీ 50 నుంచి 60 ఏళ్ల మధ్య మొదలై, 70 ఏళ్లకు తీవ్రమవుతాయి.


చికిత్సలున్నాయి

పెద్దల్లో మలమూత్రవిసర్జనలను నియంత్రించడం కోసం పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే...

  • బ్లాడర్‌ ట్రైనింగ్‌

  • నిర్దిష్ట కాలకృత్య వేళలు పాటించడం

  • మలబద్ధక శిక్షణ

  • తీసుకుంటున్న మందుల విశ్లేషణ

  • కటి కండరాల వ్యాయామం

  • ఫిజియోథెరపీ

ఈ జాగ్రత్తలతో మలమూత్ర విసర్జనల మీద నియంత్రణను పెంచడంతో పాటు అవసరాన్ని బట్టి బోట్యులినం టాక్సిన్‌ ఇంజెక్షన్లు, నర్వ్‌ స్టిమ్యులేషన్‌ థెరపీలు, మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీలు, స్లింగ్‌ ప్రొసిజర్లు, ప్రోస్టేట్‌ సర్జరీలతో, వైద్యులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు.

కొన్ని వ్యాధులు, వాడుకుంటున్న మందులు కూడా ఇన్‌కాంటినెన్స్‌ సమస్యను తీవ్రతరం చేస్తాయి. అవేంటంటే....

  • వ్యాధులు: మధుమేహం, గుండెపోటు, డిమెన్షియా, పార్కిన్సన్స్‌, కిడ్నీ వ్యాధి, వెన్ను సమస్యలు, ప్రోస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌, పెల్విక్‌ ఆర్గాన్‌ ప్రొలాప్స్‌

  • మందులు: డయూరిటిక్స్‌, నిద్ర మాత్రలు, మత్తు మందులు, యాంటీడిప్రెసెంట్స్‌, ఓపియాయిడ్‌ నొప్పినివారణ మందులు, కొన్నిరకాల అలర్జీ మందులు, అవసరానికి మించిన లాక్సేటివ్స్‌

డాక్టర్‌ దర్శిత వరిగొండ

జేరియాట్రిక్‌ కన్సల్టెంట్‌,

అపోలో హాస్పిటల్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌

ఈ వార్తలనూ చదవండి:

యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్

త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్

Updated Date - May 20 , 2026 | 08:08 AM