‘బొమ్మల పెట్టె’తో సృజనకు రెక్కలు
ABN , Publish Date - Jul 13 , 2026 | 04:38 AM
నేటి డిజిటల్ ప్రపంచంలో బాల్యం బ్యాటరీతో నడిచే ప్లాస్టిక్ బొమ్మలచుట్టూ తిరుగుతోంది. అవి పిల్లల ఎదుగుదలకు దోహదం చేయకపోగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే..
నేటి డిజిటల్ ప్రపంచంలో బాల్యం బ్యాటరీతో నడిచే ప్లాస్టిక్ బొమ్మలచుట్టూ తిరుగుతోంది. అవి పిల్లల ఎదుగుదలకు దోహదం చేయకపోగా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. దీనికి పరిష్కారంగా సురక్షితమైన, పిల్లల్లో సృజనాత్మకతను, చురుకుదనాన్ని పెంచే ఆట వస్తువులకు రూపకల్పన చేశారు పుణేకు చెందిన ప్రియాంక మంగోన్కర్.. మీనూ జోషి.
ప్రియాంక మంగోన్కర్, మీనూ జోషీలది పదమూడేళ్ళ స్నేహం. అయితే కలిసి ఒక స్టార్టప్ ఆరంభిస్తామని ఎన్నడూ అనుకోలేదంటారు ఈ ఆర్కిటెక్ట్స్. ప్రియాంక పుట్టింది, పెరిగింది ముంబయిలో. బ్యాంకర్ల కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఆర్కిటెక్చర్‌వైపు ఆసక్తి చూపించారు. మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాక 2013లో పుణేలోని ఒక ఆర్కిటెక్చర్ స్కూల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా వృత్తి జీవితాన్ని ఆరంభించారు. అక్కడ మీనూ జోషి పరిచయమయ్యారు. మీనూ స్వస్థలం గుజరాత్‌లోని అహ్మదాబాద్. వ్యాపార కుటుంబంలో పుట్టిన ఆమె సూరత్‌లో ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ పూర్తి చేశాక, బ్రిటన్‌లో మాస్టర్స్ చేశారు. ‘‘మా ఇద్దరికీ బోధన, పరిశోధన అంటే ప్రాణం. మన దేశంలో అంతరించిపోతున్న కళా రూపాల గురించి ఒక పరిశోధన పత్రాన్ని రూపొందించి.. ముంబయి ఐఐటిలో నిర్వహించిన ఒక సదస్సులో సమర్పించాం. దాని కోసం సాగించిన ప్రయాణంలో ఎన్నో విషయాలు తెలుసుకున్నాం’’ అని గుర్తు చేసుకున్నారు ప్రియాంక.
తల్లులుగా ఒక పరిష్కారం
‘‘అక్కడ వివిధ రంగాలకు చెందిన నిపుణులతో పరిచయమయింది. మనం డిజిటల్ యుగంలో, గాడ్జెట్ల ప్రపంచంలో జీవిస్తున్నాం. ఫోన్ స్ర్కీన్లు, బ్యాటరీతో నడిచే ప్లాస్టిక్ బొమ్మలు, టీవీలు... పిల్లల బాల్యం వీటితోనే నిండిపోతోంది. కానీ అవి పిల్లల మనో వికాసానికి ఏమాత్రం దోహదం చెయ్యవు’’ అంటారు మీనూ. 2017లో తన బిడ్డకు ఆట వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు మార్కెట్ నిండా ప్లాస్టిక్‌తో చేసినవి, పిల్లలు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యం మీద దుష్ప్రభావం చూపించేవి మాత్రమే ఉండడం ఆమె గమనించారు. ‘‘వాటిలో చాలా బొమ్మలు హానికరమైన రసాయనాలు ఉండే ప్లాస్టిక్స్‌తో తయారైనవి. వాటిని దీర్ఘకాలం ఉపయోగించడం ప్రమాదకరం. ఈ అంశాలను ప్రియాంకతో చర్చించాను. తల్లులుగా ఇవన్నీ మేము ప్రత్యక్షంగా పరిశీలించాం. మా పిల్లల కోసం, వారి వయసు పిల్లల కోసం ఒక పరిష్కారం మేమే కనుక్కోవాలనుకున్నాం’’ అని చెప్పారు మీనూ. అలా వారిద్దరి ఆలోచనల్లోంచి ‘టాయ్ ట్రంక్’ (బొమ్మల పెట్టె) అనే సంస్థకు అంకురార్పణ జరిగింది.

వయసుల వారీగా...
‘‘బొమ్మలన్నీ చెక్కతో, ఎలాంటి విషపూరిత పదార్థాలు లేని రంగులతో తయారవుతాయి. మూడు నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలు ప్రతిదీ నోట్లో పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి వాటిని ప్రధానంగా వేప చెక్కతో రూపొందిస్తాం. ఆ తరువాత ఆరేళ్ళ వయసు వరకూ పిల్లలు ఆడుకుంటూనే నేర్చుకోవడానికి, చిన్న చిన్న సమస్యల పరిష్కారానికి, తార్కికమైన ఆలోచనలు, నైపుణ్యాలు పెంచుకోవడానికి అనువైనవి ఉంటాయి. ఎందరో కళాకారులకు ఉపాధి కూడా దీనిద్వారా లభిస్తోంది’’ అని చెప్పారు మీనూ. మనవైన ఆటలను తరువాతి తరాల కోసం సజీవంగా ఉంచుతున్నామన్న సంతృప్తి, పిల్లలను డిజిటల్ మాధ్యమాలకు దూరంగా ఉంచడానికి దోహదం చేస్తున్నామన్న సంతోషం,. తమ ‘బొమ్మల పెట్టె’కు లభిస్తున్న స్పందన, ఆదరణ మరిన్ని ఆవిష్కరణలకు ప్రేరణ కలిగిస్తున్నాయంటున్నారు ఈ స్నేహితురాళ్ళు.
రెండేళ్ళ అధ్యయనం
‘‘మనది వేల సంవత్సరాల సుసంపన్నమైన సంస్కృతి. కళా నైపుణ్యాలు, జానపద సాహిత్యం ఒక తరం నుంచి మరో తరానికి వారసత్వంగా సంక్రమిస్తున్నాయి. వాటికి వినోదాన్ని మించిన గొప్పప్రయోజనం ఉంది. చెక్కతో, లక్కతో పూర్వం ఆటబొమ్మలు తయారయ్యేవి. అవి సహజమైనవి, సురక్షితమైనవి. వాటిలో ఎంతో సృజనాత్మకత కనిపించేది. క్రమంగా అంతరించిపోతున్న ఆ కళను కాపాడడం కూడా మన బాధ్యత’’ అని అంటున్నారు ప్రియాంక. 2017 నుంచి నుంచీ రెండేళ్ళపాటు... పిల్లల అవగాహనకు, నేర్చుకోవడానికి దోహదపడే లెర్నింగ్ టూల్స్ మీద అధ్యయనం చేశారు. చెన్నపడ్నా, సవంత్‌వాదీ చెక్క బొమ్మల్ని ఆధునిక భద్రతా ప్రమాణాలకు, పిల్లల వికాసానికి అనుగుణంగా... ఎలాంటి విషపూరితమైన పదార్థాలు లేకుండా తయారు చేయడానికి రంగం సిద్ధం చేశారు. కళాకారులను భాగస్వాములుగా చేసుకున్నారు. 2021లో ఉత్పత్తిని ఆరంభించారు. కిందటి ఏడాది నుంచి ఆన్‌లైన్‌లో పూర్తిస్థాయి విక్రయాలను ఆరంభించారు.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్