టమాటాతో అందంగా...
ABN , Publish Date - May 14 , 2026 | 01:09 AM
వంటల్లో రుచికీ ఆరోగ్యానికే కాదు అందానికీ తోడ్పడుతుంది టమాటా. దీని రసంతో చిన్న చిట్కాలు పాటించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం...
వంటల్లో రుచికీ ఆరోగ్యానికే కాదు అందానికీ తోడ్పడుతుంది టమాటా. దీని రసంతో చిన్న చిట్కాలు పాటించి ముఖ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకుందాం...
టమాటాలో సి విటమిన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి పొరల నుంచి శుభ్రం చేస్తాయి. రోజూ టమాటా రసాన్ని ముఖానికి రాసి వేళ్లతో సున్నితంగా మర్దన చేస్తుంటే చర్మ రంధ్రాల్లో పేరుకున్న మురికి తొలగిపోతుంది. దీంతో మొటిమల బాధ తగ్గుతుంది. క్రమంగా నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి.
టమాటాలో లైకోపిన్ అనే మూలకం ఉంటుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది టోనర్‌లా పనిచేసి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇది సూర్మరశ్మిలోని హానికారక కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. ముఖానికి టమాటా గుజ్జు పట్టించి పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే సన్ బర్న్ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎండలో తిరగడం వల్ల చర్మంపై ఏర్పడిన ట్యాన్ తొలగిపోతుంది.
టమాటా ముక్కపై కొద్దిగా చక్కెర లేదా తేనె వేసి దానితో ముఖంపై వృత్తాకారంలో రుద్ది పావుగంట తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే చర్మం తేమతో నిండి బిగుతుగా మారుతుంది. చర్మంపై పేరుకున్న మృతకణాలు తొలగి ముఖం ఛాయగా కనిపిస్తుంది.
చిన్న గిన్నెలో నాలుగు చెంచాల టమాటా గుజ్జును తీసుకుని అందులో రెండు చెంచాల పెరుగు, చిటికెడు పసుపు వేసి బాగా కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ల పట్టించాలి. అరగంట తరువాత వేళ్లతో మెల్లగా మర్దనచేసి చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోతాయి. ముఖానికి సహజమైన మెరుపుదనం వస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్