సాగర మథనం సామాజిక సంకల్పం
ABN , Publish Date - May 04 , 2026 | 06:03 AM
సముద్రపు అలలను చూస్తే భయపడేవారు ఎందరో. కానీ, ఆ అలలనే ఆభరణాలుగా ధరించి సముద్ర గర్భంలోనే విజయాలను వెతుక్కునే సాహస నారీమణులు ...
సముద్రపు అలలను చూస్తే భయపడేవారు ఎందరో. కానీ, ఆ అలలనే ఆభరణాలుగా ధరించి సముద్ర గర్భంలోనే విజయాలను వెతుక్కునే సాహస నారీమణులు కొందరుంటారు. అలాంటి వారిలో ఒకరు తెలంగాణ స్విమ్మర్ గంధం క్వీనీ విక్టోరియా. క్రీడాకారిణిగా విజయాలు సాధించడమే కాదు.. తన అభిరుచిని సామాజిక బాధ్యతతో ముడిపెట్టి ఎందరికో స్ఫూర్తినిచ్చే దీపస్తంభంలా నిలుస్తున్నారు. ఇటీవల ఐదుగురు మహిళలతో కూడిన బృందానికి నాయకత్వం వహించి ‘రామసేతు’ (పాక్ జలసంధి) ను ఈదిన ఆమె ‘నవ్య’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
‘నేను, నా కొడుకు.. మేమిద్దరం ఈదుతున్నాం అని చెప్పుకోవడం కేవలం గొప్పకోసమేనా? మన చుట్టూ ఎంతోమంది ప్రతిభావంతులు సరైన అవకాశాలు లేక వెనుకబడిపోతున్నారు. వారిని మనం ఎందుకు ప్రోత్సహించకూడదు’.. ఈ ప్రశ్న నన్ను చాలా రోజులు తొలిచేసింది. ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో అద్భుత ప్రతిభ ఉన్న వారిని వెలుగులోకి తేవాలనే తపన నాలో మొదలైంది. అదే సమయంలో మా అమ్మాయి క్లాస్‌మేట్ అయిన 22 ఏళ్ల యువకుడు డ్రగ్స్ మత్తులో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం నన్ను కలచివేసింది. ఆ తల్లిదండ్రుల వేదనను దగ్గరగా చూశాక ఒక తల్లిగా నా గుండె తరుక్కుపోయింది. ‘బిడ్డలున్న తల్లిగా ఈ సమాజానికి ఏదైనా చేయాలి’ అని ఆ క్షణమే నిశ్చయించుకున్నాను. మత్తుపదార్థాల మహమ్మారిపై అవగాహన కల్పించడానికి, నా ప్రాణమైన స్విమ్మింగ్‌నే ఆయుధంగా ఎంచుకున్నాను. నాలాంటి తల్లులతో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి మా ద్వారా ఈ సందేశాన్ని బలంగా వినిపించాలనుకున్నాను. అలా శ్రీలంకలోని తలైమన్నార్ నుంచి మన ధనుష్కోడి వరకు సాగర యాత్రకు అంకురార్పణ చేశాను.
బృంద నిర్మాణం.. ఆటంకాలు
ఒక మంచి లక్ష్యం కోసం భయమంటే తెలియని మహిళా స్విమ్మర్లను వెతకడం ఎంత కష్టమో అప్పుడే నాకు తెలిసొచ్చింది. ఈత వచ్చినవారు లక్షల్లో ఉంటారు. కానీ, అల్లకల్లోలంగా ఉండే సముద్రంలో ఈదగల ధైర్యవంతులు కావాలి. ఆరు నెలలపాటు దేశమంతా తిరిగాను. ఢిల్లీ, విజయవాడ, పుణె, కర్ణాటక.. ఇలా ఎన్నో చోట్ల ఓపెన్ వాటర్ స్విమ్మర్లను కలిశాను. ఎన్నో తిరస్కరణలు, అడ్డంకులు ఎదుర్కొన్న తర్వాత చివరికి ఆరుగురితో ఒక బృందాన్ని సిద్ధం చేయగలిగాను. మా బృందంలో నాతోపాటు పూణె నుంచి స్మిత, తెలంగాణ నుంచి మౌనిక, ఢిల్లీ నుంచి ఆర్తి, విజయవాడ నుంచి రాధిక, రజని ఉన్నారు. అంతా సిద్ధమై భారత్, శ్రీలంక ఎంబసీల నుంచి అనుమతులు కూడా వచ్చాక యాత్రకు కేవలం మూడు రోజుల ముందు ఊహించని షాక్ తగిలింది. రజని తనవల్ల కాదని చెప్పింది. ఆరుగురి పేర్లపై అనుమతులు రావడంతో కొత్తవారిని చేర్చుకునే అవకాశం లేకుండా పోయింది. ఆరుగురి కోసం వేసుకున్న ప్రణాళికను ఐదుగురితో పూర్తిచేయాల్సి రావడంతో మా అందరిపైనా మానసికంగా, శారీరకంగా పెనుభారం పడింది. ప్రతి ఒక్కరి విశ్రాంతి సమయం తగ్గిపోయింది. అయినా ఒక నాయకురాలిగా నా బృందంలో ధైర్యం నింపి, ముందుకు నడిపించాల్సిన బాధ్యత నాపై ఉందని దృఢంగా నిశ్చయించుకున్నాను.

అలలపై సాహస యాత్ర
ఏప్రిల్ 25న అర్ధరాత్రి దాటాక 2 గంటలకు శ్రీలంకలోని తలైమన్నార్ తీరంలో చిమ్మచీకటిని చీల్చుకుంటూ మా యాత్ర మొదలైంది. ఎగసిపడే అలల మధ్య, ఒకరి తర్వాత ఒకరు గంట చొప్పున ఈదుతూ ముందుకు సాగాం. సముద్రంలో ఉండే జెల్లీఫిష్‌ల నుంచి రక్షణ కోసం అమెరికా నుంచి ప్రత్యేకమైన క్రీములు తెప్పించుకున్నాం. సాధారణంగా స్విమ్మర్లకు రాత్రిపూట చిన్న లైట్లు ఇస్తారు. కానీ జెల్లీఫి్‌షలను ఆ కాంతి ఆకర్షిస్తుందని లైట్లు లేకుండానే ఈదాల్సి వచ్చింది. మా వెంట వచ్చే మదర్‌బోట్ వెలుగులే మాకు దారిచూపాయి. ఈ యాత్రలో నా బృంద సభ్యులు అద్భుతమైన పట్టుదల చూపారు. ముఖ్యంగా మౌనిక, ఆర్తి తమ వేగంతో ఎక్కువ దూరం కవర్ చేసి మాకు అండగా నిలిచారు. బృందంలో పెద్దవారైన 52 ఏళ్ల స్మిత ఆరోగ్య సమస్యలు ఉన్నా వెనుకడుగు వేయలేదు. 49 కిలోమీటర్ల ఈ సుదీర్ఘ యాత్రను 10 గంటల 10 నిమిషాల్లోనే పూర్తిచేసి ఏప్రిల్ 26న మధ్యాహ్నం ధనుష్కోడి తీరాన్ని చేరుకున్నాం. భారత జలాల్లోకి అడుగుపెట్టగానే ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్ అధికారులు మాకు స్వాగతం పలికిన క్షణం నా జీవితంలో మర్చిపోలేను. బెంగళూరుకు చెందిన సతీశ్ ‘స్విమ్ లైఫ్’ ఆర్గనైజేషన్ ద్వారా నాకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్‌లో అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆయన పర్యవేక్షణలోనే ఈ సాహసయాత్రను పూర్తిచేశాం. అలాగే ‘యూనిఫ్లై’ సంస్థ స్పాన్సర్‌షిప్ లేకపోతే ఈ యాత్ర సాధ్యమయ్యేది కాదు.
గుర్తింపు కోసం..
ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ ప్రాణాలతో చేసే సాహసం. ఎవరెస్ట్ ఎక్కిన వారికి లభించే గుర్తింపు.. సముద్రాలను జయించే మాకు ఎందుకు లభించడం లేదనేది నా ఆవేదన. ప్రభుత్వం నుంచి చేయూత లభిస్తే మిగిలిపోయిన నాలుగు సముద్రాలను కూడా ఈది భారత కీర్తి పతాకాన్ని సగర్వంగా ఎగరేస్తాను. ప్రస్తుతం ఎల్బీ స్టేడియంలో సంతోష్‌చారి వద్ద శిక్షణ పొందుతున్నాను. నా తదుపరి లక్ష్యం నా కుమార్తె, కొడుకుతో కలిసి సముద్రం ఈది తల్లి, కొడుకు, కూతురు కలిసి ఈదిన తొలి కుటుంబంగా ప్రపంచ రికార్డు సృష్టించడం. నా ప్రయాణంలో మావారు అనిల్ కుమార్ సహా ఎంతోమంది అండగా నిలిచారు. వారందరికీ కృతజ్ఞతలు. పట్టుదల ఉంటే వయసు, విమర్శలు, ఆర్థిక ఇబ్బందులు ఏవీ మనల్ని ఆపలేవని నిరూపించడమే నా లక్ష్యం. మరిన్ని విజయాలతో దేశానికి గర్వకారణంగా నిలవాలన్నదే నా ఆశ, ఆశయం.
గురులింగాచారి
విమర్శలే విజయానికి సోపానం
నిజానికి నా ఈ ప్రస్థానం 2018లో నా పిల్లల వల్లే మొదలైంది. ఫ్యాషన్ డిజైనర్‌గా బర్కత్‌పురలో ‘క్వీన్స్ ఫ్యాషన్ స్టూడియో’ నడుపుతున్న నేను.. నా పిల్లలు ఎలిజబెత్ క్వీన్, స్టీఫెన్ కుమార్‌ను చూసి స్ఫూర్తి పొందాను. నేను కూడా పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టాను. వారిద్దరూ నేషనల్ స్విమ్మర్లు. ప్రపంచంలో అత్యంత కఠినమైన ఏడు సముద్రాల్లో మూడింటిని (ఇంగ్లిష్ చానల్, కాటలినా చానల్, కుక్ జలసంధి) ఈదాను. కుక్ స్ట్రెయిట్‌ను ఈదిన తొలి దక్షిణ భారత మహిళగా రికార్డు సృష్టించాను. నా కొడుకు స్టీఫెన్‌తో కలిసి ఈదాను. ప్రపంచంలో తల్లితో కలిసి సముద్రాలు ఈదిన మొట్టమొదటి కొడుకుగా స్టీఫెన్ రికార్డులకెక్కాడు. ఇన్ని విజయాలు సాధిస్తున్నా, ఎన్నో విమర్శలు నన్ను వెంటాడాయి. ‘ఆమె ఇంగ్లిష్ చానల్ ఈదలేదు.. దేశం పరువు తీస్తుంది’ అని కొందరు, ‘ఆమె తెలంగాణ స్విమ్మర్ కాదు’ అని మరికొందరు అన్నప్పుడు బాధ కలిగినా , ఆ విమర్శలనే నా విజయానికి సోపానాలుగా మార్చుకున్నాను.