స్టిరాయిడ్స్‌తో కంటి సమస్యలు
ABN , Publish Date - May 19 , 2026 | 02:40 AM
కొన్ని రుగ్మతలకు దీర్ఘకాలం పాటు వాడుకునే స్టిరాయిడ్ల వల్ల, వాటి ప్రభావం కళ్ల మీద పడుతుంది. కాబట్టి ఈ మందుల వాడకంలో వైద్యుల సూచనలను తప్పక పాటిస్తూ...
ఐ కేర్
కొన్ని రుగ్మతలకు దీర్ఘకాలం పాటు వాడుకునే స్టిరాయిడ్ల వల్ల, వాటి ప్రభావం కళ్ల మీద పడుతుంది. కాబట్టి ఈ మందుల వాడకంలో వైద్యుల సూచనలను తప్పక పాటిస్తూ, కంటి ఆరోగ్యం మీద ఓ కన్నేసి ఉంచాలంటున్నారు వైద్యులు
రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ఎగ్జీమా, ఉబ్బసం, లూపస్, తీవ్రమైన దగ్గు... మొదలైన దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం కోసం వైద్యులు స్టిరాయిడ్స్‌ను సూచిస్తూ ఉంటారు. అయితే ఈ మందులను దీర్ఘకాలం వాడుకోవడం వల్ల కాటరాక్ట్, గ్లకోమా సమస్యలు తలెత్తే ముప్పు పొంచి ఉంటుంది. కంటి శుక్లాలకు సర్జరీ చేసిన తర్వాత తిరిగి చూపు మెరుగు పడుతుంది. కానీ గ్లకోమాలో ఇలా సాధ్యపడదు. గ్లకోమాలో కంటి నాడి తిరిగి సరిదిద్దలేనంతగా దెబ్బతిని, దృశ్య పరిధి కుంచించుకుపోతూ, అంతిమంగా ఒక చిన్న సొరంగంలో నుంచి చూస్తున్నట్టు, కంటి చూపు అతి తక్కువ పరిధికి పరిమితమైపోతుంది. ఇలా దెబ్బతిన్న కంటి చూపును తిరిగి చికిత్సతో సరిదిద్దడం సాధ్యపడదు.
వైద్యుల సూచన మేరకు...
కొన్ని రకాల దీర్ఘకాలిక రుగ్మతలకు స్టిరాయిడ్లు వాడుకోక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు ఈ మందులతో కంటిచూపు దెబ్బతినకుండా ఉండాలంటే, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. సాధారణంగా స్టిరాయిడ్స్‌ను సూచించే సందర్భాల్లో వైద్యులు, వాటి మోతాదు, ప్రభావాలను కాలక్రమేణా తగ్గిస్తూ ఉంటారు. ఎగ్జీమా లాంటి చర్మ సమస్యల చికిత్సలో వైద్యులు ఎక్కువ డోసుతో మొదలుపెట్టి, క్రమేపీ ఆ డోసు తగ్గిస్తూ, సమస్యను పూర్తిగా తొలగించేస్తారు. అయితే అదే సమస్య మళ్లీ తలెత్తిన సందర్భాల్లో రోగులు వైద్యులను కలవకుండా, మునుపటి మందులనే కొనేసి వాడేస్తూ ఉంటారు. డోసు పట్ల అవగాహన లేక, తెలియని డోసులో మందులను వాడుకుంటూ, సమస్య అదుపులోకొచ్చిందని మందులు ఆపేయగానే, అదే సమస్య తిరగబెడుతుంది. దాంతో మళ్లీ అవే మందులను కొని వాడేస్తారు. ఇలా స్టిరాయిడ్స్‌ను పదే పదే వాడుకోవడం వల్ల కంటి నరం దెబ్బతిని, కాటరాక్ట్ లేదా గ్లకోమా వేధిస్తాయి.
పర్యవేక్షణ, పరీక్షలు... తప్పనిసరి
వైద్యులు సూచించిన స్టిరాయిడ్స్ వాడుతూ, వారి పర్యవేక్షణలో నడుచుకోవడం అవసరం. క్రమం తప్పకుండా వైద్యులను కలుస్తూ ఉండగలిగితే, వ్యాధి మీద మందుల ప్రభావం ఏ మేరకు ఉందో కనిపెట్టడంతో పాటు, అవే మందుల ప్రభావం కళ్ల మీద ఏ మేరకు ఉందన్నది ముందుగానే కనిపెట్టగలుగుతారు. దాంతో పరిస్థితిని బట్టి ప్రత్యామ్నాయ మందులను సూచించగలుగుతారు. అలాగే కంట్లో తలెత్తే మార్పులను కనిపెట్టడం కోసం, క్రమంతప్పక కంటి పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి.
వేసవిలో పిల్లల కళ్లకలక
ప్రత్యేకించి వేసవిలో చిన్న పిల్లల్లో అలర్జిక్ కంజెక్టివైటిస్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. ఈ సమస్యకు ‘వెర్నల్ కంజెక్టివైటిస్’ అనే మరో పేరు కూడా ఉంది. విపరీతమైన దురద, స్రావాలు కలిగిన ఈ కళ్లకలకకు, వైద్యులు, తేలికపాటి స్టిరాయిడ్స్ సూచిస్తూ ఉంటారు. అయితే మందులతో రుగ్మత తగ్గినా, రెండోసారి అదే రుగ్మత తలెత్తినప్పుడు, తల్లితండ్రులు వైద్యులను కలవకుండా, అవే మందులను కొని వాడేస్తూ ఉంటారు. ఇలా ఈ మందులను పదే పదే వాడడం వల్ల కళ్లలో ఒత్తిడి (ఆంట్రాక్యులర్ ప్రెజర్) పెరిగి, లెన్స్ దెబ్బతిని, కాటరాక్ట్ తలెత్తుతుంది. కాబట్టి అలర్జిక్ కంజెక్టివైటిస్ కోసం వైద్యులు సూచించిన మందులను వాడుకోవాలి. రెండోసారి అదే రుగ్మత తలెత్తినా, పిల్లలను వైద్యులకు చూపించాలి. అంతేతప్ప, పాత మందులనే కొని వాడేయకూడదు.
డాక్టర్ హరినాథ్ బాబు కర్లపూడి
కన్సల్టెంట్ ఆప్థల్మాలజిస్ట్,
కాటరాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్,
మెడికవర్ హాస్పిటల్స్,
హైటెక్ సిటీ, హైదరాబాద్
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్