మగాళ్ళూ! మౌనం వీడండి
ABN , Publish Date - May 14 , 2026 | 01:19 AM
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మానవాళి ప్రగతి సాధించినా... మహిళలపట్ల పురుషుల దృష్టికోణంలో వచ్చిన మార్పు అంతంత మాత్రమే. అందుకు జాతీయ నేరగణాంకాల...
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మానవాళి ప్రగతి సాధించినా... మహిళలపట్ల పురుషుల దృష్టికోణంలో వచ్చిన మార్పు అంతంత మాత్రమే. అందుకు జాతీయ నేరగణాంకాల పట్టికలోని అంకెలే నిదర్శనం. మహిళాభివృద్ధికి ప్రధాన అవరోధంగా మారిన వేధింపుల పర్వానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్న సంకల్పంతో తెలంగాణ మహిళా భద్రతా విభాగం డీజీపీ చారు సిన్హా... ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెను ‘నవ్య’ పలకరించింది.
‘‘మహిళల భద్రత కేవలం పోలీసుల కర్తవ్యమే కాదు... సమాజానికి కూడా అంతకుమించిన బాధ్యత ఉంది. ఇల్లు, పని ప్రదేశం, వీధులు, సామాజిక మాధ్యమాలు, బస్సులు, రైళ్లు... అంతటా మహిళల పట్ల అమర్యాద, అవమానాలు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. కొందరు మగవాళ్లు వంకరచూపులతో ఇబ్బందిపెడితే, ఇంకొందరు మాటలతో వేధిస్తారు. మరికొందరు చేష్టలతో హింసిస్తారు. ఇంటర్నెట్ వాడకం పెరిగిన తర్వాత మహిళలపై వేధింపులు రకరకాలుగా కొత్తరూపాలు తీసుకున్నాయి. ఒకడు... తను లైంగిక దాడికి ఎలా ఒడిగడతాడో కళ్లకుకట్టినట్టుగా వివరించి, బెదిరిస్తూ తీసిన వీడియోను ఒక అమ్మాయికి పంపించాడు. అది విన్న నా మనసు కకావికలమైంది. ‘అబ్బాయిల మానసిక స్థితి ఇంత దారుణంగా తయారయిందా?’ అని నిర్ఘాంతపోయాను. లింగవివక్ష పూర్వక వ్యాఖ్యలు, ఈవ్‌టీజింగ్, ఆన్‌లైన్ వేధింపుల సంగతి అయితే చెప్పనవసరం లేదు. ఇవన్నీ సర్వసాధారణమన్నంతగా సమాజంలోనూ అభిప్రాయం స్థిరపడిపోయింది. మాటలతో వేధించేవాడిని ఇవాళ నిలువరించకపోతే రేపు వాడే యాసిడ్ బాటిల్ పట్టుకొని తిరుగుతాడు. కనిపించిన ప్రతి అమ్మాయి పట్ల వికారంగా ప్రవర్తిస్తాడు. మరి పురుషుల్లోని ఈ మితిమీరినతనాన్ని అడ్డుకునేదెవరు? దాన్ని మొగ్గలోనే తుంచేదెవ్వరు? ఆ బాధ్యత కూడా బాధితురాలిమీదే నెడదామా? కాదు... ఆమెకు తోడుగా నిలవాల్సింది మనమే! బాధితురాలి పక్షాన వకాల్తాపుచ్చుకొని, ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పాల్సిన కనీస బాధ్యత పురుషులదే! మగాళ్లూ! మౌనం వీడండి. మహిళలపై వేధింపుల పర్వాన్ని అడ్డుకోండి. ఇదే పిలుపుతో ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్ మొదలుపెట్టాం.
విశ్వవిద్యాలయాల్లోకి...
ఏడాది పాటు కొనసాగే ‘స్టాండ్ విత్ హర్’ క్యాంపెయిన్‌లో నెలకొక ప్రత్యేక థీమ్‌ను ఎంపిక చేసుకొని ప్రచారం నిర్వహిస్తున్నాం. సెక్సిస్ట్ జోక్స్, ఈవ్‌టీజింగ్ లాంటి వేధింపుల సంస్కృతిని చట్టాలు, శిక్షలకన్నా పురుషుల దృక్పథాన్ని మార్చడం ద్వారానే నిర్మూలించగలం. దానికోసం అవగాహన కల్సించే వీడియోలు, లఘుచిత్రాలు రూపొందిస్తున్నాం. వివిధ రంగాలవారితో చర్చాగోష్ఠులు నిర్వహిస్తున్నాం. జూలైలో తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాలకూ ఈ క్యాంపెయిన్‌ను తీసుకు వెళ్లడానికి అనుగుణమైన ప్రణాళికలు తయారుచేశాం. కొందరు ప్రొఫెసర్లతో కమిటీలు ఏర్పాటుచేసి... రకరకాల అంశాలపై ప్యానల్ డిస్కషన్స్ పెడతాం. వీడియోలనూ ప్రదర్శిస్తాం. ఆ క్రమంలో ఏది సరైన ప్రవర్తన? ఏది కాదన్న విషయాన్ని అర్థంచేసుకొనే అవకాశాన్ని అబ్బాయిలకే వదిలేస్తాం. తద్వారా వాళ్లలో జెండర్ సెన్సిటివిటీని పెంపొందించాలన్నది మా ఉద్దేశం. ఉదాహరణకు తమకు నచ్చిన దుస్తులు ధరించే అబ్బాయిలు... అమ్మాయిల వస్త్రధారణ మీద వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సరైనది? నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ అమ్మాయిలకు లేదా? అసలు మహిళలు, యువతులు ఎలా నడుచుకోవాలి? ఎలాంటి దుస్తులు ధరించాలి? లాంటి విషయాల్లో తీర్పులు ఇచ్చే అధికారం ఎవరిచ్చారు? ఇటువంటి సున్నితమైన అంశాలపై సునిశితమైన చర్చను ఈ క్యాంపెయిన్ ద్వారా పురుషుల ముందు ఉంచుతున్నాం.
కార్పొరేట్‌లో కష్టాలు...
పురుషులు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే... ఒక యువతి లేదా మహిళ మీతో కలిసి కాఫీ తాగడానికి వచ్చినంత మాత్రాన, లేదా మీతో స్నేహపూర్వకంగా మెలిగినంత మాత్రాన ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు కాదు. దురదృష్టవశాత్తూ అమ్మాయిలపట్ల అబ్బాయిల సత్ప్రవర్తనతో మెలిగే పద్ధతులను మన పాఠశాలలు, విద్యాలయాలు, కుటుంబం, సమాజం... ఇవేవీ నేర్పించలేకపోతున్నాయి. వారిని సినిమాలు బాగా ప్రభావితం చేస్తున్నాయి. సున్నితత్వాన్ని పెంపొందించే సినిమాలు, వెబ్‌సిరీ్‌సలు, సాహిత్యం విరివిగా రావాలి. అందుకే సినీరంగ ప్రముఖులను కూడా ఈ క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం చేస్తున్నాం. కార్పొరేట్ కంపెనీల్లో మగ టీమ్‌లీడర్లు, మేనేజర్ల వేధింపులు తట్టుకోలేక ఉద్యోగాలు వదిలేస్తున్న ఉద్యోగినులు ఎంతోమంది. ఒకవేళ ఫిర్యాదుచేస్తే మరొక ఆఫీసులో ఉద్యోగం దొరకదన్న భయం చాలామంది మహిళలది. లేదంటే... ఆమె మీద ప్రాబ్లమేటిక్ అనో లేదా పని సరిగ్గా చేయరనో రకరకాల ముద్రలువేసి దుష్ప్రచారం చేస్తుంటారు. హైదరాబాద్‌లోని చాలా కార్పొరేట్ కంపెనీల్లో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీలు లేవు. ఆఫీసులో ఎవరైనా ఒక తెంపరి... ఉద్యోగినుల మీద ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా సెక్సిస్ట్ జోక్స్ వేయడం, పలుచనచేసి మాట్లాడడం లాంటివి చేసినప్పుడు నిర్మొహమాటంగా ‘అది సరికాదు’ అని చెప్పాల్సింది పురుషులే! .

అలాంటి వారిని వదిలేది లేదు
ఆన్‌లైన్‌లో మహిళలపై వేధింపులు ఈ మధ్యకాలంలో పెరిగాయి. ఏదైనా సామాజిక అంశంపై మహిళలు అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సందర్భంలో అవి మరింత మీరుతున్నాయి. బూతులు తిట్టడం సర్వ సాధారణమైంది. ఇలాగే తమ అభిప్రాయాలను చెబుతూ వీడియోలు షేర్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టులను సోషల్ మీడియాలో కొందరు పోకిరీలు వేధించిన ఘటనలు మా దృష్టికి వచ్చాయి. కేవలం బూతులతో దాడిచేయడమే కాదు, వారి ఫొటోలు మార్ఫ్‌చేసి మరీ షేర్ చేయడం లాంటి నీతిమాలిన చర్యలకు పాల్పడ్డారు. అలాంటి వారిని గుర్తించి తగిన శిక్షపడేలా చేశాం. బూతులు, తిట్లతో వేధిస్తామంటే పోలీసులు ఓ కంట కనిపెడుతున్నారన్న సంగతి ఆన్‌లైన్ పోకిరీలు గుర్తుంచుకోవాలి.
దయచేసి స్పందించండి!
కొన్నాళ్ల కిందట రాజస్థాన్‌లో నేను గమనించిన ఒక ఘటన గురించి కచ్చితంగా చెప్పాలి. అక్కడ ఒక పెద్ద హోటల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో కొందరు అమ్మాయిలు ఈత కొడుతున్నారు. ఆ ఈతకొలను చుట్టూ మగ వెయిటర్లంతా నిలబడి సినిమాలా చూస్తున్నారు. హోటల్ యాజమాన్యం, ఆ అమ్మాయిలు, చుట్టుపక్కల వ్యక్తుల్లో ఒక్కరుకూడా కనీసం ఆ వెయిటర్లను అదిలించిన పాపాన పోలేదు. ప్రతిచోటా ఇలాంటి అపసవ్య ధోరణులే. వాటన్నింటినీ చూస్తూ ఊరుకోవడమేనా! నోరు మెదిపాలి కదా! ‘ఇది తప్పు’ అని చెప్పాలి కదా! అమ్మాయిల తీరు కూడా మారాలి. బస్టా్‌పలో ఆకతాయిలు వేధిస్తుంటే మరొక బస్సు రూట్‌కు వెళ్లడం, జీన్స్ ధరించావని కాలేజీలో ఎవడో కామెంట్ చేస్తే, ఇష్టమైన ఆ డ్రెస్‌కు బదులు సల్వార్ కమీజ్‌లోకి మారడం, వీఽధిలో వెళ్లేప్పుడు ఈవ్‌టీజింగ్ ఎదురైతే, మౌనంగా తలవంచుకొని వెళ్లడం కాదు... పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అలాంటి విపత్కాలంలో పురుషులు మహిళలకు తోడుగా నిలవాలి.’’
సాంత్వన్
జెండర్ కన్వర్జేషన్స్‌తో మార్పు...
నేను సీఆర్పీఎఫ్ కశ్మీరు సెక్టార్‌కు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ)గా పనిచేస్తున్న సమయంలో 28వేల మంది పురుషులతో ‘జెండర్ కన్వర్జేషన్స్’ కార్యక్రమం నిర్వహించాం. ఇంటికి దూరంగా ఉంటూ విధులు నిర్వర్తించే వారందరిలో ఆ ప్రోగ్రామ్ ద్వారా అనూహ్యమైన మార్పులు తీసుకురాగలిగాం. అది వారి వ్యక్తిగత, కుటుంబ జీవితాలమీదా సానుకూల ప్రభావం చూపింది. డిగ్రీ చదువుతున్న తన కుమార్తెకు వెంటనే పెళ్లి చేయాలనుకున్న ఓ తండ్రితో మేము మాట్లాడిన తర్వాత... అమ్మాయి చదువుకొని, మంచి ఉద్యోగంలో చేరిన తర్వాతే, అదీ ఆమె ఇష్టప్రకారం సంబంధాలు చూడాలని నిశ్చయించుకున్నాడు. వెయ్యిమందికిపైగా సీఆర్పీఎఫ్ సిబ్బంది సెలవులకు ఇంటికి వెళ్లినప్పుడు తమ భార్యలకు స్కూటర్ నేర్పించారు. చర్చలు, సంభాషణల ద్వారా దృక్పథాన్ని మార్చవచ్చనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ‘స్టాండ్‌విత్ హర్’ క్యాంపెయిన్ ద్వారా ఇలాంటి సానుకూల ఫలితాలు కచ్చితంగా వస్తాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్