Share News

సొంత వైద్యం... కొంత మానుకుని

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:47 AM

జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు... ఇలా దేనికైనా డాక్టర్ల చీటీలతో పని లేకుండా స్వయంగా మందులు కొనుక్కుని వాడేసుకుంటున్నాం! ఈ అలవాటు దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని...

సొంత వైద్యం... కొంత మానుకుని

సెల్ఫ్‌ మెడికేషన్‌

జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు... ఇలా దేనికైనా డాక్టర్ల చీటీలతో పని లేకుండా స్వయంగా మందులు కొనుక్కుని వాడేసుకుంటున్నాం! ఈ అలవాటు దీర్ఘకాలంలో తిరిగి సరిదిద్దలేని అనారోగ్యాలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

మనం తీసుకునే ప్రతి మందు, ఇతర మందులతో పరస్పర చర్య జరుపుతుంది. ఈ క్రమంలో ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం పడుతుంది. అలర్జీ మందులు మెదడు మీద ప్రభావాన్ని కనబరుస్తాయి. మరీ ముఖ్యంగా నాడీ సంబంధ మందులు, మానసిక సమస్యల మందులు వాడుకునేవాళ్లు స్వయంగా అలర్జీ మందులు వాడుకోవడం ప్రమాదకరం. కాబట్టే ప్రభుత్వం కొన్ని కాంబినేషన్‌ డ్రగ్స్‌ మీద నిషేధం విధించింది. వైద్యుల ప్రిస్ర్కిప్షన్‌ లేకుండా వాటిని విక్రయించకూడదని ఆంక్షలు విధించింది. వీటిలో చెప్పుకోదగినవి దగ్గు మందులు. వీటిలో కల్తీలు జరగడంతో పాటు, మత్తు కలిగించే తత్వం ఉండడంతో వీటికి వ్యసనపరులుగా మారుతున్న

సందర్భాలు కూడా పెరుగుతున్నాయి. అలాగే వయసు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు, వాటికి వాడుకుంటున్న మందులు తదితర వివరాల ఆధారంగా వైద్యులు తగిన మందును, మోతాదునూ నిర్ణయిస్తారు. కాబట్టి ఎవరికి వారు స్వయంగా మందులు కొని వాడుకోవడం ప్రమాదకరం.

అలర్జీ మందులతో ముప్పులు

యాంటీ హిస్టమిన్స్‌లో రకాలుంటాయి. కోల్డ్‌ యాక్ట్‌ లాంటి మందుల్లో జలుబును తగ్గించే మందుతో పాటు ఫినైలెఫ్రిన్‌ కూడా ఉంటుంది. దీంతో రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు ఉన్నవారికీ, రక్తపోటు పెరిగే దశలో ఉన్నవారికీ ఈ మందుతో రక్తపోటు మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అలర్జీ మందులు మెదడు మీద ప్రభావాన్ని కనబరిచి మత్తును కలిగిస్తాయి. కాబట్టి ఈ మందులు వేసుకుని వాహనాలు నడపడం ప్రమాదకరం. మరీ ముఖ్యంగా మద్యంతో పాటు అలర్జీ మందులు తీసుకోవడం అత్యంత ప్రమాదకరం. అలర్జీలు ఉన్నవారు వైద్యులను కలిసి అలర్జీ మందులు వాడుకోవాలి.


నొప్పి తగ్గించే మందుల మతలబులు

నొప్పి మూలాలు పలు రకాలు. కండరానికి సంబంధించిన నొప్పి కావచ్చు. ఎముకకు సంబంధించిన నొప్పి కావచ్చు. నరానికి సంబంధించిన నొప్పి కావచ్చు. ఇన్‌ఫెక్షన్‌ తాలూకు నొప్పి కావచ్చు. కాబట్టి మూల కారణంతో ముడిపడిన నొప్పిని తగ్గించే మందును ఎంచుకోవాలి. ఇందుకోసం వైద్యుల సలహా తీసుకోవడం తప్పనిసరి. నొప్పి తగ్గించే మందులన్నీ కాలేయం, మూత్రపిండాలను ప్రభావితం చేస్తాయి. రక్తపోటును కూడా పెంచుతాయి. ఇష్టారాజ్యంగా పెయిన్‌ కిల్లర్స్‌ వాడినప్పుడు, అజీర్తి, అల్సర్‌ వేధిస్తాయి. కాలేయం, మూత్రపిండాలు కూడా దెబ్బతింటాయి. అయితే అప్పుడప్పుడూ చిన్నపాటి తలనొప్పులు లాంటి వాటిని తగ్గించుకోవడం కోసం పారాసిటమాల్‌ వాడుకోవచ్చు.

అసిడిటీ మందుల సమస్యలు

అసిడిటీకి టానిక్స్‌, మాత్రలు, పౌడర్లు అందుబాటులో ఉన్నాయి. బయటి ఆహారం తిన్నప్పుడు తలెత్తిన అజీర్తితో అసిడిటీ వేధిస్తే యాంటాసిడ్‌ వాడుకోవడం అవసరమే! అయితే యాంటాసిడ్స్‌లో ఉండే అల్యూమినియం హైడ్రాక్సైడ్‌, సోడియం పికోసల్ఫేట్‌ మొదలైన రసాయన సమ్మేళనాల వల్ల శరీరంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. మరీ ముఖ్యంగా అసిడిటీ మందులతో నీళ్ల విరోచనాలు, మలబద్ధకం, కడుపుబ్బరంతో పాటు పేగుల్లో అవరోధాలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. కొన్ని యాంటాసిడ్‌ టానిక్స్‌తో రక్తపోటు పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ మందులతో మూత్రపిండాలు విఫలమయ్యే ముప్పు కూడా ఉంటుందని వైద్య పరిశోధనల్లో తేలింది. పిసిఒడి సమస్యలున్న మహిళల్లో ఈ మందులతో సమస్య మరింత తీవ్రమయ్యే ముప్పు ఉంటుంది. అలాగే పురుషుల్లో పురుష హార్మోన్లు ప్రభావితమై, రొమ్ములు పెరిగే ముప్పు కూడా ఉంటుంది.

లాక్సేటివ్స్‌ ఆచితూచి...

ఒత్తిడి, అస్తవ్యస్థ ఆరోగ్య జీవనశైలి, ఆహారపుటలవాట్ల వల్ల మలబద్ధకం సమస్య పెరుగుతోంది. నిజానికి మందులతో పని లేకుండా ఈ సమస్యను పరిష్కరించుకోగలిగే వెసులుబాట్లు ఉన్నాయి. కానీ మందులతో సులువుగా పని జరిగిపోతూ ఉండడంతో లాక్సేటివ్స్‌కు అలవాటు పడిపోతున్నారు. కానీ పదే పదే లాక్సేటివ్స్‌ వాడుకోవడం వల్ల పేగుల్లో కండరాల కదలికలు తగ్గిపోతాయి. దాంతో లాక్సేటివ్‌ తీసుకుంటే తప్ప విరోచనం కాని పరిస్థితి తలెత్తుతుంది. వీటిలో కూడా రకాలుంటాయి. కొన్ని మందులు మలాన్ని మృదువుగా మారుస్తాయి. ఇంకొన్ని మలం పేగుల్లో కదలడానికి తోడ్పడతాయి. అయితే ఈ రెండు రకాల మందులతో శరీరంలో ఎలకొ్ట్రలైట్‌ ఇంబ్యాలెన్స్‌ ఏర్పడుతుంది. దాంతో సోడియం, క్యాల్షియం లోపాలు తలెత్తుతాయి. లాక్సేటివ్స్‌తో నీళ్ల విరోచనాలు పెరిగి, డీహైడ్రేషన్‌ సమస్య కూడా తలెత్తవచ్చు. ఫలితంగా దీర్ఘకాలంలో మూత్రపిండాలు దెబ్బతినొచ్చు. పేగులు వాటంతట అవి కదిలి సుఖ విరోచనం జరిగే పరిస్థితి అదుపు తప్పినప్పుడు పేగుల్లోని కండరాలు బలహీనపడడంతో పాటు నరాల బలహీనత కూడా తలెత్తుతుంది. ఇలాంటి సైకలాజికల్‌ డిపెండెన్సీకి గురవడం మరింత ప్రమాదకరం. కాబట్టి మలబద్ధకాన్ని పెంచే జంక్‌ ఫుడ్స్‌, దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకుని పీచు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మలబద్ధకాన్ని పెంచే ప్రొటీన్‌ పౌడర్లను తగ్గించుకోవాలి. డీహైడ్రేషన్‌ కూడా మలబద్ధకాన్ని పెంచుతుంది కాబట్టి సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి.


ఆన్‌లైన్‌ సప్లిమెంట్లతో....

పోషక లోపం ఉన్నప్పుడే సప్లిమెంట్‌ వాడుకోవాలి. ఎవరికి వారు లక్షణాల ఆధారంగా లోపాలను అంచనా వేసి, ఆన్‌లైన్‌లో దొరికే సప్లిమెంట్లను కొనుక్కుని వాడేసుకునే సందర్భాలు పెరుగుతున్నాయి. ఇలా వాడుకోవడం వల్ల అవసరం లేకపోయిన అదనంగా పోషకాలను శరీరానికి అందించినవాళ్లమవుతాం! అలాగే ఇలాంటి సప్లిమెంట్లలో భార లోహాలు, రసాయనాలు ఉండొచ్చు. ఆయుర్వేద మిశ్రమాలు, మూలికలు ఉండొచ్చు. వీటితో మూత్రపిండాలు, కాలేయాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. అదనంగా అవసరం లేకపోయినా విటమిన్‌ సప్లిమెంట్లు వాడుకున్నప్పుడు విటమిన్‌ టాక్సిసిటీకి గురయ్యే ముప్పు కూడా ఉంటుంది. దాంతో గుండె, కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అలాగే కుటుంబ నియంత్రణ పిల్స్‌ ప్రభావాన్ని కోల్పోతాయి. రక్తం పలుచబడే మందులు కూడా ప్రభావాన్ని కోల్పోతాయి.

డాక్టర్‌ రాజేష్‌ వక్కుల,

జనరల్‌ ఫిజీషియన్‌,

విఆర్‌ లైఫ్‌లైన్‌ క్లినిక్‌,

బేగంపేట్‌, హైదరాబాద్‌.


లైంగికోద్దీపన మందులు - ప్రభావాలు

ఆయుర్వేద మందులతో పాటు కొన్ని కాంబినేషన్‌ డ్రగ్స్‌ కూడా ఆన్‌లైన్లో దొరుకుతున్నాయి. ఈ మందులు లైంగిక సామర్ధ్యాన్ని పెంచుతాయంటూ ఆయా కంపెనీలు ప్రచారం కల్పించుకుంటున్నాయి. అయితే ప్రభుత్వ ఆమోదం పొందిన, ఆరోగ్య ప్రయోజనాలను అందించే సుప్రసిద్ధ కంపెనీల మందులు సురక్షితమైనవి. వీటికి భిన్నంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలను నెలకొల్పి, కొత్త కొత్త పేర్లతో మార్కెట్లోకి విడుదల చేసే మందులు కొని వాడుకోవడం ప్రమాదకరం. వీటికి ఎలాంటి సర్టిఫికేషన్‌ ఉండదు. ప్రధానంగా హెర్బల్‌ ఉత్పత్తుల్లో సీసాన్ని కలుపుతూ ఉంటారు. దీంతో మూత్రపిండాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. గతంలో ఆయుర్వేద మాత్రల రూపంలో త్రిబుల్‌ ఫైవ్‌ అనే సెక్సువల్‌ మెడిసిన్స్‌ను విపరీతంగా విక్రయించారు. ఆ తర్వాత వాటిలో వయాగ్రా కలిపినట్టు విచారణలో తేలింది. అశ్వగంధ, శిలాజిత్‌ లాంటి మందులతో ఒత్తిడి, ఆందోళన తగ్గి, నిద్ర పట్టడంతో పాటు లైంగిక సామర్థ్యం కొంత మేరకు పెరగవచ్చు. అయితే అనామక కంపెనీలు తయరుచేసే మందులు వాడుకోవడం వల్ల ఉన్న సమస్య తగ్గకపోగా, ఇతర ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. యువత లైంగిక సామర్థ్యాన్ని పెంచే మందులను ఆన్‌లైన్లో కొని వాడుకోవడం ప్రమాదకరం. వయాగ్రా లాంటి మందులు ఆన్‌లైన్‌ డెలివరీ ప్లాట్‌ఫాంలలో ఆర్డర్‌ పెట్టుకునే వెసులుబాటు ఉండడంతో, వీటి వాడకం పెరుగుతోంది. కానీ స్తంభన సమస్యలను వైద్య చికిత్సతో సరిదిద్దుకోకుండా ఇలాంటి మందుల మీదే ఆధారపడడం వల్ల దీర్ఘకాలంలో అసలు సమస్య చికిత్సతో సరిదిద్దలేనంత జటిలంగా మారిపోయే ప్రమాదం ఉంటుంది. అదే పనిగా వాడుకున్నప్పుడు, ఆ మందుల డిపెండెన్సీ పెరుగుతుంది. నేడు లైంగిక సమస్యలకు సమర్థమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి వైద్యులను కలిసి సమస్య మూల కారణాన్ని కనిపెట్టి వైద్యుల సూచన మేరకు అవసరాన్ని బట్టి టెడలాఫిల్‌ లాంటి సమర్థమైన మందులు వాడుకోవాలి. నేడు విటమిన్‌ బి12 లోపం పెరుగుతోంది. దీని వల్ల రక్తనాళాలు దెబ్బతిని అంగస్తంభన సమస్యలు తలెత్తుతాయి. బి 12 మాత్రలు, ఇంజెక్షన్లతో ఈ పోషక లోపాన్ని సరిదిద్దుకుంటే అంగస్తంభన సమస్య పరిష్కారమవుతుంది. ఇలా సమస్య వెనకున్న అసలు కారణాన్ని కనిపెట్టి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలే తప్ప ఆన్‌లైన్లో దొరికే మందులను వాడుకుంటూ ఉండిపోకూడదు.

డాక్టర్‌ రాహుల్‌ రెడ్డి, ఆండ్రాలజిస్ట్‌,

ఆండ్రోకేర్‌ ఆండ్రాలజీ ఇన్‌స్టిట్యూట్‌,

జూబ్లీహిల్స్‌, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 12:47 AM