Share News

కాలుష్యం లేని రేపటి కోసం

ABN , Publish Date - Feb 25 , 2026 | 05:42 AM

కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్న పౌరులు, మృత్యువాత పడుతున్న మూగజీవాలు... ఈ పరిస్థితి చూసి చలించిపోయారు బత్తుల నీలిమ. సాధారణ సైన్స్‌ టీచర్‌ అయిన ఆమె పర్యావరణం కోసం, మెరుగైన సమాజం కోసం...

కాలుష్యం లేని రేపటి కోసం

కాలుష్యంతో అనారోగ్యం పాలవుతున్న పౌరులు, మృత్యువాత పడుతున్న మూగజీవాలు... ఈ పరిస్థితి చూసి చలించిపోయారు బత్తుల నీలిమ. సాధారణ సైన్స్‌ టీచర్‌ అయిన ఆమె పర్యావరణం కోసం, మెరుగైన సమాజం కోసం తన వంతు ప్రయత్నం ప్రారంభించారు. ఇటీవల ‘దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్‌’లో ప్రత్యేక బహుమతి అందుకున్న ఆమె...పర్యావరణ పరిరక్షణలో బడిపిల్లలను భాగస్వాములుగా చేసి భావితరాలను ప్రకృతి సంరక్షకులుగా మార్చుతున్నారు. ఆ విశేషాలు ‘నవ్య’కోసం...

యుక్త వయసు నుంచే కాలుష్యంపై పోరాడాలనే సంకల్పం తీసుకున్నారు బత్తుల నీలిమ. బాపట్ల జిల్లా చీరాలకు చెందిన ఆమె తండ్రి కార్మిక సంఘాల నాయకుడు బత్తుల సామ్యేల్‌ దీనికి స్ఫూర్తి అని ఆమె చెబుతారు. 2002లో ప్రభుత్వ ఉపాధ్యాయినిగా ఉద్యోగ జీవితంలో అడుగుపెట్టిన ఆమెను కళ్ళ ఎదుటే కలుషితమైపోతున్న వాతావరణం కలవరపెట్టింది. ‘‘మన చుట్టూ కాలుష్యం కోరలు చాచడంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. ప్లాస్టిక్‌ కారణంగా పశువులు మృత్యువాత పడుతున్నాయి. ఇదంతా నాకు ఎంతో వేదన కలిగించింది. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ తరాల పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంటుంది. అందుకే పర్యావరణ పరికక్షణ కోసం, మెరుగైన సమాజం కోసం ఏదైనా చెయ్యాలనుకున్నా. దీనికి నా భర్త అంజిబాబు కూడా సహకారం అందించారు’’ అని చెబుతున్నారు నీలిమ. ప్రకృతి వనరులను సమర్థవంతంగా వినియోగించుకొని... సుస్థిరమైన అభివృద్ధి సాధించవచ్చనీ, వాటితో సహజసిద్ధంగా, ఆనందంగా జీవించవచ్చని అంటారామె. తాను సైన్స్‌ ఉపాధ్యాయినిగా పని చేస్తున్న బాపట్ల జిల్లా వేటపాలెం బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు ఈ పాఠాలు ఆమె బోధిస్తున్నారు. ప్రకృతి పట్ల వారికి మక్కువ పెంచుతూ... మొక్కలు నాటిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాముల్ని చేస్తున్నారు.


పూలు కురిపిస్తూ స్వాగతం

777-Navya.jpg

ఇటీవల మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు వివిధ దశల్లో సైన్స్‌ ఫెయిర్‌లు జరిగాయి. నీటిని, గాలిని కాలుష్యరహితంగా రూపుదిద్దడం, ప్రకృతి వనరులను స్థిరమైన అభివృద్ధికి దోహదం చేసేలా రూపుదిద్దడం తదితర అంశాలు ప్రధానంగా ఆమె ప్రాజెక్ట్‌ను సిద్ధం చేశారు. పలు దశల్లో విజయం సాధించిన ఆ ప్రాజెక్ట్‌... దక్షిణ భారత స్థాయిలో ప్రదర్శనకు ఎంపిక అయింది. గత నెల 23న తెలంగాణలో నిర్వహించిన ‘దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్‌’లో వివిధ రాష్ట్రాలవారితో పోటీ పడి... ప్రత్యేక అవార్డు అందుకున్నారు. అనంతరం పాఠశాలకు వచ్చిన ఆమెకు విద్యార్థులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఉన్నతాధికారులు, సహోపాఽధ్యాయులు ప్రశంసలతో ముంచెత్తారు. ‘‘భావితరాలకు మంచి వాతావరణం ఉండాలనేదే నా కోరిక. దానికోసం కృషి చేస్తాను. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం నిరోధానికి, కాలుష్య నివారణకు ఉద్యమిస్తాను’’ అంటున్నారు నీలిమ.

తాళ్లూరి ప్రదీప్‌, చీరాల

Updated Date - Feb 25 , 2026 | 05:42 AM