Share News

అనితరసాధ్యం

ABN , Publish Date - Sep 02 , 2026 | 05:46 AM

గ్రామీణ నేపథ్యం... పదో తరగతి వరకు విద్యాభ్యాసం... కానీ సాంకేతికతను అందిపుచ్చుకొని ఆమె అద్భుతం సృష్టించారు. భగీరథ ప్రయత్నంలా విఫలమైన ప్రతిసారీ మరింత...

అనితరసాధ్యం

సంకల్పం

గ్రామీణ నేపథ్యం... పదో తరగతి వరకు విద్యాభ్యాసం... కానీ సాంకేతికతను అందిపుచ్చుకొని ఆమె అద్భుతం సృష్టించారు. భగీరథ ప్రయత్నంలా విఫలమైన ప్రతిసారీ మరింత కసితో పని చేసి... మినీ రైస్‌ మిల్లును రూపొందించారు. ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌’ (ఏఐఎం) నిర్వహించిన గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో దాన్ని ప్రదర్శించి... మొదటి బహుమతి పొందారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకుని... మహిళా సాధికారతకు ఊతం ఇస్తున్న కుంభాల లక్ష్మీఅనితను ‘నవ్య’ పలుకరించింది.

‘‘పెద్ద నగరాల్లోని స్టార్ట్‌పలతో పాటు గ్రామీణులు, రైతులు, మహిళలు, గిరిజనులు, స్థానిక సమస్యలకు పరిష్కారాలు కొనుగొన్నవారిని ప్రోత్సహిస్తుంది... ‘అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌’ (ఏఐఎం). అత్యుత్తమ ఆవిష్కరణలకు జాతీయ స్థాయి గుర్తింపునిస్తుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది 16 రాష్ట్రాల నుంచి వచ్చిన 400 దరఖాస్తులను పరిశీలించి, 26 మంది గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణ నుంచి ఎంపికైన ఐదుగురిలో నేనూ ఒకరిని. జూలై 31న ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఏఐఎం నిర్వహించిన ‘గ్రామీణ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశం’లో ఈ ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఇందులో తక్కువ ఖర్చుతో నేను రూపొందించిన మినీ రైస్‌మిల్లును ప్రదర్శించాను. దానికి మొదటి స్థానం లభించింది. రాష్ట్రప్రతి ద్రౌపది ముర్ము నుంచి ప్రశంసలే కాదు, ఆమెతో దాదాపు పది నిమిషాలు మాట్లాడే అరుదైన అవకాశం లభించింది. ఆ సందర్భం... నా జీవితంలోనే అత్యంత ముధురమైన ఘట్టం.


5-navya.jpg

ఎనిమిదేళ్ల కష్టం...

నేడు నాకు లభించిన గుర్తింపు వెనుక ఎనిమిదేళ్ల అవిశ్రాంత శ్రమ ఉంది. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం యామర్రు గ్రామం మాది. పదో తరగతి వరకు చదువుకున్నాను. పెళ్లి తరువాత భర్తతో కలిసి ఐదేళ్లపాటు అద్దె ప్రాతిపదికన రైస్‌ మిల్లు తీసుకొని నడిపాను. కొన్నాళ్లకు ‘తరణి ఆద్య ఆగ్రో ప్రైవేట్‌ లిమిటెడ్‌’ నెలకొల్పాను. ప్రస్తుతం దానికి వ్యవస్థాపక డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాను. వ్యవసాయం, సంబంధిత ఉత్పత్తుల మీద ఉన్న అవగాహనతో సొంతగా మినీ రైస్‌ మిల్లింగ్‌ వ్యవస్థను రూపొందించాను. ఇందుకోసం ఎవరి సాయం తీసుకోలేదు. దీని తయారీకి, ప్రయోగాలకు మొత్తంగా రూ.20 లక్షలు ఖర్చయింది. ఒకటీ రెండూ కాదు... 79 సార్లు విఫలమయ్యాను. పలు పర్యాయాలు సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. వెల్డింగ్‌ చేస్తున్నప్పుడు నిప్పు రవ్వలు పడి ఎడమ కంటి చూపు పూర్తిగా దెబ్బతిన్నది. కానీ పట్టు వదల్లేదు. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకొంటూ, నన్ను నేను మెరుగుపరుచుకొంటూ చివరకు 80వ ప్రయత్నంలో విజయం సాధించాను.

ఇంటి పట్టునే సంపాదన...

కొందరి సూచన మేరకు నా ఆవిష్కరణ గురించి ‘ఏఐఎం’కు తెలియపరిచాను. అక్కడి నుంచి జాతీయ స్థాయి ప్రదర్శనకు ఆహ్వానం అందింది. తక్కువ పరిమాణంలో వడ్లను ప్రాసెస్‌ చేయడానికి ఈ మినీ రైస్‌ మిల్లింగ్‌ వ్యవస్థ ఉపయోగపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహిణులు, రైతులు ఇంట్లోనే కుటీర పరిశ్రమగా దీని ద్వారా వడ్ల నుంచి వరి పొట్టు తొలగించి బియ్యం తయారు చేయవచ్చు. రోజుకు 40 బస్తాల వరిని ప్రాసెసింగ్‌ చేసే సామర్ధ్యం దీనికి ఉంది. బస్తాకు రూ.50 చొప్పున 40 బస్తాలకు రూ.2 వేలు ప్రాసెసింగ్‌ ఫీజు లభిస్తుంది. ప్రాసె్‌సలో వచ్చే వరి పొట్టును విక్రయించడంవల్ల మరి కొంత ఆదాయం సమకూరుతుంది. మహిళలు ఇంట్లో ఉంటూనే నెలకు రూ.50 వేలు సంపాదించే అవకాశం ఉంది. దీన్ని సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌తోనే నడిపించవచ్చు.


4-navya.jpg

అతితక్కువ ఖర్చుతో...

వ్యాపార దృక్పథంతో నేను ఆలోచించలేదు. మహిళలకు జీవనోపాధి కూడా కల్పించాలన్న సంకల్పంతో సాధ్యమైనంత తక్కువ ఖర్చులో అందుబాటులోకి తెచ్చేలా ప్రయత్నించాను. ప్రస్తుతం మా పోర్టబుల్‌ రైస్‌మిల్లు మిషన్‌ను రూ.2.7 లక్షలకు విక్రయిస్తున్నాం. మహిళలకు అయితే

జీ ఎస్ టీ మినహాయిస్తున్నాం. దాన్ని మేమే భరిస్తున్నాం. పీఎంపీఎంఈ పథకం కింద మైక్రోఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు కేంద్రం 35 శాతం సబ్సిడీ ఇస్తుంది. దీనివల్ల మరో రూ.80 వేలు తగ్గుతుంది. అలాగే ఏడు లక్షల ఖర్చుతో పెద్ద రైస్‌ మిల్లు కూడా తయారు చేశాం. త్రీఫేజ్‌ విద్యుత్తుతో ఇది నడుస్తుంది. భవిష్యత్తులో చేతితో ఆడించే రైస్‌మిల్లును రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విద్యుత్‌ సౌకర్యం లేని ప్రాంతాల్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చు. రూ.40 వేల లోపే దీన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం.

ఎన్నో ప్రత్యేకతలు...

ప్రస్తుతం మార్కెట్‌లో చైనా తయారీ మినీ రైస్‌మిల్లు మిషన్లు లభిస్తున్నాయి. వీటి ఖరీదు రూ.7 లక్షల వరకు ఉంటుంది. వీటి మరమ్మతుకు వాడే విడిభాగాల ఖరీదు కూడా ఎక్కువ. కానీ మా మిషన్‌ నిర్వహణ ఖర్చు, విడిభాగాల ఖరీదు చాలా తక్కువ. ఇందులో ముడి బియ్యాన్ని మనకు కావల్సిన స్థాయిలో పాలిష్‌ చేసుకోవచ్చు. పాలిష్‌ ఎక్కువ పెడితే నూక, పొట్టు ఎక్కువ వచ్చి, బియ్యం పరిమాణం తగ్గుతుంది. అదే లైట్‌ పాలిష్‌ అయితే ఎక్కువ బియ్యం వస్తాయి. ఇది రైతులకు లాభదాయకం. ముఖ్యంగా సేంద్రియ రైతులు ఈ మిషన్‌ ద్వారా వినియోగదారులకు కావల్సిన రీతిలో ముడిబియ్యం పాలిష్‌ చేసి ఇవ్వవచ్చు.

మొఖమాటం మధుబాబు

ఫొటోలు: దాసరి రమణ

ఇరవై మిషన్లు...

ఇప్పటివరకు 20 మినీ రైస్‌మిల్లు మిషన్లు విక్రయించాం. మరికొన్ని ఆర్డర్లు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో ముందస్తుగా మిషన్లు తయారు చేసి పెట్టలేకపోతున్నాం. కేంద్రం రూ.8 లక్షల ఆర్థిక సాయం ప్రకటించినా, ఇంతవరకు అందలేదు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, చేయూతనిందిస్తే మరిన్ని మిషన్లు తయారు చేసి, గ్రామీణ మహిళలకు అందించే వీలుంటుంది. తద్వారా వారు శాశ్వత జీవనోపాధి పొందే అవకాశం కలుగుతుంది.

ఈ వార్తలు కూడా చదవండి

పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని

వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..

Updated Date - Sep 02 , 2026 | 05:46 AM