గమ్యం చేరేవరకు గమనమే
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:24 AM
దివ్య బన్సాల్... అమెరికా జాబ్ మార్కెట్‌లో ఏకంగా 420 సార్లు తిరస్కరణలను ఎదుర్కొంది. పట్టువదలకుండా పోరాడి న్యూయార్క్ నగరంలోనే తన కలల ఉద్యోగాన్ని...
దివ్య బన్సాల్... అమెరికా జాబ్ మార్కెట్‌లో ఏకంగా 420 సార్లు తిరస్కరణలను ఎదుర్కొంది. పట్టువదలకుండా పోరాడి న్యూయార్క్ నగరంలోనే తన కలల ఉద్యోగాన్ని దక్కించుకుంది. కెరీర్, జీవితం పట్ల ఆమెకున్న దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది.
‘‘ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 420 సార్లు నా అప్లికేషన్ తిరస్కరణకు గురైంది. ప్రతిరోజూ ఉదయాన్నే లేచి ఆశగా మెయిల్ బాక్స్ ఓపెన్ చేసిన ప్రతిసారీ.. ‘దురదృష్టవశాత్తు మీ ప్రొఫైల్ మాకు సరిపోలడం లేదు’ అనే ఆటోమేటెడ్ రిజెక్షన్ సమాధానమే ప్రత్యక్షమయ్యేది. న్యూయార్క్ యూనివర్సిటీ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినా, అమెరికాలోని కఠినమైన జాబ్ మార్కెట్ నన్ను ప్రతి అడుగులోనూ వెనక్కి నెట్టేసింది. పరాయి దేశంలో ఒంటరితనం, ముగుస్తున్న వీసా గడువు నన్ను తీవ్రమైన ఆందోళనకు గురిచేసేవి. నా స్నేహితులంతా ఉద్యోగాల్లో స్థిరపడుతుంటే, దిక్కుతోచని స్థితిలో ఏడ్చిన రాత్రులు ఎన్నో. కానీ, ఆ చీకటి రోజుల్లో కూడా నేను ఒక్క విషయాన్ని బలంగా నమ్మాను. ఓటమి నా ప్రయాణాన్ని ఆపలేదు, కేవలం నా సహనాన్ని మాత్రమే పరీక్షిస్తోందని. ఈ రోజు ఆఫీస్ మెట్లు ఎక్కుతున్నప్పుడు నా గుండెల్లో గెలుపు సంతోషం కంటే.. నా వెనుక ఉన్న 420 ఓటముల పాఠాలే ఎక్కువగా గుర్తొచ్చాయి.
తెరుచుకున్న 421వ తలుపు
భారతదేశం నుంచి ఎన్నో కలలతో అమెరికా వచ్చే ఏ విద్యార్థికైనా చదువు ముగియగానే ఉద్యోగం సంపాదించడం అనేది ఒక జీవన్మరణ సమస్య. వర్క్ పర్మిట్ పరిమితులు, వీసా స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి కంపెనీలు వెనకడాటం తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురిచేస్తాయి. నేను కూడా సరిగ్గా ఇలాంటి అగ్నిపరీక్షలోనే నిలబడ్డాను. ఎక్కడ ఏ చిన్న అవకాశం కనిపించినా వదలలేదు. 420 కంటే ఎక్కువ కంపెనీలకు నా రెజ్యూమె పంపాను. ప్రతిసారీ నిరాశే ఎదురైనా, నా తప్పులను సరిదిద్దుకుంటూ ప్రయత్నించాను. వందలాది రిజెక్షన్ల తర్వాత చివరికి నాకు వచ్చింది కేవలం మూడంటే మూడు ఇంటర్వ్యూ కాల్స్ మాత్రమే!
రెండు ఆఫర్ లెటర్లు
420 ప్రయత్నాల్లో కేవలం మూడు అవకాశాలు రావడం చిన్న విషయంగా అనిపించవచ్చు. ఆ ఇంటర్వ్యూలలో నా సర్వశక్తులూ ఒడ్డి, నా ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించాను. నా శ్రమ వృథా పోలేదు. ఆ మూడు కంపెనీలలో ఏకంగా రెండు పెద్ద కంపెనీల నుంచి నా చేతికి ఆఫర్ లెటర్లు వచ్చాయి. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నేను ఏ నగరంలోనైతే స్థిరపడాలని కలలు కన్నానో, అదే న్యూయార్క్‌లో నా కెరీర్‌ను ప్రారంభించగలిగాను. వందల సార్లు తలుపులు మూసుకుపోయినా, నా కోసం తెరుచుకున్న ఆ 421వ తలుపు నా జీవితాన్ని మార్చేసింది.
ఉద్యోగమే జీవితం కాదు
ఈ ఉద్యోగం నాకు చాలా పెద్ద విషయమే, ఎందుకంటే దీని వెనుక నా సంవత్సరాల శ్రమ దాగి ఉంది. కానీ, ఒక విషయాన్ని నేను చాలా స్పష్టంగా నమ్ముతున్నాను. ఈ ఉద్యోగమే నా పూర్తి గుర్తింపు కాకూడదు. చాలామంది యువత ఉద్యోగం రాకపోతే తమ జీవితమే శూన్యమని భావిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఉద్యోగం వచ్చినవారు సైతం రాత్రింబవళ్లు ల్యాప్‌టా్‌పల ముందే కూర్చుంటూ, ఆఫీస్ టెన్షన్లను తలకు ఎక్కించుకుంటూ, దాన్నే ఒక ప్రపంచంగా మార్చుకుంటున్నారు. ఫలితంగా వారి వ్యక్తిగత జీవితం, సంతోషం ముక్కలైపోతున్నాయి.
బానిసత్వ వలయంలోకి వద్దు
కార్పొరేట్ ప్రపంచం నిర్దేశించే ఈ బానిసత్వపు వలయంలో పడకూడదని నేను ముందే నిర్ణయించుకున్నాను. ఉద్యోగం అనేది నా జీవితాన్ని నడపడానికి, నా బిల్లులు చెల్లించడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే. నేను వృత్తిపరంగా ఎదగడానికి అది తోడ్పడుతుంది. అంతవరకే! అంతకుమించి అది నా సర్వస్వం కాబోదు. నేను నా జీవితం చుట్టూ నా ఉద్యోగాన్ని అమర్చుకుంటాను తప్ప ఉద్యోగం చుట్టూ నా జీవితాన్ని, సంతోషాలను తిప్పలేను. ఒక కంపెనీ ఇచ్చే జీతం లేదా ఒక విజిటింగ్ కార్డ్ మీద ఉండే హోదా మన ఉనికిని నిర్ణయించకూడదు.
అదే అసలైన సక్సెస్ మంత్ర
ఉద్యోగాన్ని సర్వస్వంగా భావిస్తే ఎంతటి ప్రతిభావంతులైనా కాలక్రమంలో తీవ్రమైన మానసిక అలసటకు గురవుతారు. అందుకే నేను ఉద్యోగంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నా వ్యక్తిగత సంతోషాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నాను. ఆఫీస్ సమయం ముగియగానే ల్యాప్‌టాప్ పక్కన పెట్టేసి, నాకు ఎంతో ఇష్టమైన నృత్య సాధన చేస్తాను. శారీరక దృఢత్వం కోసం రోజూ జిమ్‌కు వెళ్తాను. నా చేతులతో స్వయంగా ఆరోగ్యకరమైన వంటకాలు వండుకుని తింటాను. భారతదేశంలో ఉన్న నా కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా సమయం గడుపుతాను. నేను న్యూయార్క్ వచ్చింది రేసు గుర్రంలా పరిగెత్తడానికి కాదు.. నాకంటూ ఒక అందమైన, పరిపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించడానికి.’’
ఓటమి ముగింపు కాదు
ఓటమి ఎప్పుడూ మన ప్రయాణానికి ముగింపు పలకలేదు. అది మనల్ని మరింత బలంగా మార్చే ఒక మలుపు మాత్రమే. 420 సార్లు విఫలమైన నేను ఈ రోజు ఇక్కడ నిలబడగలిగానంటే దానికి కారణం నమ్మకమే. గెలవడానికి పట్టుదల ఎంత అవసరమో.. గెలిచాక దానిని ఆస్వాదిస్తూ జీవితాన్ని సమన్వయం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం.
Also Read:
తులసి ఆకులు నమిలితే కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయా?
ఈ డ్రై ఫ్రూట్స్‌ను మితంగా తినాలి.. ఎక్కువగా తింటే డేంజర్