కొత్త తల్లుల్లో కుంగుబాటు ఎందుకు?
ABN , Publish Date - May 19 , 2026 | 02:47 AM
బిడ్డను చూసుకుని మురిసిపోవాల్సిన సమయంలో తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితి ‘పోస్ట్‌నేటల్ డిప్రెషన్’. ఈ స్థితికి లోనయ్యే తల్లులు, లక్షణాల...
పోస్ట్ నేటల్ డిప్రెషన్
బిడ్డను చూసుకుని మురిసిపోవాల్సిన సమయంలో తీవ్రమైన మానసిక కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితి ‘పోస్ట్‌నేటల్ డిప్రెషన్’. ఈ స్థితికి లోనయ్యే తల్లులు, లక్షణాల ఆధారంగా వైద్యులను ఆశ్రయించి, కౌన్సెలింగ్ సహాయంతో, కుటుంబ సభ్యుల తోడ్పాటుతో తిరిగి మాతృత్వపు మధురిమలను ఆస్వాదించాలంటున్నారు వైద్యులు
బిడ్డ పుట్టిన తర్వాత శరీరంలో చోటుచేసుకునే హార్మోన్ల అవకతవకల వల్ల కొత్త తల్లులు కొన్ని భావోద్వేగాలకు లోనవుతూ ఉంటారు. ఈ మానసిక కుంగుబాటును వైద్య పరిభాషలో ‘పోస్ట్ నేటల్ బ్లూస్’ అని అంటారు. 30 నుంచి 40ు మంది మహిళల్లో ఈ స్థితి బిడ్డ పుట్టిన రెండు, మూడు రోజుల్లోనే మొదలై, రెండు వారాల్లో మాయమైపోవచ్చు. ఈ తరహా పోస్ట్ నేటల్ బ్లూస్‌కు భిన్నంగా ‘పోస్ట్ నేటల్ డిప్రెషన్’ అనే సమస్య కొందరు కొత్త తల్లుల్లో తలెత్తుతుంది. ఈ సమస్య బిడ్డ పుట్టిన వారం తర్వాత మొదలవుతుంది. లేదా పోస్ట్ నేటల్ బ్లూస్ తీవ్రమై, పోస్ట్ నేటల్ డిప్రెషన్‌గా కూడా మారిపోవచ్చు. ప్రతి ఐదుగురు కొత్త తల్లుల్లో ఒకరికి ఈ పరిస్థితి తలెత్తవచ్చు. అలాగే సమస్య తీవ్రతల్లో కూడా వ్యత్యాసం ఉండొచ్చు. ఈ సమస్య కొందరిని ఒకట్రెండు వారాలు వేధిస్తే, ఇంకొందర్ని మరింత తీవ్రంగా, ఎక్కువ కాలం పాటు వేధిస్తుంది. ఈ పరిస్థితి ప్రమాదకరం.
ఈ లక్షణాల మీద కన్నేసి...
తీవ్రమైన పోస్ట్ నేటల్ డిప్రెషన్‌కు లోనైన మహిళల్లో ఆత్మహత్య ఆలోచనలు తలెత్తవచ్చు. బిడ్డకు హాని తలపెట్టాలనే ఆలోచనలు కూడా వేధించవచ్చు. కాబట్టి కొత్త తల్లులకు ఈ పరిస్థితి పట్ల ముందస్తు అవగాహన కల్పించడం ఎంతో అవసరం. ఈ సమస్యలో ఇంకొన్ని లక్షణాలను కూడా ఎవరికి వారు గమనించుకోవాలి. అవేంటంటే...
బిడ్డ పుట్టక ముందు ఆనందాన్నిచ్చిన అంశాలేవీ తర్వాత ఆనందాన్ని ఇవ్వకపోవడం
తల్లినయ్యాననే ఆనందం, ఉత్సాహం క్రమేపీ తగ్గిపోవడం
విపరీతమైన కోపం, విపరీతమైన దుఃఖం
అకారణంగా ఏడ్వడం
మనసంతా బాధతో నిండిపోవడం
ఎల్లప్పుడూ విచారం వేధించడం
తెలియని భయం, ఆందోళన
మంచి తల్లిని కాననే ఆలోచన
తమను తాము నిరర్థకమైన వ్యక్తులమని భావించడం
నాకేమీ రాదు, నేనేమీ చేయలేను అనే వ్యతిరేక భావనలు కలగడం
బ్రతికి ఉండడం వ్యర్థం కాబట్టి చనిపోవడం మేలనే నిర్ణయానికి రావడం
ఈ కోవకు చెందిన వాళ్లు అప్రమత్తం
వైద్యులు, కొత్త తల్లుల్లో మానసిక కుంగుబాటు ముప్పును, గర్భిణిగా ఉన్న దశలోనే గుర్తిస్తూ ఉంటారు. అప్పటికే యాంగ్జయిటీ డిజార్డర్ ఉన్నా, మానసిక సమస్యల కుటుంబ చరిత్ర కలిగి ఉన్నా, గతంలో డిప్రెషన్‌కు లోనై ఉన్నా, సదరు మహిళలు, బిడ్డ పుట్టిన తర్వాత, పోస్ట్ నేటల్ డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పూర్వ సమస్యలేవీ లేకపోయినా, ప్రసవ సమయంలో అధిక రక్తస్రావం జరగడం లాంటి తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నా, బిడ్డ పుట్టిన తర్వాత పోస్ట్ నేటల్ డిప్రెషన్‌కు లోను కావచ్చు. అలాగే హింసతో కూడిన అనుబంధాలను కొనసాగిస్తున్న మహిళలు, చేదు అనుభవాలను పొందిన మహిళలు కూడా ప్రసవం తర్వాత డిప్రెషన్‌కు లోను కావచ్చు. కాబట్టి వైద్యులు, ఆయా కోవలకు చెందిన మహిళలను గుర్తించి, ముందస్తుగానే హెచ్చరించడం వల్ల, వాళ్లు అప్రమత్తంగా వ్యవహరిస్తూ, సమస్యతో సానుకూలంగా వ్యవహరించగలుగుతారు. అవసరాన్ని బట్టి వైద్యులను కలుస్తూ, సమస్యను సరిదిద్దుకోగలుగుతారు.
ఇలా నడుచుకోవాలి
కొన్నిసార్లు కుంగిపోయి, తిరిగి కోలుకుని బిడ్డ ఆలనాపాలనలో ఆనందాన్ని ఆస్వాదించగలిగితే ఫరవాలేదు. కానీ అదే పనిగా కుంగుబాటులోనే కూరుకుపోయి, నిద్రాహారాలు మానేసి ఏడుస్తూ ఉన్నా, బిడ్డ పోషణను పట్టించుకోకపోతున్నా, వెంటనే అప్రమత్తం కావాలి. ఇలాంటి కుంగుబాటు ప్రతి కొత్త తల్లిలో సహజమే అయినప్పటికీ, తనను వేఽధిస్తున్న సమస్య గురించి చెప్తే, అందరూ ఏమనుకుంటారోననే భయం, అనుమానం కూడా వీరిలో వేధిస్తూ ఉంటాయి. కాబట్టి కొందరు మౌనంగా బాధను భరిస్తూ ఉండిపోతారు. నిజానికి ఇది సిగ్గుపడవలసిన విషయం ఏమాత్రం కాదు. సమస్య తీవ్రతను బట్టి అవసరమైతే వైద్యులను సంప్రతించడానికి ఏమాత్రం వెనకాడకూడదు. స్వల్ప డిప్రెషన్ వేధిస్తూ ఉంటే, బిహేవియరల్ థెరపీ తీసుకుంటే సరిపోతుంది. పరిస్థితి తీవ్రంగా ఉన్నప్పుడు, మానసిక వైద్యులు సూచించే యాంటీ డిప్రెసెంట్స్ వాడుకోవాలి. ఈ మందులు వాడుతూ, బిడ్డకు నిక్షేపంగా పాలు ఇవొచ్చు. ప్రత్యేకించి కొత్త తల్లుల్లో తలెత్తే డిప్రెషన్‌కు సంబంధించి ప్రత్యేక మానసిక నిపుణులు కూడా ఉంటారు. కాబట్టి చికిత్స గురించి భయపడవలసిన అవసరం లేదు. పోస్ట్ నేటల్ డిప్రెషన్, సైకోసి్‌సగా మారి, స్వీయ హాని లేదా బిడ్డకు హాని తలపెట్టాలన్నంత తీవ్రంగా ఉన్నప్పుడు ఆస్పత్రిలో చేర్చుకుని, చికిత్స అందించాల్సి ఉంటుంది. వెయ్యి మందిలో కేవలం ఒకరిద్దరికి మాత్రమే ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది.
కుటుంబ తోడ్పాటు కీలకం
తమ మనసులో చెలరేగే భావోద్వేగాల గురించి కొత్త తల్లులు భర్తతో, కుటుంబసభ్యులతో పంచుకోవడం ఎంత ముఖ్యమో, కొత్త తల్లుల్లో తలెత్తే ఈ తరహా లక్షణాల మీద కన్నేసి ఉంచి, వారితో సన్నిహితంగా మసలుతూ, అనురాగాన్ని పంచడం భర్త, ఇతర కుటుంబ సభ్యుల బాధ్యత. మరీ ముఖ్యంగా భర్తలు బిడ్డ ఆలనాపాలనా చూసుకోవడంతో భార్యకు సహకరిస్తూ ఉండాలి. కొత్త తల్లిని అనునయిస్తూ, ఓదారుస్తూ, తోడుగా ఉంటూ, బయటకు తీసుకువెళ్తూ మనసును తేలికపరుస్తూ ఉండాలి.
డాక్టర్ వినత పులి
గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్,
క్లౌడ్ నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్,
హైదరాబాద్.
ఈ వార్తలనూ చదవండి:
యూఏఈ అణువిద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి.. ఖండించిన భారత్
త్వరపడండి.. లేకపోతే మీకేమీ మిగలదు.. ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్