మాతృత్వపు సవాళ్లను సానుకూలంగా అధిగమించి..
ABN , Publish Date - May 14 , 2026 | 01:11 AM
మాతృత్వం తర్వాత మహిళలు జీవితాన్ని చూసే ధృక్పథం మారిపోతుందంటారు. హిందీ నటి కియారా అద్వానీ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రసవం తర్వాత మానసిక, భౌతిక మార్పులకు...
సెలెబ్ టాక్
మాతృత్వం తర్వాత మహిళలు జీవితాన్ని చూసే ధృక్పథం మారిపోతుందంటారు. హిందీ నటి కియారా అద్వానీ విషయంలో కూడా ఇదే జరిగింది. ప్రసవం తర్వాత మానసిక, భౌతిక మార్పులకు లోనవడంతో పాటు పూర్తి భిన్నమైన వ్యక్తిననే భావనకు లోనయ్యానని అంటోంది కియారా! ప్రసవానంతర ఒడిదొడుకులు, సవాళ్ల గురించి ఆమె పంచుకున్న విశేషాలివి...
కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రాలకు 2025, జులైలో, సరాయా మల్హోత్రా పుట్టింది. తల్లయ్యాక మారిపోయిన తన జీవితం గురించి వివరిస్తూ... ‘మన వ్యక్తిత్వం పూర్తిగా మారిపోతుంది. తల్లిని అయిన తర్వాత, నాలో చెప్పలేనంత మార్పొచ్చింది. అంతకుముందు వరకూ నా గురించి ఎక్కువగా ఆలోచించుకునేదాన్ని. తల్లినయ్యాక, ఆ ఏకాగ్రత కూతురు వైపు మళ్లింది. చేసే ప్రతి పనీ, మనసులో మెదిలే ప్రతి ఆలోచననూ కూతురితో ముడిపెట్టడం మొదలుపెట్టాను. ఈ పని చేస్తే నా కూతురు ఎలాంటి భావనకు లోనవుతుంది? అని ఆలోచించడం మొదలుపెట్టాను. నా కూతురికి ఆదర్శవంతమైన తల్లిగా మారాలని అనుక్షణం తపించడం మొదలుపెట్టాను. తల్లిని అయిన తర్వాత, నా మీద నేను దృష్టి పెట్టే అవకాశం, సమయం దొరికాయి. 34 ఏళ్ల వయసులో హద్దులు విధించడమెలాగో తెలుసుకున్నాను. నాతో నేను విమర్శనాత్మక సంభాషణలు మానేశాను. భయం మీద దృష్టి పెట్టడం మానేశాను. ఇదంతా నేర్చుకోడానికి నాకు ఆరు నెలల సమయం పట్టింది.
ప్రసవమైన మొదట్లో భావోద్వేగాలు అదుపులో ఉండేవి కావు. నా గురించి పత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో ఏదైనా చదవగానే డిఫెన్సివ్ మోడ్‌లోకి వెళ్లిపోయేదాన్ని. కానీ అలాంటివి పట్టించుకోవడం మానేయాలనే విషయాన్ని నెమ్మదిగా గ్రహించాను. సాధారణంగా కొత్త తల్లులు, లేదా గృహిణుల గురించి సర్వత్రా కొంత చులకన భావన ఉంటుంది. మేం హాయిగా ఇంట్లో కూర్చుని విశ్రాంతిగా గడుపుతున్నామని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి మేం ఎవరూ చేయనంత పని ఇంట్లో చేస్తూ ఉంటాం. మునుపు షూటింగ్స్‌లో, సమావేశాలతో ఎంతో బిజీ బిజీగా గడిపేదాన్ని. నిజానికి నా జీవితమిప్పుడు అంతకు మించి బిజీగా మారిపోయింది. ఏడో నెల వచ్చేవరకూ టాక్సిక్ సినిమా కోసం పని చేశాను. గర్భవతిననే విషయంలో నాకూ, డైరెక్టర్, ప్రొడ్యూసర్‌కు మాత్రమే తెలుసు. షూటింగ్ విరామ సమయంలో, వానిటీ వ్యాన్‌లోకి అడుగుపెట్టగానే, ‘అమ్మ నటిస్తోంది, ఇది నిజం కాదు’ అని చెబుతూ కడుపులో పెరిగే బిడ్డకు భరోసా కల్పించేదాన్ని.
పోస్ట్‌పార్టమ్ ఛాలెంజెస్... కొత్త తల్లులను అల్లకల్లోలానికి గురి చేస్తాయి. శరీరంలో కొత్త మార్పులు చోటుచేసుకుంటాయి. భావోద్వేగ అలసట, స్వీయ అనుమానాలు వేధిస్తాయి. మరీముఖ్యంగా ఈ దశలో కొత్త తల్లిలో చోటుచేసుకునే ఈ లక్షణాలను కుటుంబసభ్యులు గుర్తించి, తగిన తోడ్పాటు అందించడం ఎంతో కీలకం. భావోద్వేగ భ్రతకు లోనయ్యేలా ఓదార్పు మాటలు చెప్పే భాగస్వామి తోడ్పాటు, ప్రేమలు ఈ సమయంలో అవసరమవుతాయి. ఆ పరిస్థితి చక్కదిద్దే సలహాలు సూచనలు ఇవ్వకుండా, కొత్త తల్లి కోణం నుంచి ఆలోచించి, తదనుగుణంగా నడుచుకునే కుటుంబసభ్యుల సహాయసహకారాలు కూడా ఈ సమయంలో అవసరమవుతాయి’ అంటూ తన మాతృత్వ అనుభవాలను మీడియాతో పంచుకుంది కియారా.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్