నాసా శాస్త్రవేత్త.. అభినయ శారద
ABN , Publish Date - Feb 23 , 2026 | 06:20 AM
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించే శాస్త్రవేత్త.. వేదికపై అభినయ ముద్రలు వేసే కళాకారిణి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ‘స్పేస్‌సూట్లు’ డిజైన్ చేస్తూనే, తిరుమల నాదనీరాజనం వేదికపై...
అంతరిక్షంలో అద్భుతాలు సృష్టించే శాస్త్రవేత్త.. వేదికపై అభినయ ముద్రలు వేసే కళాకారిణి. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ‘స్పేస్‌సూట్లు’ డిజైన్ చేస్తూనే, తిరుమల నాదనీరాజనం వేదికపై భరతనాట్యంతో పరవశింపజేసిన డాక్టర్ కావ్య కమల్ మన్యపు స్ఫూర్తిదాయక ప్రయాణం ఇది.
ప్రపంచ దేశాలను శాసించే అంతరిక్ష పరిశోధన సంస్థ నాసాలో ఆమె ఒక మేధావి. అంగారక గ్రహంపై మానవుడు అడుగుపెట్టేందుకు అవసరమైన ‘స్పేస్‌సూట్లు’ తయారుచేసే కీలక బాధ్యత ఆమెది. కానీ, ఆ ప్రయోగశాల నుంచి బయటకు రాగానే ఆమె ఒక అభినయ శారద. తన పాదముద్రలతో భరతనాట్య వైభవాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్న డాక్టర్ కావ్య కమల్ హైదరాబాద్ మట్టిలో పుట్టి, అమెరికా ఆకాశంలో మెరుస్తున్న ఆణిముత్యం.
కూతురి కల కోసం నాన్న త్యాగం
కావ్య విజయానికి పునాది ఆమె తండ్రి రాఘవరావు చేసిన అపురూపమైన త్యాగం. హైదరాబాద్‌లోని ఇండియన్ బ్యాంకులో మేనేజర్‌గా స్థిరమైన ఉద్యోగం చేస్తున్న ఆయన తన కూతురిలో అంతరిక్షం పట్ల ఉన్న అమితమైన ఆసక్తిని గమనించారు. చిన్నతనంలో చందమామను చూపిస్తూ తల్లి మంజుల చెప్పిన కథలు కావ్యలో శాస్త్రవేత్త కావాలనే బీజాన్ని నాటాయి. కూతురి కల నెరవేరాలంటే అమెరికా వెళ్లడం ఒక్కటే మార్గమని భావించిన రాఘవరావు 45 ఏళ్ల వయసులో సాఫ్ట్‌వేర్ కోర్సులు నేర్చుకుని, ఉద్యోగాన్ని వదిలి మరీ విదేశాలకు వెళ్లారు. అక్కడ అన్ని సౌకర్యాలు సమకూర్చుకుని కుటుంబాన్ని తీసుకెళ్లడం వెనుక ఓ తండ్రి పడిన శ్రమ కావ్యను నేడు నాసాలో అత్యున్నత స్థాయికి చేర్చింది.
విద్యా ప్రస్థానంలో విజయకేతనం
హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ పూర్తిచేసిన కావ్య అమెరికా వెళ్లాక విద్యారంగంలో అప్రతిహత విజయాలు సాధించారు. జార్జియా టెక్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బీఎస్, ప్రతిష్ఠాత్మక ఎంఐటీ నుంచి ఎంఎస్, అనంతరం యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా నుంచి పీహెచ్‌డీ పట్టా పొందారు. 2006లో ప్రారంభమైన ఆమె అంతరిక్ష ప్రయాణం నేడు 19 ఏళ్ల అనుభవంతో పరిణితి చెందింది. ప్రముఖ వ్యోమగామి సునీత విలియమ్స్ ప్రయాణించిన స్టార్ లైనర్ మిషన్‌కు పనిచేసిన అనుభవం ఆమెకుంది. ప్రస్తుతం నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడు, అంగారక గ్రహ యాత్రలకు వ్యోమగాములు ధరించే అత్యంత క్లిష్టమైన స్పేస్‌సూట్ల అభివృద్ధిపై ఆమె పరిశోధనలు చేస్తున్నారు. ఆమె మేధస్సుకు నిదర్శనంగా ఎనిమిది పేటెంట్లు, ముప్పైకిపైగా అంతర్జాతీయ పరిశోధన పత్రాలు ఉండటం విశేషం.
శ్రీవారి సన్నిధిలో స్వప్న సాకారం
ప్రపంచంలో ఎన్ని వేదికలపై ఆడినా తిరుమల శ్రీవారి సన్నిధిలో నాట్యం చేయాలన్నది కావ్య చిరకాల వాంఛ. ఏడేళ్ల నిరీక్షణ తర్వాత ఇటీవల నాదనీరాజనం వేదికపై ఆమె కల సాకారమైంది. తన తోటి కళాకారులు డాక్టర్ సృష్టి భూదూర్, సింధు రామచంద్రన్‌లతో కలిసి త్రిదేవ స్తుతి, బ్రహ్మకడిగిన పాదము, దశావతారం వంటి కీర్తనలకు ఆమె చేసిన నృత్యం భక్తులను ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్లింది. తన ఆరేళ్ల కుమార్తె చంద్రికతో కలిసి వేదికను పంచుకోవడం తనకు దేవుడిచ్చిన వరమని ఆమె చెప్పుకొచ్చారు. భర్త చేతన్ వేముల ప్రోత్సాహంతో అటు వృత్తిని, ఇటు కళను సమన్వయం చేసుకుంటూ కావ్య సాగిస్తున్న ప్రయాణం అద్వితీయం.
పర్వతారోహణతో సామాజిక సేవ
కావ్య వ్యక్తిత్వంలో మరో కోణం ఆమెలోని సామాజిక స్పృహ. కేవలం నాసా ప్రయోగాలు, నాట్య ప్రదర్శనలకే పరిమితం కాకుండా పర్వతారోహణ ద్వారా సామాజిక సేవకు శ్రీకారం చుట్టారు. ‘ప్రాజెక్ట్ సఖి’ పేరుతో పేద బాలికల విద్య కోసం నిధులు సేకరిస్తూ అనేక ఎత్తైన పర్వతాలను అధిరోహించారు. వృత్తి, ప్రవృత్తి, సామాజిక బాధ్యత.. ఈ మూడింటినీ ఒకేలా ప్రేమిస్తూ ముందుకు సాగుతున్న కావ్య కమల్ ప్రతి భారతీయుడు గర్వించదగ్గ అరుదైన వ్యక్తిత్వం. భౌతిక ప్రపంచంలోని రహస్యాలను ఛేదిస్తూనే, ప్రాచీన కళా వైభవాన్ని కాపాడుతున్న ఆమె ప్రస్థానం భావితరాలకు ఒక స్ఫూర్తి మంత్రం.
జగదీష్ జంగం, తిరుమల

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆర్టెమిస్’ ప్రోగ్రాంలో భాగంగా చంద్రుడు, అంగారక గ్రహ యాత్రలకు వ్యోమగాములు ధరించే అత్యంత క్లిష్టమైన స్పేస్‌సూట్ల అభివృద్ధిపై కావ్య పరిశోధనలు చేస్తున్నారు.
మువ్వల సవ్వడితో ఆధ్యాత్మిక ప్రయాణం
శాస్త్రవ్తేతగా ఎంత ఎదిగినా తనలోని కళాకారిణిని కావ్య ఎన్నడూ విస్మరించలేదు. తన నానమ్మ కమలాదేవి గొప్ప గాయని కావడంతో ఆమె వద్దే నాట్యంపై ఆసక్తిని పెంచుకున్నారు. నాలుగేళ్ల వయసులో దూరదర్శన్ నృత్య ప్రదర్శనలు చూస్తూ అభినయం నేర్చుకున్న కావ్య ఆరేళ్ల వయసు నుంచి మంజుల రామస్వామి, వీఎస్ రామమూర్తి వంటి దిగ్గజాల వద్ద శిష్యరికం చేశారు. మట్టికుండలపై, ఇత్తడి ప్లేట్లపై ఆమె చేసే నాట్య ప్రదర్శనలు చూసి తల్లిదండ్రులు మురిసిపోయేవారు. అమెరికా వెళ్లాక కూడా డాక్టర్ రత్నకుమార్ వద్ద భరతనాట్యంలో మెళుకువలు నేర్చుకుంటున్నారు. తిరుమల నాదనీరాజనం వేదికపై కూడా రత్నకుమార్ సూచనల మేరకు నృత్యప్రదర్శన ఇచ్చారు. కాగా అంతకు ముందు పొట్టిశ్రీరాములు యూనివర్సిటీలో డిప్లొమా పూర్తిచేశారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైగా ప్రదర్శనలు ఇచ్చారు. 1998లో అప్పటి రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ చేతుల మీదుగా ‘బాలశ్రీ’ అవార్డును అందుకోవడంతోపాటు రాష్ట్రపతి భవన్‌లో నాట్యం చేయడం ఆమె జీవితంలో మరపురాని ఘట్టం.