అలుపెరగని ఐరన్ ఉమన్
ABN , Publish Date - May 14 , 2026 | 01:15 AM
జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు... పడిలేచిన ప్రతిసారీ చరిత్రను సృష్టించడం. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా...
జీవితం అంటే కేవలం రోజులు గడపడం కాదు... పడిలేచిన ప్రతిసారీ చరిత్రను సృష్టించడం. అపజయాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా... అనారోగ్యం అడ్డుపడినప్పుడు ఆగిపోకుండా పోరాడటమే అసలైన గెలుపు. పంజాబ్ గడ్డపై ‘ఐరన్ మ్యాన్ ఆఫ్ పంజాబ్’ అనే బిరుదును అందుకున్న ఓ సామాన్య గృహిణి..
అసామాన్య అథ్లెట్ నీతి బన్సల్ విజయగాధ ఇది.
49 ఏళ్ల ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను నేర్చుకున్న పాఠం ఒక్కటే.. మనసుంటే మార్గం ఉంటుందని. 22 ఏళ్లకే వివాహం, ఆపై తీరికలేని కుటుంబ బాధ్యతలు.. అందరు మధ్యతరగతి మహిళల్లాగే నా ప్రపంచం కూడా నా భర్త, పిల్లల చుట్టూనే తిరిగేది. నాకంటూ ఒక ప్రపంచం ఉంటుందని, నేను కూడా ఏదో ఒకటి సాధించగలనని ఆ రోజుల్లో నేనెప్పుడూ అనుకోలేదు. కానీ 2015లో నా జీవితం ఒక ఊహించని మలుపు తిరిగింది. ఒక ప్రమాదం వల్ల నా వెన్నెముకకు తీవ్ర గాయమైంది. ఆ సమయంలో నేను అనుభవించిన శారీరక నొప్పి కంటే మానసిక వేదన చాలా ఎక్కువ. ‘నేను మళ్లీ మామూలుగా నడవగలనా? నా పనులు నేను చేసుకోగలనా? నా పిల్లలకు అండగా ఉండాల్సిన నేను వారికే భారం అవుతానా?’ అన్న ప్రశ్నలు నన్ను నిద్రకు దూరం చేశాయి.
ప్రపంచానికి పరిచయం ఇలా
వైద్యులు నాకు సైక్లింగ్‌ను ఒక వ్యాయామంగా, ఫిజియోథెరపీలో భాగంగా సూచించారు. నేను కోలుకోవడానికి మొదలుపెట్టిన చిన్న ప్రయత్నం అది. కానీ కాలక్రమేణా అదే నా శ్వాసగా, నా ప్రాణంగా మారింది. నాలోని పట్టుదల చూసి నా కుటుంబం కూడా ఆశ్చర్యపోయింది. 2016 నాటికి గాయం నుంచి నేను పూర్తిగా కోలుకోవడమే కాదు.. సైక్లింగ్ పోటీలకు కూడా సిద్ధమయ్యాను. వెన్నెముక గాయం నాకు అడ్డంకి కాలేదు. పైగా అది నన్ను మానసికంగా మరింత బలంగా మార్చింది. నన్ను పడగొట్టాలని చూసిన గాయమే.. నన్ను ప్రపంచానికి పరిచయం చేసేలా చేసింది.
అలుపెరగని పరుగు
సైక్లింగ్ నుంచి నా ప్రయాణం ట్రయథ్లాన్ దిశగా సాగింది. స్విమ్మింగ్, రన్నింగ్ కూడా నా జీవనశైలిలో భాగమయ్యాయి. నా సాధన చాలా కఠినంగా ఉండేది. ఉదయం అందరూ నిద్రలేవకముందే రోడ్లపై కిలోమీటర్ల కొద్దీ సైక్లింగ్ చేయడం, ఆ తర్వాత అలసటను లెక్కచేయకుండా గంటల తరబడి స్విమ్మింగ్‌పూల్‌లో ప్రాక్టీస్ చేయడం, చివరికి ఎండను సైతం లెక్కచేయకుండా పరుగు.. ఇలా నా దినచర్యను ఒక తపస్సులా మార్చుకున్నాను. ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు నన్ను వరించాయి. పంజాబ్ రాష్ట్రం నుంచి.. అదీ వెన్నెముక గాయాన్ని అధిగమించి ఇంతటి ఉన్నతస్థాయికి చేరిన మొదటి మహిళగా గుర్తింపు పొందడం నాకు ఎంతో గర్వకారణం. మైదానంలో నిలబడి మన త్రివర్ణ పతాకాన్ని చూసినప్పుడు కలిగే అనుభూతి వర్ణనాతీతం. కేవలం మన దేశ మహిళలనే కాదు.. విదేశీ మేటి అథ్లెట్లను కూడా ఓడించి పతకాలు సాధించినప్పుడు కలిగే తృప్తి వెలకట్టలేనిది.

అమ్మతనం బలహీనత కాదు
పిల్లలు పుట్టాక ఆడవారి కెరీర్ ముగిసిపోతుందని చాలామంది అంటుంటారు. ముఖ్యంగా క్రీడారంగంలోని మహిళలకు అమ్మతనం ఒక అడ్డంకిగా, ఒక బలహీనతగా భావిస్తారు. కానీ నా దృష్టిలో అమ్మతనం అనేది బలహీనత కాదు.. అదొక అద్భుతమైన శక్తి. ఇద్దరు పిల్లల తల్లిగా నేను గర్వంగా చెబుతున్నాను.. మైదానంలో పతకాలు సాధించడం కంటే ఇంటిని చక్కదిద్ది పిల్లలను క్రమశిక్షణతో పెంచి పెద్ద చేయడం చాలా కష్టమైన పని. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించగలిగే ఏ తల్లికైనా ఈ ప్రపంచంలో అసాధ్యమైన పని అంటూ ఏదీ లేదు. మనలో ఓర్పు, సహనం, బలం అంతా ఆ అమ్మతనంలోనే దాగి ఉంది. నా పిల్లలే నా స్ఫూర్తి ప్రదాతలు. నా భర్త, నా కుటుంబమే నా వెన్నెముక. వారు సహకారం అందించకుంటే ఈ రోజు నీతి బన్సల్ అనే పేరు ఇంతలా వినిపించి ఉండేది కాదు.
ఆరోగ్యమే మహాభాగ్యం
క్రీడల ద్వారా నేను సంపాదించిన ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను సమాజానికి పంచాలనే ఉద్దేశంతో వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నాను. మనం తీసుకునే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. అందుకే రకరకాల ఆయుర్వేద మూలికలతో తయారుచేసిన ‘హెల్దీ గమ్మీస్’ అనే ఉత్పత్తులను మార్కెట్లో తీసుకురాబోతున్నాను. లాభాల కంటే ప్రజల ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే నా లక్ష్యం. ఒక అథ్లెట్‌గా నేను ఏవైతే విలువలను నమ్ముతానో అవే నా వ్యాపారంలోనూ ప్రతిబింబిస్తాయి.
బాధపడుతూ కూర్చోవద్దు
ఏదైనా సాధించడానికి వయసుతో పనిలేదు. సరైన సమయం అంటూ ఏదీ ఉండదు. మీరు 20 ఏళ్ల వారైనా, 50 ఏళ్ల వారైనా మీ కలలను నిజం చేసుకోవడానికి ఇదే సరైన సమయం. గడిచిపోయిన కాలాన్ని తలచుకుని, పోగొట్టుకున్న అవకాశాల గురించి బాధపడుతూ కూర్చోకండి. అది మీకు కేవలం నిరాశను మాత్రమే మిగులుస్తుంది. మిగిలి ఉన్న కాలాన్ని ఎంత అద్భుతంగా, ఎంత ప్రయోజనకరంగా మార్చుకోగలరో ఆలోచించండి. ప్రతిరోజు ఒక కొత్త ప్రారంభమే. దేవుడు మనకిచ్చిన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుందాం. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. గెలుపు కచ్చితంగా మీ తలుపు తడుతుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్