ఆశయం కోసం.. ఐఏఎస్ త్యాగం
ABN , Publish Date - Sep 02 , 2026 | 05:37 AM
లండన్‌లో కార్పొరేట్ ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని.. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి సివిల్ సర్వీసె్‌సలోకి వచ్చారు దివ్య మిట్టల్. 13 ఏళ్లపాటు...
లండన్‌లో కార్పొరేట్ ఉద్యోగాన్ని, విలాసవంతమైన జీవితాన్ని వదులుకుని.. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి సివిల్ సర్వీసె్‌సలోకి వచ్చారు దివ్య మిట్టల్. 13 ఏళ్లపాటు ఐఏఎస్ గా ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన ఆమె.. తాజాగా తన పదవికి రాజీనామా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రజల నుంచి తాను నేర్చుకున్నది, పొందిన ప్రేమ అపారమని చెప్పిన దివ్య సేవా ప్రయాణం ఆమె మాటల్లోనే..
‘‘లండన్‌లో ఎగ్జోటిక్ డెరివేటివ్స్ ట్రేడర్‌గా సెటిలై.. భారీ వేతనంతో జీవితం హాయిగా గడిచిపోతున్న రోజుల్లో కూడా నా మనసంతా దేశం గురించే ఆలోచిస్తూ ఉండేది. ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్, ఐఐఎం బెంగళూరులో సాధించిన మేనేజ్‌మెంట్ డిగ్రీ.. ప్రపంచంలో నేను ఎక్కడైనా ఆత్మవిశ్వాసంతో తలెత్తుకుని నిలబడే ధైర్యాన్ని ఇచ్చాయి. కానీ ఈ విద్య, ఈ ధైర్యం నా దేశ మట్టికి నేను బాకీ పడిన రుణం అని అనుక్షణం గుర్తుచేసేవి. ఆ రుణాన్ని తీర్చుకోవడానికే లండన్ వదిలి స్వదేశానికి వచ్చాను. నా భర్త గగన్‌దీ్‌ప సింగ్ ధిల్లాన్ కూడా నా ఆశయానికి తోడుగా నిలిచారు. గగన్‌దీ్‌ప కూడా ఐఏఎస్ అధికారే. అంతర్జాతీయ ఆర్థిక రంగం, భారత వాణిజ్య మంత్రిత్వశాఖలో సేవలందించిన అనంతరం 2022లో ఉద్యోగం నుంచి వైదొలిగారు.
అకాడమీ గుర్తింపు
యూపీఎస్సీ సాధించి 2013లో ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించాను. శిక్షణలో అత్యుత్తమ పనితీరుకు గాను ‘అశోక్ బాంబావాలే’ అవార్డు అందుకున్నాను. ఆ తర్వాత అనేక జిల్లాల్లో సేవలందించే అవకాశం నాకు లభించింది. నీతి ఆయోగ్ అసిస్టెంట్ సెక్రటరీగా కూడా పనిచేశాను. పరిపాలన అంటే కేవలం సచివాలయంలో లేదా కలెక్టర్ కార్యాలయంలో కూర్చుని ఫైళ్లు సంతకాలు చేయడం మాత్రమే కాదు... ‘ప్రతి ప్రభుత్వ ఫైలు వెనుక ఒక మనిషి జీవితం ఉంటుంది, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే నిజమైన న్యాయం’ అనే సూత్రాన్ని నేను బలంగా నమ్మాను.
అసాధ్యమైన పనిని సుసాధ్యం చేస్తూ...
మీర్జాపూర్ జిల్లా మేజిస్ట్రేట్‌గా ఉన్న కాలం నా ఐఏఎస్ ప్రయాణంలో అత్యంత గుర్తుండిపోయే అధ్యాయం. అక్కడ ‘లహురియా దహ్’ అనే కొండప్రాంత గ్రామం ఉండేది. దాదాపు 1200 మంది జనాభా ఉన్న ఆ గ్రామానికి దాదాపు ఏడు దశాబ్దాలుగా తాగునీటి సదుపాయం లేదు. ఎండాకాలం వస్తే ఆ ఊరి బావులు ఎండిపోయి ప్రజలు అవస్థలు పడేవారు. ట్యాంకర్ల నీటిపైనే ఆధారపడేవారు. ‘ఆ ఊరికి పైప్‌లైన్ ద్వారా తాగునీరు తీసుకెళ్లడం అసాధ్యం’ అని చాలామంది అన్నారు. కానీ మీర్జాపూర్ నాకు నేర్పిన అతిపెద్ద పాఠం ఏమిటంటే.. ‘అసాధ్యం అనేది ఒక వాస్తవం కాదు, ఎందుకంటే అది ఒక అభిప్రాయం మాత్రమే!’
న్యాయం కోసం...
దేవోరియా జిల్లాలో పనిచేసినప్పుడు అక్కడ దశాబ్దాలుగా ఆక్రమణలో ఉన్న వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన 900కుపైగా ప్రభుత్వ స్థలాలను శాంతియుతంగా విడిపించి.. ప్రజల ఉపయోగానికి కేటాయించడం నాకు ఎనలేని తృప్తినిచ్చింది. అక్కడ పనిచేసిన రోజులు ‘సరైన దానికి మద్దతుగా నిలబడటమే మన ప్రాథమిక విధి’ అని నాకు నేర్పాయి. నా ప్రయాణంలో అనేక సవాళ్లు, ఆటంకాలు, బదిలీలు ఎదురైనా ప్రజాసేవ ఆపలేదు. ఎందుకంటే అధికారం పదవిలో లేదు, ప్రజల నమ్మకంలో ఉందని నేను వింధ్యవాసిని దేవి పాదాల చెంత నేర్చుకున్నాను.
సుదీర్ఘమైన ఈ చిరస్మరణీయప్రయాణం తర్వాత ఇప్పుడు నా జీవితంలో తదుపరి జీవితానికి శ్రీకారం చుట్టాల్సిన సమయం వచ్చిందని భావించాను. నా రాజీనామా అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదు. నా ఇద్దరు కూతుళ్ల బాధ్యతలు, నా కుటుంబం, నా వ్యక్తిగత ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న ఆలోచనాత్మక నిర్ణయం. ఐఏఎస్ అనేది నా జీవితంలో ఒక భాగం మాత్రమే తప్ప, అదే నా మొత్తం జీవితం కాదనేది నా అభిప్రాయం.
ప్రజల ప్రేమే అసలైన సంపద
నిజం చెప్పాలంటే.. ప్రజాసేవలోకి వచ్చిన కొత్తల్లో ‘నేను సమాజానికి ఏదో ఇవ్వడానికి వచ్చాను’ అని భావించిన ఒక అమాయకురాలిని. కానీ 13 ఏళ్ల అనుభవం నన్ను మార్చిం ది. నిజానికి నేను ఇచ్చింది ఏమీ లేదు. ప్రజల నుంచి పొందిన అమితమైన ప్రేమానురాగాలు, గౌరవమే ఎక్కువ. ఆ రుణభారం రోజురోజుకు పెరిగిపోయింది. ఒకప్పుడు నాకోసం నేను కన్న కలలన్నీ నెరవేరాయి. ఇప్పుడు నా ప్రజల కోసం నేను కన్న కలలను నెరవేర్చుకోవడానికి నా ఐఏఎస్ హోదాకు వీడ్కోలు పలుకుతున్నాను. రూపు మారినా నా సేవా ప్రయాణం మాత్రం ఎప్పటికీ ఆగదు.’’
చెరగని జ్ఞాపకం
అధికారుల సహకారం, సాంకేతిక పరిజ్ఞానంతో 2023 ఆగస్టులో కొండ గ్రామంలోని ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు చేరువైంది. ఆ రోజు ఊరంతా పండుగ చేసుకుంది. ఆ సమయంలో ఒక వృద్ధురాలు నాతో ఏమీ మాట ్లాడలేదు కానీ, వణుకుతున్న తన చేతులతో నా తలపై చేయివేసి మనసారా ఆశీర్వదించింది. ఈ రోజు నేను వదిలేసిన పదవి, నా హోదా తాత్కాలికమే కావొచ్చు, కానీ ఆ వృద్ధురాలి చేతి స్పర్శ, ఆ దైవిక ఆశీర్వాదం నా గుండెల్లో నిలిచిపోతాయి.
ఈ వార్తలు కూడా చదవండి
పుతిన్‌ను వెనుక నుంచి తట్టిన పాక్ ప్రధాని
వరద ప్రవాహంలో చిక్కుకున్న బైకర్.. ప్రాణాలకు తెగించి కాపాడిన మహిళలు..