కరక్కాయ... గొప్ప యాంటీ ఆక్సిడెంట్
ABN , Publish Date - Jul 11 , 2026 | 05:21 AM
శరీరంలో విష లక్షణాలు వ్యాపింపచేసే ఫ్రీ రాడికల్స్‌వల్ల జీవకణాలకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే ద్రవ్యాల్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మన ఆహారం ద్వారా శరీరంలోకి...
భోజనకుతూహలం
శరీరంలో విష లక్షణాలు వ్యాపింపచేసే ఫ్రీ రాడికల్స్‌వల్ల జీవకణాలకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ఉపయోగపడే ద్రవ్యాల్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. మన ఆహారం ద్వారా శరీరంలోకి చేరే ఇతర విష రసాయనాల ఆక్సీకరణని నిరోధించే ద్రవ్యాలు యాంటీ ఆక్సిడెంట్లు. ఈ ద్రవ్యాలలో ప్రముఖమైనవిగా మూడు కాయల్ని ఆయుర్వేదం గుర్తించి, వాటికి త్రిఫలాలని పేరు పెట్టింది. అవే... కరక్కాయ, ఉసిరికాయ, తాడికాయ. ఈ మూడూ యాంటీఆక్సిడెంట్ గుణాలు కలిగినవి. గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించటం, జీవకణాల పని తీరును మెరుగుపరచడం ద్వారా వృద్ధాప్యపు లక్షణాలను ముంచుకురాకుండా నిలువరించేందుకు ఇవి తోడ్పడతాయి. కరక్కాయ అన్నింటికన్నా గొప్ప యాంటీ ఆక్సిడెంట్.
‘అభయు, పథ్య, హరితకి... అనే పేర్లతో కరక్కాయ ప్రసిద్ధి. హరీతకి అనే పేరులోనే దోషాలను హరించి, వెలుగును పెంచేదనే అర్థం ఇమిడివుంది. అలాగే అభయ, పథ్య, పేర్లు కూడా ఇదే అర్థాన్ని సూచిస్తున్నాయి. మనది ఆరు రుచుల ఆహార సంస్కృతి. రుచుల్నిబట్టే ద్రవ్యాల గుణ ధర్మాలను నిర్ణయిస్తుంది ఆయుర్వేదం. ‘భోజన కుతూహలం’ గ్రంథం ఒక్క కరక్కాయలోనే ఉప్పు తప్ప తక్కిన రుచులన్నీ ఉన్నాయని పేర్కొంది. కరక్కాయ గింజ లోపల తియ్యగా, ఇందులోని పీచు పదార్థం పులుపుగా ఉంటుంది. బెరడు పైన తోలు వగరుగా, బెరడు కారంగా, లోపలి గింజ వగరుగా ఉంటాయి. ఇలా కరక్కాయని మెత్తగా దంచిన పొడి 5 రుచుల సమ్మేళనంగా ఉంటుంది. చిటికెడు ఉప్పు కలిపి తీసుకుంటే ఒక్క కరక్కాయే సంపూర్ణ ఆహారం అవుతుంది. ఇది తేలికగా అరుగుతుంది. తిన్న తరువాత తీపి పదార్థంతో సమానంగా శక్తినిచ్చేదిగా మారుతుంది. కొంచెం వేడినిచ్చే స్వభావం. పై పూతగా వాడినా, కడుపులోకి తీసుకున్నా చర్మ కాంతిని పెంచుతుంది. విరేచనం అయ్యేలా చేస్తుంది. విషదోషాలను హరిస్తుంది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. మేథాసంపత్తిని, ఙ్ఞాపకశక్తిని పెంచుతుంది. ఇవి తగ్గటం వృద్ధాప్య లక్షణాలు.
- కరక్కాయ పొడిని కొంచెం నీళ్లలో ఒక రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే ఆ నీళ్లతో కళ్లు కడుక్కుంటే కంటి ఎరుపు, కళ్ల కలక, కళ్లు మంటలు, దురదలు తగ్గుతాయి.
- కరక్కాయ పొడిని నేతితో తడిపి కాలిన చోట పట్టు వేస్తే మంట తగ్గి త్వరగా పుండు మానుతుంది. చెంచా కరక్కాయ పొడిని రోజూ ఏదో ఒక రూపంలో తీసుకునేవారికి మధుమేహం త్వరగా తగ్గుతుంది. స్థూలకాయానికి ఇది చెప్పుకోదగ్గ నివారణోపాయం. గర్భసంచి జారటం లాంటి సమస్యలకు పని చేస్తుంది.
- కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటే గొంతు నొప్పి, దగ్గు, గొంతులో నుస తగ్గుతాయి.
- ఊపిరితిత్తుల్లో క్షయ, కరోనా లాంటి వ్యాధులు వచ్చినవారికి కఫ దోషాన్ని తగ్గించటమే కాకుండా, వ్యాధినిరోధక శక్తిని పెంచి శరీరానికి పుష్టినిస్తుంది. తలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లబడతాయి. జుట్టు మెత్తబడుతుంది.
ఫ గంగరాజు అరుణాదేవి
టీ, కాఫీలకు ప్రత్యామ్నాయంగా
కరక్కాయ పొడిని కొద్దిగా నీళ్లలో కలిపి పుక్కిలిస్తే, నోటి లోపలి దోషాలు, దుర్వాసన పోతాయి. చిగుళ్ల నుంచి రక్తం కారటం తగ్గుతుంది. నీళ్ల విరేచనాలు ఆగుతాయి. మలం గట్టిపడి ఫ్రీగా అవుతుంది. కరక్కాయ పొడని నీళ్లలో వేసి టీలాగా కాచుకుని ఒక కప్పు చొప్పున రోజూ ఒకటి రెండుసార్లు తాగటం మంచి అలవాటు. కాఫీ, టీలను మానేయాలంటే, కరక్కాయల టీ గొప్ప ప్రత్యామ్నాయం. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. తెల్లమచ్చలు, బొల్లి, మొలల సమస్యలు తగ్గుతాయి. మలబద్ధత పోతుంది. వాపులు, ఉబ్బుల బాధ తప్పుతుంది. కడుపులో నులి పురుగులు పోతాయి.