Share News

సిల్కీ శిరోజాల కోసం...

ABN , Publish Date - Aug 27 , 2026 | 12:30 AM

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరగాలన్నా పట్టులా మెరవాలన్నా కుదుళ్లకు సరైన పోషణ అవసరం. అందుకోసం కొబ్బరినూనెతో పాటించాల్సిన ఇంటి చిట్కాలేంటో చూద్దాం...

సిల్కీ శిరోజాల కోసం...
Silky Hair

శిరోజాలు నల్లగా ఒత్తుగా పెరగాలన్నా పట్టులా మెరవాలన్నా కుదుళ్లకు సరైన పోషణ అవసరం. అందుకోసం కొబ్బరినూనెతో పాటించాల్సిన ఇంటి చిట్కాలేంటో చూద్దాం.

స్టవ్‌మీద గిన్నె పెట్టి రెండు కప్పుల కొబ్బరినూనె పోసి ఓ కప్పు ఉసిరి ముక్కలు వేసి చిన్న మంటమీద బాగా మరిగించాలి. తరువాత ఈ నూనెను చల్లార్చి గాజుసీసాలోకి వడబోసి ఉంచుకోవాలి. రాత్రి పడుకునేముందు మాడుమీద శిరోజాల కుదుళ్లకు ఈ నూనెను పట్టించి చేతి వేళ్లతో సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఉదయాన్నే గోరువెచ్చటి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు రోజులు చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఉసిరిలోని సి విటమిన్‌, యాంటీ ఆక్సిడెంట్లు మాడుమీద రక్తప్రసరణను పెంచి కుదుళ్లను బలోపేతం చేస్తాయి. శిరోజాలు నెరవకుండా కాపాడతాయి. చుండ్రును నివారిస్తాయి.

మందపాటి గిన్నెలో రెండు కప్పుల కొబ్బరినూనె పోసి రెండు కట్టల కరివేపాకు వేసి అవి నల్లగా మారేవరకు మరిగించాలి. తరువాత చల్లార్చి సీసాలోకి వడబోయాలి. ఈ నూనెను తలకు, శిరోజాలకు పట్టించి అరగంట తరువాత తలస్నానం చేస్తే ప్రయోజనం ఉంటుంది. కరివేపాకులోని బి విటమిన్‌, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలు కలిసి మాడుమీద పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌లతో పోరాడి శిరోజాలు రాలకుండా ఆరోగ్యంగా పెరిగేందుకు తోడ్పడతాయి.


చిన్న గరిటెలో అయిదు చెంచాల కొబ్బరినూనె, చెంచా మెంతులు వేసి వేడిచేయాలి. అరగంట తరువాత ఈ నూనెను తలకు పట్టించి దువ్వెనతో మెల్లగా దువ్వాలి. దీనివల్ల మెంతులలోని పోషకాలు కుదుళ్లకు చేరతాయి. మాడు మీద రక్తప్రసరణ పెరుగుతుంది. తలస్నానం చేసిన తరువాత శిరోజాలు మెత్తగా సిల్కీగా మెరవడాన్ని గమనించవచ్చు.

పావుకప్పు కొబ్బరినూనెలో రెండు చుక్కల రోజ్‌మేరీ ఆయిల్‌ను కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. శిరోజాలు పొడిబారకుండా ఉంటాయి.

Updated Date - Aug 27 , 2026 | 04:26 AM