తొలి దశలో గుర్తిస్తే మేలైన చికిత్స!
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:17 AM
భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నట్లు తెలియగానే...
బ్రెస్ట్ క్యాన్సర్
భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేస్తున్న క్యాన్సర్లలో బ్రెస్ట్ క్యాన్సర్ కూడా ఒకటి. ఈ వ్యాధి ఉన్నట్లు తెలియగానే భయపడటంసహజమే. అయితే, బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలోనే గుర్తించి, సరైన సమయంలో చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తగ్గించడంతో పాటు, చికిత్స ఫలితాలను మెరుగుపరచుకోవచ్చు. ప్రతి ఏడాది అక్టోబర్‌లో నిర్వహించే బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్, ఈ వ్యాధిపై అవగాహన పెంచుకోవడం, ఆరోగ్యంలో వచ్చే మార్పులను గమనించడం, అవసరమైనప్పుడు వైద్యులను సంప్రదించడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది.
బ్రెస్ట్ క్యాన్సర్‌కు సంబంధించిన కొన్ని హెచ్చరికలు / సంకేతాలను మహిళలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. రొమ్ములో లేదా చంకలో గడ్డలా అనిపించడం, రొమ్ము సైజు లేదా ఆకారంలో మార్పులు రావడం, చర్మం లోపలికి ముడుచుకున్నట్లు కనిపించడం, చనుమొన లోపలికి నొక్కుకున్నట్టు ఉండడం, చనుమొన నుంచి అసాధారణమైన స్రావం రావడం, ముఖ్యంగా రక్తం కలిసిన స్రావం కనిపించడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. రొమ్ములో వచ్చే ప్రతి గడ్డ క్యాన్సర్ అని భావించాల్సిన అవసరం లేదు. అయితే, కొత్తగా ఏదైనా మార్పు కనిపించినా, అది కొంతకాలంగా కొనసాగుతున్నా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.
బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచే కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. వయసు పెరగడం, కుటుంబంలో ఎవరికైనా బ్రెస్ట్ లేదా ఒవేరియన్ క్యాన్సర్ ఉండటం, ఆఖఇఅ 1, ఆఖఇఅ 2 వంటి జన్యుపరమైన మార్పులు, మెనోపాజ్ తర్వాత ఊబకాయం, కొన్ని హార్మోన్లకు సంబంధించిన అంశాలు వీటిలో ముఖ్యమైనవి. అయితే, ఎలాంటి
రిస్క్ ఫ్యాక్టర్లు లేని మహిళలకు కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని గుర్తుంచుకోవాలి.
వ్యాధిని ముందుగానే గుర్తించడంలో స్ర్కీనింగ్ పరీక్షలు కీలక పాత్ర పోషిస్తాయి. మహిళలు తమ వయసు, వ్యక్తిగత ఆరోగ్య చరిత్ర, కుటుంబ చరిత్రను బట్టి ఎప్పుడు మామోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలో డాక్టర్‌తో చర్చించాలి. ముఖ్యంగా 40 సంవత్సరాల వయసు దాటిన మహిళలు మామోగ్రఫీ సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాలి. రొమ్ముల్లో సాధారణంగా ఎలాంటి మార్పులు ఉంటాయో తెలుసుకోవడం వల్ల కొత్త మార్పులను త్వరగా గుర్తించవచ్చు. అయితే, స్వయంగా పరీక్షించుకోవడం తెలుసుకుంటే, మార్పులను త్వరగా
గుర్తించగలరు. కానీ స్వీయ పరీక్ష మాత్రమే సరిపోదు. తేడాగా అనిపిస్తే డాక్టర్ సూచించిన స్ర్కీనింగ్ పరీక్షలు, వైద్యుల పరిశీలన కూడా అవసరం.
మారుతున్న వైద్య విధానాలు, అధునాతన టెక్నాలజీ వల్ల, ప్రస్తుతం బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో అనేక అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ రకం, దశను బట్టి సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ, హార్మోన్ థెరపీ, టార్గెటెడ్ థెరపీ లేదా ఇమ్యినో థెరపీ వంటి చికిత్సలను అందిస్తారు. తొలిదశలో వ్యాధిని గుర్తించి, తగిన చికిత్స తీసుకుంటే చాలామంది మహిళల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.
డాక్టర్ ఆర్ దినేష్ రెడ్డి
కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్
మరియు రోబోటిక్ సర్జన్
మణిపాల్ హాస్పిటల్స్
అపాయింట్‌మెంట్ కొరకు: 08654 669966