Share News

మధుమేహానికి మరో కొత్త మందు!

ABN , Publish Date - Aug 11 , 2026 | 12:42 AM

మధుమేహుల కోసం తాజాగా ‘అవిక్లి’ అనే ఒక కొత్త తరం మందు అందుబాటులోకొచ్చింది. వారానికోసారి తీసుకునే ఈ ఇంజెక్షన్‌తో రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవకుండా నిరంతరం...

మధుమేహానికి మరో కొత్త మందు!

డయాబెటిస్‌

మధుమేహుల కోసం తాజాగా ‘అవిక్లి’ అనే ఒక కొత్త తరం మందు అందుబాటులోకొచ్చింది. వారానికోసారి తీసుకునే ఈ ఇంజెక్షన్‌తో రక్తంలో చక్కెర స్థాయులు హెచ్చుతగ్గులకు లోనవకుండా నిరంతరం స్థిరంగా ఉంటాయని భరోసా ఇస్తున్నారు వైద్యులు. మరిన్ని వివరాలు...

అవిక్లి అనే పేరుతో వారానికోసారి ఇంజెక్షన్‌ ద్వారా తీసుకునే వీలున్న కొత్త తరం మధుమేహం మందు... ఇన్సులిన్‌ ఐకొడెక్‌. ఈ అత్యాధునికమైన ఔషధం దీర్ఘకాలం పాటు ఇన్సులిన్‌లా పని చేస్తుంది. దీన్ని బేసల్‌ లేదా బ్యాక్‌గ్రౌండ్‌ ఇన్సులిన్‌ కూడా అంటారు. ఈ మందు, భోజనానికీ భోజనానికీ మధ్య, రాత్రి వేళల్లో, ఉదయం వేళ శరీరంలో చక్కెర స్థాయులను స్థిరంగా ఉంచుతుంది. ఇది భోజన సమయంలో తీసుకునే ఇన్సులిన్‌ లాంటిది కాదు. వెనువెంటనే చక్కెర స్థాయిని నియంత్రిండానికీ, నిర్దిష్ట భోజనంతో పెరిగే చక్కెరను తగ్గించడానికీ, అకస్మాత్తుగా పెరిగే చక్కెరను అదుపు చేయడానికి ఉద్దేశించిన మందు కాదు. వారమంతా చురుగ్గా పనిచేస్తూ, క్రమక్రమంగా మందును ఒంట్లో విడుదల చేస్తూ స్థిరమైన ఇన్సులిన్‌ ఫ్రభావాన్ని కనబరిచే మందు ఇది. ఈ తాజా ఇంజెక్షన్లతో, బేసల్‌ ఇన్సులిన్‌ అవసరమయ్యే, అర్హులైన మధుమేహ పెద్దలు, ఏడాది పొడవునా 365 ఇంజెక్షన్లు తీసుకోడానికి బదులుగా 52 ఇంజెక్షన్లకే పరిమితం కావచ్చు. మన దేశంలో టైప్‌1, టైప్‌2 మధుమేహులు ఈ ఇంజెక్షన్లు తీసుకోవచ్చు.

ఎలా పని చేస్తుంది?

చర్మం అడుగున ఇచ్చే ఇన్సులిన్‌ ఐకొడెక్‌ రక్తంలోని ఆల్బ్యుమిన్‌ అనే సహజ ప్రొటీన్‌కు అతుక్కుపోయి, రిజర్వాయర్‌లా పని చేస్తూ, ఒకసారికి స్వల్ప పరిమాణంలోని ఇన్సులిన్‌ మాత్రమే విడుదల చేస్తూ ఉంటుంది. దాంతో ఇంజెక్షన్‌ తీసుకున్న వెంటనే తీవ్ర ప్రభావం కనబరచడానికి బదులుగా వారం పొడవునా సజావుగా, స్థిరంగా ఇన్సులిన్‌ అందుతూ ఉంటుంది. ఆరోగ్యకరమైన క్లోమం అందించే తక్కువ మోతాదు ఇన్సులిన్‌ మాదిరిగా శరీరానికి అవసరమైన బ్యాక్‌గ్రౌండ్‌ ఇన్సులిన్‌ అవసరాన్ని అవిక్లి తీరుస్తుంది. అలాగే కాలేయం తనలో నిల్వ చేసుకున్న గ్లూకోజ్‌ విడుదలను తగ్గిస్తుంది.


దుష్ప్రభావాలున్నాయి

ఇన్సులిన్‌ మాదిరిగానే అవిక్లితో ఉండే ప్రధాన దుష్ప్రభావం హైపోగ్లైసీమియా. రక్తంలో చక్కెర మోతాదులు పడిపోయే ఈ స్థితిలో చెమటలు పట్టడం, వణుకు, ఆకలి, గుండెదడ, తలనొప్పి, కంటిచూపు మసకబారడం, అయోమయం లేదా అసాధారణ ప్రవర్తనలు కనిపిస్తాయి. సాధారణంగా ప్రతి రోజూ తీసుకునే ఇన్సులిన్‌తో అదనపు మోతా దు ప్రభావాలు మరుసటి రోజుకు సర్దుకుంటాయి. అయితే అవిక్లి భిన్నమైనది. ఇన్సులిన్‌ ఐకొడెక్‌ వారం పాటు చురుగ్గా పని చేసేలా రూపొందింది. కాబట్టి మందు మోతాదు ఎక్కువవడం వల్ల, సరిపడా ఆహారం తీసుకోకపోవడం వల్ల, లేదా మరొక మందును సర్దుబాటు చేయకపోవడం వల్ల హైపోగ్లైసీమియా తలెత్తినా, తర్వాత కొన్ని గంటలు లేదా రోజుల్లో... తగ్గిన చక్కెర స్థాయి సమం కావచ్చు. అలాగని హైపోగ్లైసీమియా స్థితి కొనసాగుతుందని అర్థం కాదు. ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, జాగ్రత్తగా గమనించుకోవాలి. స్పృలో ఉన్న వ్యక్తి చక్కెర 70 మిల్లీగ్రాములు/డెసిలీటర్‌ కంటే తక్కువకు పడిపోయినప్పుడు 15 నుంచి 20 గ్రాముల త్వరితంగా పనిచేసే పిండిపదార్థాలు తీసుకోవాలి. 4 టీస్పూన్ల చక్కెర, గ్లూకోజ్‌ మాత్రలను నీళ్లలో కలిపి తాగొచ్చు లేదా అరగ్లాసు పండ్ల రసం తాగొచ్చు. 15 నిమిషాల తర్వాత మళ్లీ గ్లూకోజ్‌ను పరీక్షించి, చక్కెర 70 మిల్లీగ్రాములు/డెసిలీటర్‌ కంటే తక్కువకే పడిపోయి ఉంటే, మళ్లీ చక్కెర నీళ్లు లేదా పండ్ల రసం తాగాలి. అవిక్లి వారం పాటు చురుగ్గా పని చేస్తుంది కాబట్టి పొరపాటున తీసుకున్న ఎక్కువ డోస్‌ను మరుసటి రోజే ఆపేయడం సాధ్యపడదు. గ్లూకోజ్‌ పర్యవేక్షణ, నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి. అవిక్లిని వైద్యులు సూచించిన వీక్లీ షెడ్యూల్‌ ప్రకారమే తీసుకోవాలి. అకస్మాత్తుగా పెరిగిన అత్యధిక గ్లూకోజ్‌ లేదా డయాబెటిక్‌ కీటోఅసిడోసిస్‌ చికిత్సలకు ఉద్దేశించింది కాదు. దీన్ని ఇంకొక ఇన్సులిన్‌తో కలిపి తీసుకోకూడదు.

లాభాలున్నాయి

అవిక్లి ప్రధాన ప్రయోజనం సౌలభ్యం. ప్రతిరోజూ తీసుకోవాల్సిన బ్యాక్‌గ్రౌండ్‌ ఇంజెక్షన్‌ అవసరం తప్పుతుంది. రోజువారీ ఇంజెక్షన్లతో విసిగిపోయిన వాళ్లకు, తరచూ డోస్‌ మర్చిపోయే వాళ్లకు, తరచూ ప్రయాణాలు చేసేవాళ్లు లేదా బిజీ దినచర్య కలిగిన వాళ్లకు అవిక్లి అనువైనది. కొందరు మధుమేహుల్లో వారానికోసారి తీసుకునే ఇన్సులిన్‌ ఐకొడెక్‌తో హెచ్‌బి 1సి స్థాయి ప్రభావం తగ్గుతున్నట్టు, బేసల్‌ ఇంజెక్షన్‌తో సమానంగా, అంతకంటే మెరుగ్గా పని చేస్తున్నట్టు అధ్యయనాల్లో రుజువైంది. అవిక్లి, నెమ్మదిగా, స్థిరంగా పని చేసే విధానం వల్ల ఫాస్టింగ్‌తో, రాత్రికి రాత్రే చోటుచేసుకునే గ్లూకోజ్‌ హెచ్చుతగ్గులను తగ్గించగలుగుతుంది.


ఎవరికి?... ఎంత కాలం?

వారానికోసారి బ్యాక్‌గ్రౌండ్‌ ఇన్సులిన్‌ తీసుకోడానికి తగిన వ్యక్తులుగా వైద్యులు నిర్థారించిన టైప్‌1, టైప్‌2 మధుమేహులు అవిక్లి తీసుకోవచ్చు. టైప్‌1 మధుమేహులు వారానికో అవిక్లితో పాటు, భోజనానికి ముందు ర్యాపిడ్‌ యాక్టింగ్‌ ఇన్సులిన్‌ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. పిల్లలకు, కౌమారదశలో ఉన్న వారు అవిక్లికి అర్హులు కారు. మోతాదు, కాలపరిమితి, అర్హతలను వైద్యులు నిర్థారిస్తారు. రక్తంలో గ్లూకోజ్‌ ప్యాటర్న్స్‌, హైపోగ్లైసీమియా ముప్పు, ఇతర మందుల ఆధారంగా క్రమం తప్పకుండా చక్కెరలను పరిశీలించిన తర్వాతే వైద్యులు అవిక్లి అర్హతను అంచనా వేస్తారు. బేసల్‌ ఇంజెక్షన్‌ అవసరముందని వైద్యులు నిర్థారించినంత కాలం ఈ ఇంజెక్షన్‌ను వాడుకోవచ్చు.

డాక్టర్‌ శ్రీ నగేష్‌

కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌ అండ్‌

డయాబెటాలజిస్ట్‌,

శ్రీ నగేష్‌ డయాబెటిస్‌ అండ్‌ ఎండోక్రైన్‌ క్లినిక్‌, టోలిచౌకి, హైదరాబాద్‌.

ఇవి కూడా చదవండి..

తమిళ్ తాయ్ వాళ్తుతోనే ప్రారంభం.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం..

సీటు బెల్ట్ పెట్టుకోని చిన్నారి.. సర్వీస్‌ను రద్దు చేసిన విమానయాన సంస్థ..

Updated Date - Aug 11 , 2026 | 12:42 AM