శూన్యం నుంచి శిఖరానికి
ABN , Publish Date - Mar 08 , 2026 | 02:19 AM
జీవితం అంటేనే ఒక పోరాటం. కానీ కొందరికి ఆ పోరాటం ఊపిరి ఆగిపోయేంత కష్టంగా మారుతుంది. కేవలం మూడు సెకన్ల కాలం ఆమె కలలను ఛిన్నాభిన్నం చేసింది. లారీ చక్రాల కింద రెండు కాళ్లు నలిగిపోయినా...
జీవితం అంటేనే ఒక పోరాటం. కానీ కొందరికి ఆ పోరాటం ఊపిరి ఆగిపోయేంత కష్టంగా మారుతుంది. కేవలం మూడు సెకన్ల కాలం ఆమె కలలను ఛిన్నాభిన్నం చేసింది. లారీ చక్రాల కింద రెండు కాళ్లు నలిగిపోయినా.. విధిని ఎదిరించి యోగాసనాలతో ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్నారు అర్పితారాయ్. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎఫ్‌టీసీసీఐ లో నిర్వహించిన ‘షీ రైజ్-గివ్ టు గెయిన్’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సదస్సులో తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని పంచుకున్నారు.
‘‘కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలోని బారక్‌పూర్ మాది. షాపింగ్ కోసం స్నేహితులతో కలిసి బైక్‌పై కోల్‌కతా వెళ్తుంటే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఏమైందో తెలిసే సరికి ఆసుపత్రిలో ఉన్నాను. త్వరగా శస్త్రచికిత్స చేస్తే కాళ్లు వచ్చే అవకాశాలున్నాయన్నారు. కానీ అందుకు బాగా డబ్బు ఖర్చవుతుందన్నారు. మా అన్నయ్య రెక్కల కష్టం మీదనే బతికే మాకు ఆ డబ్బు సమకూర్చడానికి చాలా రోజులే పట్టింది. రెండు కాళ్లకూ ఇన్ఫెక్షన్ సోకడంతో తీసేశారు. ఇది చాలదన్నట్లు గ్యాంగ్రిన్ కూడా రావడంతో దాదాపు నాలుగు నెలలు హాస్పిటల్‌లోనే ఉండాల్సి వచ్చింది.
నా పరిస్థితి తెలుసు కాబట్టే...
మన శరీరంలో ఓ భాగాన్ని కోల్పోయిన తరువాత కొత్త జీవితం ప్రారంభించాలంటే ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాలి. రెండుకాళ్లు కోల్పోయిన తరువాత అవకాశాలూ పరిమితంగానే ఉంటాయని నాకు తెలుసు. కానీ, ఆ అవకాశాలను వినియోగించుకుంటూ, జీవితాన్ని సరిదిద్దుకోవాల్సింది నేనేననీ తెలుసు. ప్రోస్థటిక్ లెగ్స్‌తో హాస్పిటల్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఆ కొత్త జీవితాన్ని నేను పూర్తిగా అంగీకరించాను.
ముందు వైకల్యం చూస్తారు
వైకల్యం ఓ బాధ అయితే, మన చుట్టూ ఉండే వారు చూపే జాలి, వారు అనే మాటలు ఎదుర్కొని నిలబడటం అతి పెద్ద సవాలు. జాలి చూపుల వెనుక ఉన్న భావాన్ని అర్థం చేసుకున్న తరువాత భరించలేకపోయాను. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చాను. జనం ఏమనుకుంటారనేది పట్టించుకోవడం మానేశాను. ప్రశాంతత, బరువు తగ్గడం కోసం యోగా వైపు చూశాను.
యోగా కష్టమే కానీ... అసాధ్యం కాదు
2015లో యోగా నేర్చుకోవడానికి ముందు ఓ బీపీవో సెంటర్‌లో ఉద్యోగం చేశాను. అప్పట్లో వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు విభిన్న రీతుల వ్యాయామాలు చేశాను కానీ, సాధ్యమయ్యేది కాదు. ఆ తరువాత యోగా తరగతుల్లో చేరాను. మొదట్లో ఇబ్బంది అయ్యేది. దీంతో నా శరీరాకృతికి తగినట్లుగా కొన్ని భంగిమలను నేనే వేయడం ప్రారంభించాను. ఆ తరువాత విభిన్న ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం లాంటివి నా సొంతంగానే నేర్చుకున్నాను. నా వరకూ నేను హ్యాపీగా ఫీలైన తరువాత యోగాలో ఏదో శక్తి ఉందని గుర్తించాను. 2019లో యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా మారాను. కొవిడ్ రాక మునుపు 25 మంది వరకూ నా వద్ద ఆసనాలు నేర్చుకోవడానికి వచ్చేవారు. వీరిలో దివ్యాంగులతో పాటుగా సాధారణ వ్యక్తులూ ఉన్నారు.
సామాజిక మాధ్యమంలో ఒక పోస్ట్
కొవిడ్ సమయంలోనే ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ ఒక్కసారిగా గుర్తింపు తీసుకువచ్చింది. ఆ పోస్ట్‌కు వచ్చిన స్పందన తరువాత వరుసగా పోస్ట్ చేయడం మొదలుపెట్టాను. ధైర్యంగా పోటీల్లోనూ పాల్గొంటున్నాను. యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా, మోటివేషనల్ స్పీకర్‌గా, యోగా ట్రైనర్‌గా.. ఇలా విభిన్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను.
ప్రతికూలతను సైతం అవకాశంగా మలుచుకోవాలి
మనం సాధించిన విజయాలే మన గురించి చెబుతాయని నమ్ముతాను నేను. నాకు కాళ్లు లేవు కానీ, సాధించడానికి ఎలాంటి పరిమితులు కూడా లేవని నమ్ముతాను. నాకే ఎందుకు ఇలా అయింది అని ఎప్పుడూ అనుకోవద్దు. తరువాత ఏమిటని, ముందుకు దూసుకుపోవడమే. జీవితమంటే ధైర్యంగా అడుగు ముందుకు వేయడమే!
వైకల్యం... అవరోధం కాదు
వైకల్యం అసమర్థతకు ప్రతీక కాదు. మీ మనసు బలంగా ఉంటే, మీ శరీరం కూడా అనుసరిస్తుంది. ఓ మోటివేషనల్ స్పీకర్‌గా నేను నేటి తరం అమ్మాయిలకు చెప్పేది ఒకటే.. మీ కలలను అనుసరించండి.. అవే విజయానికి దారి చూపుతాయి!
అదే లక్ష్యం
హైదరాబాద్‌కు చాలా ఏళ్ల క్రితమే వచ్చేశాను. ప్రస్తుతం హఫీజ్‌పేటలో ఉంటున్నాను. నేనేమీ విభిన్నం కాదు. మీలా ఒకరినే కాకపోతే కాళ్లు లేవంతే ! ఒక్కోసారి ఇది కాస్త కష్టంగా అనిపిస్తుంది కానీ ముందుకు వెళ్లిపోతుంటాను. యోగా శిక్షణ, మోటివేషనల్ స్పీకింగ్‌కే జీవితం అంకితం చేయాలనుకుంటున్నాను. పాఠశాలలు, కాలేజీలకు వెళ్లి ఆడపిల్లలను ప్రోత్సహించాలని అనుకుంటున్నాను’’.
పులగం గిరి

నువ్వు మహిళవని ఎప్పుడూ బలహీనంగా భావించకు. నీలోని పోరాట పటిమను ప్రపంచానికి చూపించు.
-మేరీ కోమ్