తాటి.. కొబ్బరి చెట్లను ఏఐతో గుర్తించాం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:57 AM
ఒక తుఫాను వస్తుంది.. కొన్ని వేల ఎకరాలను కబళిస్తుంది. ప్రాణనష్టం.. ఆస్తినష్టం జరుగుతాయి. మన దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనిని...
ఒక తుఫాను వస్తుంది.. కొన్ని వేల ఎకరాలను కబళిస్తుంది. ప్రాణనష్టం.. ఆస్తినష్టం జరుగుతాయి. మన దగ్గర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా ఇలా ఎందుకు జరుగుతోంది? దీనిని నివారించి రైతులకు స్వాంతన చేకూర్చటానికి ప్రారంభించినదే వాస్సర్ ల్యాబ్స్. ఇటీవల ప్రధాని మోదీని కలిసిన స్టార్టప్ కంపెనీల ప్రతినిధుల్లో ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ నిఖిలేష్ కుమార్ కూడా ఉన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఏపీ, కేరళం రాష్ట్రాల్లో రైతులకు సాయం చేస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి ‘నవ్య’తో ఆయన పంచుకున్నారు.
ఏఐ వంటి అత్యాధునిక సాంకేతికతను వ్యవసాయ రంగంలో ఎలా ఉపయోగించుకోగలం?
ఒక దశాబ్దం క్రితం వ్యవసాయానికి సంబంధించిన నాణ్యమైన సమాచారం ఎక్కువగా లభించేది కాదు. సీజన్ల వారీ సర్వేలు.. క్షేత్రస్థాయిలో సందర్శనల ద్వారా ప్రభుత్వం సమాచారాన్ని సేకరించేది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన తర్వాత సమాచారాన్ని సులభంగా సేకరించవచ్చు. ఉదాహరణకు మేము ఆంధ్రప్రదేశ్‌లో 3.77 కోట్ల కొబ్బరి, తాటి చెట్ల సమాచారాన్ని ఏఐ ద్వారా సేకరించాం. ఈ సమాచారాన్ని విశ్లేషిస్తే మనకు అనేక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇదేవిధంగా మేము రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మొబైల్స్ నుంచి పంట తెగుళ్లను తెలుసుకోవచ్చు. ఉపగ్రహాలు మనకు ఎప్పటికప్పుడు వాతావరణంలోని మార్పులను, పంటల తీరును తెలియజేస్తుంటాయి. వీటిని విశ్లేషించి.. ఇతర సమాచారాన్ని అనుసంధానిస్తే రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. ఉదాహరణకు ఎల్‌నిలో ప్రభావం వ్యవసాయంపై ఎలా ఉంటుందనేది మనం ముందుగానే చెప్పగలుగుతున్నాం.
ఇంత సాంకేతికత ఉన్నా రైతులు ఎక్కువ ప్రయోజనాన్ని ఎందుకు పొందలేకపోతున్నారు?
సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావటం ఒక ఎత్తు. దానిని క్షేత్ర స్థాయిలో వాడగలగటం మరో ఎత్తు. ఏఐ, శాటిలైట్ ఇమేజనరీ, కంప్యూటింగ్, డేటా ఎనలటిక్స్ ద్వారా మనకు సమాచారం ముందే తెలుస్తుంది. కానీ దానిని ఎలా వాడుకుంటున్నామనేదే పెద్ద సవాలు. మన దేశంలో వ్యవసాయ రంగం చాలా వైవిధ్యమైనది. నేల, వాతావరణం ఏ రెండు ప్రాంతాల్లో ఒక విధంగా ఉండవు. ఒక చోట సూచించిన పరిష్కారం మరొక చోట పనికిరాకపోవచ్చు. అంతే కాకుండా రైతులకు అవగాహన ఉండటం కూడా చాలా ముఖ్యం. వీటన్నింటితో పాటుగా- రైతులకు అవసరమైన సేవలన్నింటినీ ఒకే ప్లాట్‌ఫాంపైకి తీసుకురాగలగాలి. అప్పుడే రైతులు ఎక్కువ ప్రయోజనం పొందగలుగుతారు.
రైతులకు ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా పనికొస్తుంది?
రైతులకు కావాల్సిన సమాచారాన్ని అందించటం ఒక పద్ధతి. దీనిలో వాతావరణంలో రానున్న మార్పులు, తుఫాను హెచ్చరికలు, ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేస్తున్నారనే సమాచారం ఉంటుంది. దీనితో పాటుగా జనరేటివ్ ఏఐ టూల్స్ ద్వారా రైతులతో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకొనే పద్ధతికి మంచి ఆదరణ లభిస్తోంది. మేము తయారుచేసిన యాప్‌లో రైతులు తమ సందేహాలను తీర్చుకోవచ్చు. ఉదాహరణకు- ప్రస్తుతం విపరీతమైన వానలు పడుతున్నాయి. మేము ఇప్పటి దాకా పొలానికి యూరియా వేయలేదు. యూరియాను ఎప్పుడు వేయాలి? ఆలస్యంగా యూరియా వేస్తే ఇబ్బంది అవుతుందా?’ అని ఎవరైనా అడిగారనుకుందాం. అప్పుడు మా యాప్ ఆ ప్రశ్నలకు సరైన సమాధానం ఇస్తుంది. అంటే వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాల్సిన అవసరం లేకుండా రైతుకు సమాచారం తెలుస్తుంది. దీని వల్ల అతను ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. ఇక నాట్ల సమయంలోను.. కోత సమయంలోను యంత్రాల అవసరం ఉంటుంది. వీటికి సంబంధించిన సమాచారమంతా మా యాప్‌లో లభ్యమవుతుంది. అంటే ఒక రైతుకు ఒక కోత యంత్రం కావాలనుకుందాం. కోత యంత్రాలను సరఫరా చేసే సరఫరాదారులు యాప్‌లో రిజిస్ట్రర్ చేసుకుంటారు. వారిని రైతులు నేరుగా సంప్రదిస్తారు. ఈ యాప్ రైతు సాధికారతను పెంచుతుంది.
సీవీఎల్‌ఎన్ ప్రసాద్
మేము రూపొందించిన ‘ఏఐ అగ్రోనమిస్ట్’ ద్వారా... రైతులు తమ సొంత భాషల్లో సులువైన వాయిస్ లేదా టెక్ట్స్ సంభాషణల ద్వారా తమకు అవసరమైన సమాచారాన్ని సులభంగా తెలుసుకోవచ్చు. మేము రూపొందించిన మరొక టూల్ ‘ఏపీఎయిమ్స్ 2.0’. దీనిలోని ఎరువుల పంపిణి మాడ్యూల్ ప్రభుత్వాలకు ఎంతో ఉపకరిస్తుంది. అర్హులైన రైతులకు మాత్రమే ఎరువుల పంపిణి జరుగుతుంది. అయితే నా ఉద్దేశంలో రైతుల అనుభవం- ఇన్ని రకాల సాంకేతికతల కన్నా గొప్పది. రైతుకు సరైన సమాచారాన్ని అందించినప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతాడు.
మన జీవితంలోని కొన్ని ప్రధానమైన సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పరిష్కారాలు కనుగొనాలనే ఉద్దేశంతో వాసర్ ల్యాబ్స్‌ను ప్రారంభించాం. మేము సేకరించే డేటా.. ఏఐ ద్వారా దాని విశ్లేషణ వల్ల- నీరు, ఆహారం, భూమి, పర్యావరణం మొదలైన విషయాలలో ప్రజలు, విధానకర్తలు మేలైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రస్తుతం వీటికి సంబంధించిన సమాచారం వేర్వేరుగా లభ్యమవుతోంది. ఈ సమాచారాన్ని ఒక చోటకు చేర్చగలగటం చాలా ముఖ్యమైన విషయం. మేము రూపొందించిన ‘ఫీల్డ్ వైజ్’ అనే సాంకేతిక పరిజ్ఞానం ఏఐ, జనరేటివ్ ఏఐ, రిమోట్ సెన్సింగ్, వెదర్ ఇంటిలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ ద్వారా పొలాలను, రైతులను సమన్వయపరుస్తుంది. రైతుకు తమ పొలంలో ఏ జరుగుతోందో శాస్త్రీయంగా తెలుస్తుంది.
ఇవి కూడా చదవండి:
శుభ్‌మన్ గిల్ గాయంపై స్పందించిన టీమిండియా
నేను చేయాల్సిన పని మిగిలే ఉంది.. రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు