Share News

దేవుడు మెచ్చే గుణం

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:24 AM

క్షమ... అన్ని గుణాల్లో అత్యుత్తమమైనదని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఇతరులను క్షమించేవారిని, కోపాన్ని అదుపులో పెట్టుకొనేవారిని తాను ప్రేమిస్తానని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌...

దేవుడు మెచ్చే గుణం

సందేశం

క్షమ... అన్ని గుణాల్లో అత్యుత్తమమైనదని ఇస్లాం ధర్మం చెబుతోంది. ఇతరులను క్షమించేవారిని, కోపాన్ని అదుపులో పెట్టుకొనేవారిని తాను ప్రేమిస్తానని దివ్య ఖుర్‌ఆన్‌లో అల్లాహ్‌ స్పష్టం చేశాడు. ‘‘క్షమించు. మంచిని ఆదేశించు. అజ్ఞానులను పట్టించుకోకు’’ అని బోధించాడు. ‘‘మీరు క్షమించి, తప్పులను మన్నించినట్టయితే... అపార కరుణామయుడైన అల్లాహ్‌ తప్పకుండా క్షమిస్తాడు’’ అని ఖుర్‌ఆన్‌ పేర్కొంది. అల్లాహ్‌ క్షమను కోరుకొనే మనం ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. అప్పుడే ఆయన మనపైన దయ చూపుతాడు.

దైవప్రవక్త మహమ్మద్‌ జీవితం క్షమకు ప్రతీక. తనను అవమానించినవారిని, హింసించినవారిని ఆయన ఆదరించారు. ఆయన మక్కాలో విజయం సాధించారు. ఎన్నో ఏళ్ళపాటు ఆయనను బాధించిన ఖురైష్‌ ప్రజలు భయంగా ఆయన ఎదుట నిలబడ్డారు. అప్పుడు దైవప్రవక్త ‘‘ఈ రోజు మీ పైన ఎలాంటి నిందా లేదు. వెళ్ళండి. మీరు స్వేచ్ఛాజీవులు’’ అని ప్రకటించారు. ‘‘దయ చూపేవారిపై పరమ కరుణామయుడైన అల్లాహ్‌ దయ చూపుతాడు. కుస్తీలో గెలిచేవాడు కాదు... కోపం వచ్చినప్పుడు తనను తాను అదుపులో ఉంచుకొనేవాడే నిజమైన బలవంతుడు’’ అని వివిధ సందర్భాల్లో ఆయన చెప్పారు. దైవప్రవక్త వెళ్ళే దారిలో రోజూ ఒక వ్యక్తి చెత్త వేస్తూ ఉండేవాడు. ఒక రోజు ఆయనకు చెత్త కనిపించలేదు. వెంటనే దైవప్రవక్త ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి, అతని ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. ఆ మహోన్నత క్షమాగుణాన్ని చూసి చలించిన ఆ వ్యక్తి దైవ ప్రవక్త మార్గాన్ని స్వీకరించినట్టు ఒక కథ ఉంది. ద్వేషాన్ని ప్రేమతో జయించాలనే సందేశాన్ని ఈ సంఘటన మనకు తెలియజేస్తోంది.


అపకారం చేసినవారి పై ద్వేషం పెంచుకోకుండా, ప్రతీకారం తీర్చుకోకుండా... అల్లాహ్‌ కోసం వారిని మన్నించడమే క్షమాగుణం. ఇది బలహీనత కాదు, నిజమైన ధైర్యం. కోపాన్ని జయించి, క్షమించడం వల్ల హృదయం ప్రశాంతమవుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. క్షమ మనిషిని గొప్పవాడిని చేసే దైవిక గుణం. కోపం వచ్చినప్పుడు ప్రతీకారం తీర్చుకోవడం సాధారణం. కానీ క్షమించగలిగిన హృదయం విశాలమవుతుంది. ప్రేమ, దయ, కరుణ, క్షమ అనే నాలుగు స్తంభాల మీద ఇస్లాం ధర్మం నిలిచి ఉంది. విశ్వాసులు ఎల్లప్పుడూ క్షమించే స్వభావాన్ని అలవరచుకోవాలని దివ్య ఖుర్‌ఆన్‌, హదీసులు బోధిస్తున్నాయి. అల్లా్‌హను ‘అల్‌ గఫూర్‌’ (అత్యంత క్షమించేవాడు), ‘అర్‌ రహీమ్‌’ (అత్యంత కరుణామయుడు) అని అవి వర్ణించాయి. కాబట్టి విశ్వాసులందరూ క్షమాగుణాన్ని అలవరచుకోవాలి. దానివల్ల అల్లాహ్‌ ప్రేమ లభిస్తుంది. హృదయానికి ప్రశాంతత కలుగుతుంది. కుటుంబాలలో, సమాజంలో ఐక్యత పెరుగుతుంది. శత్రుత్వం స్నేహంగా మారుతుంది. సమాజంలో శాంతి నెలకొంటుంది. నేడు చిన్న చిన్న విషయాలకు కోపాలు, గొడవలు, కుటుంబాల్లో విభేదాలు పెరుగుతున్నాయి. క్షమించే మనసు ఉంటే అనేక సమస్యలు అక్కడికక్కడే సమసిపోతాయి. క్షమాగుణం... విశ్వాసి ధరించే అత్యంత విలువైన ఆభరణం. ప్రతీకారం కన్నా క్షమ గొప్పది. ద్వేషం కన్నా ప్రేమ గొప్పది. కోపం కన్నా సహనం గొప్పది. ఖుర్‌ఆన్‌ బోధించిన క్షమను అలవరచుకొని, దైవ ప్రవక్త మార్గాన్ని అనుసరిస్తే కుటుంబాలు, సమాజం, దేశం... శాంతితో, ప్రేమతో నిండిపోతాయి. కాబట్టి క్షమించే హృదయాన్ని, కోపాన్ని జయించే శక్తిని, ప్రేమతో జీవించే జ్ఞానాన్ని ప్రసాదించాలని అల్లా్‌హను ప్రార్థించాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఇవి కూడా చదవండి

టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు

కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది

Updated Date - Jul 03 , 2026 | 05:24 AM