ఇది అరుదైన అవకాశం
ABN , Publish Date - Mar 30 , 2026 | 03:37 AM
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఇన్‌చార్జి వైస్-చాన్సలర్‌గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి మహిళ డాక్టర్ అనురాఽధ జొన్నలగడ్డ. ఆమె కూచిపూడి....
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఇన్‌చార్జి వైస్-చాన్సలర్‌గా బాధ్యతలు తీసుకున్న మొట్టమొదటి మహిళ డాక్టర్ అనురాఽధ జొన్నలగడ్డ. ఆమె కూచిపూడి నృత్యకారిణి, చరిత్ర పరిశోధకురాలు, మూడు దశాబ్దాలుగా బోధనారంగంలో రాణిస్తున్నారు. తాను చదువుకున్న విద్యాలయానికే వీసీగా వ్యవహరిస్తున్న అనురాధను ‘నవ్య’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలివి.
‘‘హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లో నేను చదువుకున్నాను. ఇక్కడే ప్రొఫెసర్‌గా ముఫ్ఫై ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను. ఇప్పుడు ఇదే వర్సిటీకి ఇన్‌చార్జి వైస్-చాన్సలర్‌గా పనిచేసే అవకాశం రావడం నాకు లభించిన అరుదైన అవకాశం. అది నా అదృష్టం కూడా. ఇక్కడ బోధన, బోధనేతర సిబ్బంది నన్ను ఏన్నో ఏళ్లుగా చూస్తున్నారు. వారంతా నాకూ పరిచయమే. కనుక సమష్టి సహకారంతో ఈ సరికొత్త బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించగలనని నమ్ముతున్నాను. ‘లలిత కళలకు, పరిపాలనా వ్యవహారాలకు పొంతన ఉండదు’ అని కొందరి అభిప్రాయం. ‘నత్యకారులు, అందులోనూ ఓ మహిళ.. విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవహారాలు చూడగలరా?’ అని తేలిగ్గా మాట్లాడేవారు ఉండచ్చు. కానీ పరిపాలనా వ్యవహారాలు నాకు కొత్తేమీ కాదు. సరోజినీ నాయుడు స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్‌కు డీన్‌గా పనిచేశాను. నృత్య శాఖకు మూడుసార్లు అధ్యక్షురాలిగా సేవలు అందించాను. నిర్ణయాధికార స్థానంలో కొలువుదీరడమంటే అజమాయిషీ చలాయిస్తూ... అరుపులతో, హడావుడితో నానాయాగీ చేయడం కాదు. అలాంటివాటికి నేను పూర్తి విరుద్ధం. ఈ హోదాలో ఉన్నవారికి సున్నితత్వం కూడా చాలా ముఖ్యం. స్వతహాగా నృత్యకారులు సున్నిత మనస్కులు. వారు చాలా ఏళ్లు నృత్య సాధన చేయాలి. అందుకు ఎంతో ఓపిక కావాలి. గురువులు చెప్పినది అర్థం చేసుకోవాలి. చాలా సందర్భాల్లో చూసి నేర్చుకోవడమే ఎక్కువ. కాబట్టి ఏకాగ్రత ముఖ్యం. నృత్యప్రదర్శనలకు సృజనాత్మకత అవసరం. సోలో ప్రదర్శన అయినా సంగీత వాద్యకారులు, ఇతర బృంద సభ్యులతో సమన్వయం చేసుకోగల నేర్పు ఉండాలి. అందరినీ కలుపుకొనిపోవాలి. నిరంతర సాధన ద్వారా ఇన్ని నాయకత్వ లక్షణాలను సముపార్జించుకొనే కళాకారులు... పరిపాలనా రంగంలో అడుగుపెడితే తప్పనిసరిగా సత్ఫలితాలే వస్తాయనడంలో సందేహం లేదు.
పెద్దల స్ఫూర్తితో...
నేను హెచ్‌సీయూ పర్ఫెర్మింగ్ ఆర్ట్స్ మొదటి బ్యాచ్ స్టూడెంట్‌ను. అంతకుముందు కోఠి మహిళా కళాశాలలో బీఏ పొలిటికల్ సైన్స్, హిస్టరీ, ఇంగ్లీష్... కోర్సు చదివాను. ఎం.ఏ.లో హిస్టరీ చదివి, నృత్యం మీద పరిశోధన చేయాలనుకున్నాను. అప్పుడే హెచ్‌సీయూలో నృత్య శాఖ ప్రారంభించారని తెలియడంతో అందులో చేరాను. ఇక్కడే పీహెచ్‌డీ పూర్తి చేసిన తర్వాత 1996 నుంచి మొదట రీడర్‌గా తర్వాత ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. భద్రిరాజు కష్ణమూర్తిగారు, పల్లె రామారావు గారు, కోటా హరినారాయణ గారి లాంటి హేమాహేమీలు ఇక్కడ వైస్-చాన్సలర్లుగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ హోదాలో అలాంటి పెద్దవారున్నప్పుడు వీసీ రూమ్ వైపు వెళ్లడానికే కాస్త వెనుకంజ వేసేవాళ్లం. అది వారిపట్ల మాకున్న గౌరవం. నా గురువుల స్ఫూర్తితో ఇప్పుడు ఆ బాధ్యతల్లోకి వచ్చిన నేను గొప్ప సంస్కరణలు తీసుకురాలేకపోయినా, కొనసాగుతున్న వ్యవస్థను డిస్ట్రబ్ చేయకుండా సజావుగా నడపగలితే చాలని అనుకుంటున్నా. అలాగని రాజీపడే ప్రశ్నే లేదు. వర్సిటీ ప్రతిష్ఠను నిలిపేందుకు శాయశక్తులా పనిచేస్తాం.
నాన్న ప్రోత్సాహంతో...
మా నాన్నగారు జొన్నలగడ్డ లక్ష్మీనారాయణ బ్యాంకు ఉద్యోగి కావడంతో హైదరాబాద్‌లో పుట్టి, పెరిగినా కొన్నాళ్లు గుంటూరులో ఉన్నాం. మంచి నృత్యప్రదర్శన ఉందంటే చాలు నాన్న నన్నూ వెంట తీసుకువెళ్లేవారు. అలా నాకు ఎనిమిదేళ్ల వయసులో వెంపటి చినసత్యం మాస్టారు శివునిగా, శోభానాయుడు మోహినిగా, మంజుభార్గవి విష్ణుమూర్తిగా గుంటూరులో ’క్షీరసాగర మథనం‘ నృత్యరూపకం చూశాను. అది ఎప్పటికీ మరచిపోలేను. అప్పుడే నిర్ణయించుకున్నాను ‘మనం ఏదైనా ఒక పనిచేయాలంటే ఆషామాషీగా ఉండకూడదు’ అని. ప్రఖ్యాత నర్తకీమణి పద్మ సుబ్రహ్మణ్యం గారు 70వ ఏట పీహెచ్‌డీ పూర్తిచేసి, డాక్టరేట్ అందుకున్న వార్త అప్పట్లో ‘ఇలస్ట్రేటెడ్ వీక్లీ’లో ప్రచురితమైంది. మా నాన్నగారు ఆ న్యూస్ క్లిప్ జాగ్రత్తగా కత్తిరించి ఒక స్ర్కాప్ బుక్‌లో అతికించి మరీ నాకు ఇచ్చారు. ‘ప్రదర్శనలో మనం ఉత్తమ ప్రతిభ కనబరచవచ్చు లేకపోవచ్చు. కానీ అకడమిక్స్‌లో గట్టిపునాది ఉండాలని చెప్పేవారు. ఆయన ప్రోత్సాహంతో.... నృత్యరంగంలోనే అకడమిక్స్‌లోకి వచ్చాను. ‘కూచిపూడి నృత్య సంప్రదాయాలు, ఆవిష్కరణలు’ అనే అంశంమీద నటరాజ రామకృష్ణ గారి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పరిశోధన చేశాను. దానికిగాను బంగారు పతకం అందుకున్నాను. కూచిపూడి ప్రదర్శనలతో పాటు శాస్త్రీయ నృత్య చరిత్ర రచన వైపు కొంతమేరకు పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉంది.

కూచిపూడి చరిత్ర రచనలో...
2017 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నేను రాసిన ‘కూచిపూడి నృత్యం, చరిత్ర, అభివృద్ధి’ పుస్తకాన్ని తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించింది. వేదాంతం రాఘవయ్య జీవిత విశేషాలను వెలుగులోకి తెస్తూ ఒక పుస్తకం తీసుకొచ్చాం. కూచిపూడి గురువులు-సంప్రదాయాలమీద మరొక పుస్తకం... ‘హు ఈజ్ హు‘ రాశాను. ఇప్పటివరకు 12మంది విద్యార్థులు నా పర్యవేక్షణలో పరిశోధన పూర్తిచేసి, డాక్టరేట్ అందుకున్నారు. మరొక తొమ్మిది మంది ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నారు. ఒకవైపు బోధనారంగంలో, మరొక వైపు పరిశోధనా రంగంలో పనిచేస్తూనే నృత్య రూపకాలు రూపొందిస్తున్నాను. ‘ఆదిశక్తి సృష్టి, స్థతి, లయలను ఎలా చేశారు?’ అనే ఇతివృత్తానికి సూర్య సిద్ధాంతం ఆధారంగానూ, ‘దేవీ భాగవతం’లోని ‘దేవీ సప్తశతి’ ఆధారంగానూ రూపకం తయారుచేశాం. అదే ’మహాకాళి‘ నృత్యరూపకం. ఆ ప్రదర్శన మాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ‘నమోస్తు నారీ’ అని మరొక బృంద నాట్యప్రదర్శనకూ మంచి పేరు వచ్చింది. ‘ఛాయ, ప్రబుద్ధ మణిమేఖలై, ఆంధ్ర కళావైభవం, రసవిలాసం’ లాంటి ఇతర నృత్యరూపకాలు కూడా సంతృప్తినిచ్చాయి. వెంపటి చినసత్యం మాస్టారు, నటరాజు రామకృష్ణగారు లాంటి గురువుల బోధనలే అకడమిక్‌గా మమ్మల్ని ఒక మెట్టుపైన నిలిపాయి.
కొత్తతరం విద్యార్థులు
కాలంతో పాటు విద్యార్థుల్లోనూ మార్పు సహజం. నిజానికి మాకన్నా ఈతరం పిల్లలు చాలా తెలివిగలవాళ్లు. కాకపోతే ఏకాగ్రత కాస్త తక్కువ అనే చెప్పాలి. ఫోన్ పట్టుకుంటే రెండు లేదా మూడు గంటలు గడిచినా తెలియదు. కానీ బోలెడంత సమాచారం వారి ముందు ఉంది. ఒక లక్ష్యం నిర్దేశించుకొని, నిరంతర సాధనతో ముందుకు వెళ్లగలిగితే అద్భుతంగా రాణిస్తారు. వారిలో ప్రశ్నించే స్వభావం కూడా ఎక్కువే. ఇప్పుడు అబ్బాయిలు కూడా ఎక్కువమంది కూచిపూడి వైపు వస్తున్నారు. యువతరం మీద ఒత్తిళ్లు కూడా ఎక్కువే ఉన్నాయి. కాబటట్టి వాళ్లకు ఎదురయ్యే సవాళ్లు లెక్క లేనన్ని. ఇవన్నీ మనం అర్థంచేసుకోవాలి. నా గురువులు వెంపటి చినసత్యంగారు, శోభానాయుడు గారు... అదిలించి లేదా కోప్పడి మా పొరపాట్లు ఎత్తిచూపేవారు. మరోవైపు వాత్సల్యం చూపేవారు. ఇప్పుడు గురుశిష్య అనుబంధంలోనూ మార్పులు వచ్చాయి. వాటికి అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిందే. నన్ను విద్యావేత్తగా తీర్చిదిద్దిన నా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రుణం తీర్చుకొనే సదావకాశం నాకు వచ్చింది. దాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను. విద్యాసంస్థ ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు ప్రయత్నిస్తాను. వర్సిటీ అభివద్ధికి నా వంతు ప్రయత్నం చేస్తాను.’’
సాంత్వన్
కుటుంబ సహకారం..
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక మహిళ ఉంటే సరిపోతుందేమో! అదే ప్రతి మహిళ విజయం వెనుక ఏకంగా ఒక కుటుంబమే నిలబడాలి. అప్పుడే ఆమె వృత్తి బాధ్యతల్లో రాణించగలదు. ఆ విధంగా నేను ఎంతో అదష్టవంతురాలిని. నా భర్త తడకమళ్ల అరవింద్ ప్రోత్సాహంం లేకపోతే కూచిపూడి కళాకారిణిగా, ఆచార్యురాలిగా, విభాగాధిపతిగా, ఇప్పుడు వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా... ఇన్ని బాధ్యతలు నిర్వర్తించడం కష్టమయ్యేది. మాకు ఇద్దరు పిల్లలు. బాబు, పాప. వారి ఆలనాపాలనా మా అత్తగారే చూసుకుంటారు.. వర్సిటీ పనులతో సతమతమవుతున్న సమయంలో ‘’నీవు చేయాలనుకున్నది చెయ్యి. మిగతా పనులు మాకు వదిలేసెయ్’ అని ధైర్యం చెప్పడమేకాదు, నాలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపారు.
ఇవీ చదవండి:
పీఎస్ఎల్2026: పాకిస్థాన్‌కు మరో ఘోర అవమానం!
గంభీర్ పేరుతో ఉన్న ఏఐ వీడియోలు 36 గంటల్లో తొలగించాలి: ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు