Share News

వారికే అనుగ్రహం

ABN , Publish Date - Apr 03 , 2026 | 02:52 AM

పూర్వం ఒక సంపన్నుడు ఉండేవాడు. తన ఇష్టదేవత తన ముందు ప్రత్యక్షం కావాలనేది అతని కోరిక. దానికోసం ఎందరో సాధువులను, సన్యాసులను కలిశాడు. వారి దగ్గర ఉపాసన పద్ధతులు నేర్చుకున్నాడు...

వారికే అనుగ్రహం

సద్బోధ

పూర్వం ఒక సంపన్నుడు ఉండేవాడు. తన ఇష్టదేవత తన ముందు ప్రత్యక్షం కావాలనేది అతని కోరిక. దానికోసం ఎందరో సాధువులను, సన్యాసులను కలిశాడు. వారి దగ్గర ఉపాసన పద్ధతులు నేర్చుకున్నాడు. మంత్రాలు నేర్చుకున్నాడు. అలాంటి సమయంలో ఒక సాధువు అతనికి మంత్రోపదేశం చేసి, దాన్ని పది లక్షలసార్లు జపిస్తే ఫలితం ఉంటుందన్నాడు. దాంతో ఆ మంత్రాన్ని పది లక్షలసార్లు జపం చేశాడు. ఆ దేవత ప్రత్యక్షం కాలేదు. మరింత పట్టుదలగా మరో ముప్ఫై లక్షల సార్లు జపించాడు. ప్రయోజనం కనిపించలేదు.

చివరకు అతను మంత్రాల మీద, తంత్రాల మీద నమ్మకం కోల్పోయాడు. తనకు ఉన్న సర్వస్వాన్నీ త్యజించాడు. సన్యాసాన్ని స్వీకరించాడు. విలాసవంతమైన తన భవనాన్ని విడిచిపెట్టి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం ప్రారంభించాడు.

ఇంతలో అతని ముందు అతని ఇష్టదేవత ప్రత్యక్షమయింది. ‘‘ఇప్పుడెందుకు వచ్చావు? వెళ్ళిపో. నువ్వు కావాలనుకున్నప్పుడు రాలేదు. ఇప్పుడు నాకు ఆ కోరిక పోయింది. నేనిప్పుడు సన్యాసిని. అప్పట్లో నీనుంచి మరిన్ని విలాసాలను, ఐశ్వర్యాన్ని, ప్రాపంచిక భోగాలను కోరుకున్నాను. ఇప్పుడు నాకు వాటితో పని లేదు. వెళ్ళిపో’’ అన్నాడు.

అప్పుడు ఆ దేవత... ‘‘నేను నీకు సాక్షాత్కరించకుండా నువ్వే అడ్డుగా ఉన్నావు. ఎన్నో సంపదలు ఉన్నప్పటికీ ఇంకా కావాలనే ఆశతో... నిన్ను నువ్వే బిచ్చగాడిగా మార్చుకున్నావు. కోరికలను తిరస్కరించినవాడిలోనే దైవత్వం ఏర్పడుతుంది. జ్ఞాన మార్గంలో ఎదుగుదల సాధ్యపడుతుంది. అటువంటివారికే దేవతలు సాక్షాత్కరిస్తారు’’ అని చెప్పి మాయమయింది.

‘‘ఎంత ఉన్నా ఇంకా కావాలనుకొని... ఆధ్యాత్మిక ఉన్నతికి బదులు లౌకికమైనవి మాత్రమే కోరుకొనేవారికి దైవానుగ్రహం సిద్ధించదు. కోరికలకు అతీతంగా జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆధ్యాత్మిక సంకల్పాలు నెరవేరుతాయి’’ అంటూ స్వామి రామా ఈ కథ చెప్పారు.

ఇవి కూడా చదవండి...

ప్రమాదవశాత్తు సంపులో పడి 8 నెలల పసికందు మృతి

రెచ్చిపోయిన గంజాయి బ్యాచ్.. యువకుడిపై కత్తులతో దాడి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 03 , 2026 | 02:52 AM