Share News

తప్పించుకోలేని సత్యం

ABN , Publish Date - Jul 17 , 2026 | 03:22 AM

ప్రపంచంలో మనిషి తప్పించుకోలేని ఒకే ఒక సత్యం... మరణం. తమ పుట్టిన రోజు అందరికీ తెలుసు. కానీ మరణించే రోజు, సమయం, స్థలం మాత్రం అల్లా్‌హకు తప్ప మరెవరికీ తెలీదు. అదే మరణం తాలూకు...

తప్పించుకోలేని సత్యం

సందేశం

ప్రపంచంలో మనిషి తప్పించుకోలేని ఒకే ఒక సత్యం... మరణం. తమ పుట్టిన రోజు అందరికీ తెలుసు. కానీ మరణించే రోజు, సమయం, స్థలం మాత్రం అల్లా్‌హకు తప్ప మరెవరికీ తెలీదు. అదే మరణం తాలూకు గొప్ప రహస్యం. ‘‘జీవితం ఎంత తాత్కాలికమో పరలోకం అంత శాశ్వతం’’ అని దివ్య గ్రంథాలు చెబుతున్నాయి. ఈ లోకం మనకు శాశ్వత నివాసం కాదు... మజిలీ మాత్రమే. ఒక ప్రయాణికుడు మార్గమధ్యంలో విశ్రాంతి తీసుకున్నట్టు మనిషి కూడా ఈ ప్రపంచంలో కొద్దికాలం మాత్రమే ఉంటాడు. తరువాత తన అసలు గమ్యమైన పరలోకానికి వెళ్తాడు. అయితే ఈ ప్రయాణానికి కావలసింది సరంజామా, ధనం, ఆస్తులు, బంధువులు, స్నేహితులు, ఇరుగుపొరుగువారు, అధికారాలు, పెద్ద పెద్ద హోదాలు కాదు. అల్లా్‌హను సంతోషపరిచే ఇమాన్‌ (దైవంపై విశ్వాసం), సత్కార్యాలు, నమాజ్‌, దానం, మంచి నడవడిక, దైవభీతి... వీటి ఫలాలు మాత్రమే మన వెంట వస్తాయి.

‘‘ప్రతి ప్రాణి మరణాన్ని తప్పక రుచి చూడవలసిందే, ఆ తరువాత మీరందరూ మావైపే మళ్ళుతారు. మృత్యువు మీరు ఎక్కడున్నా వచ్చి తీరుతుంది... ఎంతటి దృఢమైన భవనాల్లో ఉన్నా సరే’’ అని ‘దివ్య ఖుర్‌ఆన్‌’లో అల్లాహ్‌ పేర్కొన్నాడు. మరణానికి రాజు, పేద, విద్యావంతుడు, నిరక్షరాస్యుడు, చిన్నవాడు, పెద్దవాడు అనే తేడాలు లేవు. అల్లాహ్‌ నిర్ణయించిన సమయానికి వచ్చి... అది తన విధిని పూర్తి చేస్తుంది. అందుకే జ్ఞానులు మరణానికి భయపడలేదు... దానికి సిద్ధమయ్యారు. కాబట్టి సుఖాలను చెదరగొట్టే మరణాన్ని తరచుగా స్మరించాలని దైవప్రవక్త మహమ్మద్‌ ఉపదేశించారు.

ఆ మాటల్లో గొప్ప జీవిత రహస్యం దాగి ఉంది. మరణాన్ని గుర్తుంచుకొనే వ్యక్తి అహంకారాన్ని విడిచిపెడతాడు. ఇతరుల హక్కులను హరించడు. తల్లిదండ్రులను గౌరవిస్తాడు. అనాథలను ఆదరిస్తాడు. పేదలకు సాయం చేస్తాడు. తన నాలుకను అబద్ధం, దూషణ, అపవాదుల నుంచి కాపాడుకుంటాడు. ఎందుకంటే తాను చేసే ప్రతి పని ఏదో ఒక రోజు అల్లాహ్‌ ఎదుట లెక్కగా నిలుస్తుందని అతనికి తెలుసు.


మనిషి సంపదల కోసం, సౌఖ్యాలకోసం, పేరు ప్రతిష్ఠల కోసం, హోదాలకోసం జీవితమంతా పోరాడుతాడు. కానీ పరలోక జీవితం కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాడనేది కూడా ఆలోచించాలి. ఖుర్‌ఆన్‌ మనల్ని ఆత్మపరిశీలన కోసం స్వాగతిస్తుంది. ‘‘మరణం అనేది ముగింపు కాదు... ఒక కొత్త జీవితానికి ఆరంభం’’ అని ఇస్లాం చెబుతోంది. ఏదో ఒక రోజు మనం ఈ లోకాన్ని విడిచి నిష్క్రమిస్తాం. మిగిలినవన్నీ అలాగే ఉంటాయి. మనతోపాటు వచ్చేవి... మన విశ్వాసం, మనం చేసిన నమాజ్‌, దానాలు, మంచి పనులు.

అందుకే జీవితాన్ని రోజూ పరిశీలించుకోవాలి. ఈ రోజు చివరి రోజైతే నేను అల్లా్‌హను కలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నానా? నా నమాజులు సక్రమంగా ఉన్నాయా? నా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా? నా పొరుగువారు నా వల్ల ఇబ్బంది పడుతున్నారా? నా మిత్రులు నా వల్ల బాధపడుతున్నారా? నేను ఎవరికైనా అన్యాయం చేశానా? నా సంపాదన సక్రమమైనదేనా? నా హృదయం అల్లాహ్‌ జ్ఞాపకంతో నిండి ఉందా?... ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానాలు చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజే హృదయాలను అల్లాహ్‌ వైపు మళ్ళిద్దాం.. ఈ రోజే పశ్చాత్తాపం చెందుదాం. ఈ రోజే నమాజ్‌ను స్థిరపరుచుకుందాం. ఎందుకంటే రేపు అవకాశం దొరుకుతుందనే హామీ ఎవరికీ లేదు.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 03:22 AM