సంతృప్తి... ఒక నిశ్శబ్ద శక్తి
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:26 AM
సంతృప్తి చెందడాన్ని ‘రాజీపడడం’ అని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి సంతృప్తి అంటే జీవితాన్ని లేదా ఆశయాన్ని వదులుకోవడం కాదు. నిజమైన పరిపూర్ణత...
యోగా
సంతృప్తి చెందడాన్ని ‘రాజీపడడం’ అని కొందరు తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ వాస్తవానికి సంతృప్తి అంటే జీవితాన్ని లేదా ఆశయాన్ని వదులుకోవడం కాదు. నిజమైన పరిపూర్ణత ఏ విషయం ద్వారా కలుగుతుందో... ఆ విషయం మీద లోతైన అవగాహనను పొందడం. అనేక అనారోగ్యాలు మూసుకుపోయిన ధమనుల వల్ల మాత్రమే కాకుండా... అశాంతికి లోనైన మనసుల వల్ల కూడా తీవ్రమవుతాయని ఒక హృద్రోగ నిపుణుడిగా నేను గమనించాను. దీర్ఘకాలికమైన అసంతృప్తి... ఒత్తిడి హార్మోన్లను పెంచుతుంది, రక్తపోటును పెంచుతుంది, నిద్రకు భంగం కలిగిస్తుంది, గుండె జబ్బులకు కారణం అవుతుంది. దీనికి విరుద్ధంగా... సంతృప్తితో ఉన్న మనసు భావోద్వేగ సమతుల్యతకు, ఆరోగ్యకరమైన సంంబంధాలకు, మెరుగైన హృదయ సంబంధిత ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.
సంతృప్తి మనల్ని ఉత్తమమైన వాటికోసం ప్రయత్నించకుండా నిరోధించదు. దానికి బదులు... ఇతరులతో మనల్ని పోల్చుకోవడం వల్ల కలిగే ఆందోళన నుంచి, అంతులేని తపన నుంచి విముక్తి కలిగిస్తుంది. శాశ్వతమైన సంతృప్తి లేకుండా... తదుపరి విజయం కోసం చేసే అంతులేని అన్వేషణను ‘హెడోనిక్ ట్రెడ్‌మిల్’ అని ఆధునిక మనస్తత్వ శాస్త్రం పిలుస్తుంది. కాగా... నిజమైన సంతృప్తిని పెంపొందించుకోవడానికి ఒక ఆచరణాత్మకమైన మార్గాన్ని ‘హార్ట్‌ఫుల్‌నెస్’ ధ్యానం అందిస్తుంది. హృదయపూర్వకంగా ధ్యానం చేయడం ద్వారా, ప్రత్యేకమైన శుద్ధి ప్రక్రియని అనుసరించడం ద్వారా... మనలో పేరుకుపోయిన భావోద్వేగ భారాలు క్రమంగా కరిగిపోతాయి. హృదయం తేలికయితే... ఇతరులతో పోల్చుకొనే ధోరణి స్థానంలో కృతజ్ఞత, ఆందోళన స్థానంలో శాంతి చోటు చేసుకుంటాయి. అటువంటివారు పని చేస్తూ ఉంటారు, కలలుకంటూ ఉంటారు, విజయాలు సాధిస్తూ ఉంటారు... కానీ అంతర్గత సమతుల్యతను కోల్పోరు.
హృదయం సరళంగా, తేలికగా మారినప్పుడు నిజమైన ఆనందం సహజంగానే కలుగుతుందని దాజీ మనకు గుర్తు చేస్తారు. ఆ అంతర్గత పరివర్తన భావోద్వేగపరమైన శ్రేయస్సులోను, శారీరకమైన ఆరోగ్యంలోను ప్రతిఫలిస్తుంది. సంతృప్తి అంటే పరిపూర్ణత గురించి తపించాల్సిన అవసరం తక్కువగా ఉండడం. ఆ పరిపూర్ణతను మనలో మనం కనుగొన్నప్పుడు.. ఆనందం మన సహజ జీవన విధానంగా మారుతుంది.
డాక్టర్ శరత్‌రెడ్డి, కార్డియాలజిస్ట్
ట్రైనర్ హార్ట్‌ఫుల్‌నెస్, 9440087532
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక