Share News

దైవంతో అనుబంధం

ABN , Publish Date - Mar 27 , 2026 | 01:01 AM

దేవునికి మనం అత్యంత ప్రియమైనవాళ్ళం... ఈ సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ఇంట్లో అమ్మ ఉంది. ఇంటికి వెళ్ళగానే నాకు భోజనం పెడుతుంది... బడికి వెళ్ళిన ఒక పిల్లవాడికి ఈ నమ్మకం చాలు...

దైవంతో అనుబంధం

చింతన

దేవునికి మనం అత్యంత ప్రియమైనవాళ్ళం... ఈ సత్యాన్ని మనస్ఫూర్తిగా విశ్వసించాలి. ఇంట్లో అమ్మ ఉంది. ఇంటికి వెళ్ళగానే నాకు భోజనం పెడుతుంది... బడికి వెళ్ళిన ఒక పిల్లవాడికి ఈ నమ్మకం చాలు... ఎలాంటి ఒత్తిడీ లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళడానికి. అదే విధంగా... ‘దేవుడు నా సొంతం. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నా మీద సమస్త శుభాలను కురిపిస్తాడు. ఈ సమస్త లోకాన్నీ ఆయన నాకోసమే సృష్టించాడు...’ అనే నమ్మకాన్ని మనం కూడా దేవుడి పట్ల కలిగి ఉండాలి. మరి ఈ భావనను మీరు ఎప్పుడు వ్యక్తపరుస్తారు? పదేళ్ళపాటు భక్తిని సాధనం చేసిన తరువాతా? మీ జీవిత చరమాంకంలోనా? మీ అంతరంగంలో ఆ భావన మేలుకోవడానికి మీకు ఎంతకాలం పడుతుంది? ఒకరి పట్ల ఆత్మీయత, వారు మన సొంతం అనే భావన కలగడానికి, ఒక అనుబంధం ఏర్పడడానికి ఎంతకాలం పడుతుంది? ఇవన్నీ కాలంతో ముడిపడి ఉండే విషయాలు కావు. అందుకే ఈ రోజే... ఈ క్షణమే ఆ పని మొదలుపెట్టండి.

అనుబంధం అనేది కాలం మీద ఆధారపడి ఉండదు. కాబట్టి మీ హృదయంలో దైవంతో ఒక అనుబంధాన్ని ఇప్పుడే గట్టిగా ఏర్పరుచుకోండి. మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతాయో వేచి చూడండి. నేను చెప్పదలచుకున్నది ఒక్కటే: మిమ్మల్ని, మీ తల్లిదండ్రులను, మీ తాతముత్తాతలను సృష్టించినవాడు, మీ కోసం ఈ లోకాన్నంతటినీ సృష్టించినవాడ అయిన దేవుడు మిమ్మల్ని అమితంగా ప్రేమిస్తున్నాడు. మీరు ఆయనకు అత్యంత ప్రియమైనవారు. మనం ఈ సంగతి మరచిపోవడమే అసలు సమస్య. ఈ విషయాన్ని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. అలా గుర్తుంచుకున్నంతకాలం... పరిపూర్ణత, సమృద్ధి, శక్తి, భక్తి, ముక్తి, శాంతి... ఇవన్నీ మనకు లభిస్తాయి. ప్రేమ శాశ్వతం అని అనుకుంటాం. కానీ అది వ్యక్తుల విషయంలో తరచుగా మారుతూ, తగ్గుతూ ఉంటుంది.


ఒక బాలుడు లేదా బాలిక తన తల్లిని గాఢంగా ప్రేమిస్తారు. కానీ పెద్దదయ్యే కొద్దీ తల్లి పట్ల ప్రేమ కొద్దికొద్దిగా వెనుకబడిపోతుంది. ఎందుకంటే తన స్నేహితులను, తరువాత జీవిత భాగస్వామిని, ఆ తరువాత సొంత పిల్లలను ప్రేమించడం ప్రారంభిస్తారు. కానీ దైవ ప్రేమ దీనికి పూర్తిగా భిన్నమైనది. అది ప్రతి క్షణం వృద్ధి చెందుతూ ఉంటుంది. అది అవిచ్ఛిన్నమైనది. దానిలో ఎలాంటి అంతరాలు ఉండవు. ఎలాంటి లోపాలు ఉండవు. అది నిరంతరమైనది. దైవంతో మీ ప్రేమకు ఎలాంటి షరతులు ఉండవు. అది ఎదుటి వ్యక్తి ప్రవర్తన మీద, వారి గుణగణాలమీద ఆధారపడే ప్రేమ కాదు. అలాంటి ప్రేమలో మీరు నిమగ్నమైనప్పుడు... లోకాన్ని మీరు ప్రేమించే తీరు కూడా మారిపోతుంది. ఇతర వ్యక్తులు మీకు ఏదైనా చేసినా, చేయకపోయినా మీరు పట్టించుకోరు. ప్రేమిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమ లేకుండా మీరు లేరు. మానవులుగా ప్రేమించడం మీ సహజ స్వభావం. మీరు ఆ ప్రేమలో గడుపుతున్న కొద్దీ ఇంకా ఎక్కువగా పొందాలనే తపన పెరుగుతుంది. అది ఒక అనుభూతి ప్రవాహం. మీరు దానిలో మమేకం కావచ్చు. మీరే ఆ ప్రేమగా మారిపోవచ్చు. దైవం పట్ల కృతజ్ఞతతో, భావోద్వేగంతో కన్నీరు కార్చవచ్చు. ఆ అనుభవాన్ని మాటల్లో వర్ణించలేం. దాన్ని ఎవరితోనూ పూర్తిగా పంచుకోలేం.

శ్రీశ్రీరవిశంకర్‌

ఇవి కూడా చదవండి

ఇరాన్‌కు ఎదురుదెబ్బ.. దాడిలో నేవీ చీఫ్ మృతి..

IPL 2026 : రెండో ద‌శ‌ షెడ్యూల్ వ‌చ్చేసింది..

Updated Date - Mar 27 , 2026 | 01:01 AM