Share News

Cockfight Craze In Godavari Districts: పందెంకోడి రెడీ

ABN , Publish Date - Jan 11 , 2026 | 02:10 AM

భోగి మంటల సందడి కంటే ముందే గోదావరి జిల్లాల్లో పందెంకోళ్లు రణరంగానికి సై అంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పందేల జోరు కొత్తపుంతలు తొక్కుతోంది. గతంలో గ్రామీణ బరులకే...

Cockfight Craze In Godavari Districts: పందెంకోడి రెడీ

భోగి మంటల సందడి కంటే ముందే గోదావరి జిల్లాల్లో పందెంకోళ్లు రణరంగానికి సై అంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈసారి పందేల జోరు కొత్తపుంతలు తొక్కుతోంది. గతంలో గ్రామీణ బరులకే పరిమితమైన ఈ క్రీడ ఇప్పుడు హైటెక్‌ హంగులు అందుకుంటోంది. పందేలను వీక్షించేందుకు ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేయడమే కాకుండా లైవ్‌ స్ట్రీమింగ్‌ ఇచ్చేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో పందెంకోళ్లను సిద్ధం చేయడం వెనుక ఉన్న కష్టంపై ‘నవ్య’ ప్రత్యేక కథనం.

రణరంగంలో నిలిచే పందెంపుంజును సిద్ధం చేయడం ఓ అద్భుతమైన ప్రక్రియ. ఇది పెంపకం మాత్రమే కాదు.. ఒక యుద్ధ వీరుడిని తీర్చిదిద్దడం. బ్రీడర్ల ఎంపిక నుంచి టీకాలు వేయడం వరకు ప్రతి అడుగులోనూ యజమానులు జాగ్రత్తలు పాటిస్తారు. ఆరు నెలల వయసు నుంచి కోడి పోట్లాడే విధానాన్ని బట్టి వాటిని పందేలకు ఎంపిక చేస్తారు. ఏడాది వయసు వచ్చాక వాటికిచ్చే శిక్షణ మరింత కఠనంగా ఉంటుంది. ఎదుటి పుంజు కత్తిదెబ్బలను తట్టుకునేలా శరీరానికి పటుత్వం తెచ్చేందుకు నిత్యం వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజు వాకింగ్‌ చేయించడంతోపాటు ఊపిరితిత్తుల బలం కోసం వారానికోసారి ఈత కొట్టిస్తారు. శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోకుండా వేడినీళ్లు కాపడం పెట్టడం వంటి ప్రత్యేక పద్ధతులను పాటిస్తారు. దీంతో పుంజులు కంచుకోటల్లా తయారై బరిలో నిలబడతాయి.


రాచమర్యాదలు.. పోషకాల విందు

పుంజుల ఆహార నియమాలు చూస్తే సామాన్యులు నోరెళ్లబెట్టాల్సిందే. బరిలో దిగే పుంజుకు బలవర్ధకమైన మెనూ ఉంటుంది. ఉడకబెట్టిన గుడ్డులోని తెల్లసొన, అంజూర, ఖర్జూరం, బాదం వంటి డ్రైఫ్రూట్స్‌ ఉండలను ఆహారంగా ఇస్తారు. శాకాహారం మాత్రమే కాకుండా ఖైమా ఉండలు, ఎండబెట్టిన మేకమాంసం ముక్కలు అందిస్తూ వాటిని శారీరకంగా శక్తివంతంగా మారుస్తారు.

వీటికితోడు మేకపాలు, తృణధాన్యాల మిశ్రమాలు సైతం అందిస్తారు. ఆహారం ఇవ్వడమే కాకుండా తిన్నది అరిగేలా కసరత్తులు చేయించడం, రెండు రోజులకోసారి ప్రత్యేక నూనెతో మర్దన చేసి ఖరీదైన సబ్బులతో స్నానం చేయించడం వంటివి వాటి దైనందిన జీవితంలో భాగం. గతేడాది వైరస్‌ దెబ్బకు చాలా పుంజులు మృత్యువాత పడటంతో ఈసారి యజమానులు అప్రమత్తమయ్యారు. మకాంల వద్దకు బయటి వ్యక్తుల రాకను నిషేధించారు.

రంగును బట్టే రేటు

బరిలో గెలుపోటములను నిర్ణయించడంలో ‘రంగు’ కీలకపాత్ర పోషిస్తుందని పందెం కాసేవాళ్ల నమ్మకం. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ఏడాది ‘కాకిరకం’పుంజులకు ఆకాశమంత డిమాండ్‌ ఏర్పడింది. ఒక్కో పుంజుధర లక్షల్లో పలుకుతోంది. భీమవరంలో ఓ ‘కాకి’ పుంజు ఏకంగా రూ. 3 లక్షల ధర పలికిందంటే అతిశయోక్తికాదు. పెదవేగి వంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా పుంజుల పెంపకం చేపడుతూ విక్రయాలు సాగిస్తున్నారు. ఒక్కోబరి నిర్వహించాలంటే కనీసం 200 పుంజులు ఉండాలని, అప్పుడే ఆట రక్తికడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.


బరి కోసం లక్షల ఖర్చు

ఈసారి కోడిపందేల కోసం లక్షల ఖర్చుతో క్రికెట్‌ స్టేడియం రేంజ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక పెళ్లి వేడుకకు సమానంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేవలం మట్టిని చదును చేయడమే కాకుండా క్రికెట్‌ స్టేడియం తరహాలో ప్రేక్షకులు కూర్చునే గ్యాలరీలు, పుంజులు పడినా దెబ్బతగలకుండా బరిలో మొత్తటి ఎర్రమట్టి వేస్తున్నారు. రాత్రివేళ్లలో పందేల కోసం భారీ ఫ్లడ్‌లైట్లు, అతిథుల కోసం విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో బరి నిర్వహణకు దాదాపు రూ. 70 లక్షల వరకు వెచ్చిస్తున్నారు. మొత్తానికి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి సమరం ‘విజయమా.. వీరస్వర్గమా’ అన్నట్లుగా మారింది. యుద్ధానికి సిద్ధమైన సైనికుల్లా పుంజులు, వాటి వెనుక లక్షల రూపాయలతో ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు.

- టి.సూరిబాబు/ఎం.రవికిణ్‌, పెదవేగి/తాడేపల్లిగూడెం

ఫొటోలు: ఐవివి ప్రసాద్‌

పుంజుల్లో రకాలు

తీతువా, అబ్రాస్‌, రసంగి, కెక్కిరాయి, డేగ, కాకి, కాకిడేగ, కోడికాకి, పింగళ, కోడిపింగళ, నెమలి, నెమలిపింగళ, కోడినెమలి, కాకినెమలి, నెమలిడేగ, పూలా, పర్లా.. ఇలా పందెం కోళ్లలో పలు రకాలు ఉన్నాయి.

ఇవీ చదవండి:

నదీగర్భానికి, నదీ పరివాహక ప్రాంతానికి తేడా తెలియని వ్యక్తి జగన్: సీఎం చంద్రబాబు

రాజధానిపై బురదజల్లే ప్రయత్నం... సజ్జలపై మంత్రి నారాయణ ఫైర్

Updated Date - Jan 11 , 2026 | 02:10 AM