నాకు నేనే ఇన్‌స్పిరేషన్
ABN , Publish Date - Jun 21 , 2026 | 03:11 AM
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందకుంటోంది. ఈ సినిమా హీరో రామ్‌చరణ్‌కు జాతీయ అవార్డు రావడం ఖాయమని అంటున్నారు ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా....
ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందకుంటోంది. ఈ సినిమా హీరో రామ్‌చరణ్‌కు జాతీయ అవార్డు రావడం ఖాయమని అంటున్నారు ఆ సినిమా దర్శకుడు బుచ్చిబాబు సానా. ‘నవ్య’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత ప్రయాణం.. విమర్శలపై మనసు విప్పి మాట్లాడారు. అలాగే, ‘ఫాదర్స్ డే’ సందర్భంగా తన ఎదుగుదలకు కారణమైన తండ్రి శ్రమను, ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు.
‘పెద్ది’ తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? మీ క్రియేటివ్ జర్నీకి స్ఫూర్తి ఎవరు?
‘ఎక్కడికి వెళ్లినా చాలా మంచి సినిమా తీశావు బాబూ’.. అంటుంటే చాలా సంతోషంగా అనిపిస్తోంది. గొప్ప అనుభూతి పొందుతున్నాను. ఇక ఇన్‌స్పిరేషన్ విషయానికి వస్తే.. నాకు నేనే ఇన్‌స్పిరేషన్. ఎవరూ చేయని పని ఏదో ఒకటి చేయాలని నాకు నేనే అనుకుంటాను. ఎక్కడి నుంచో తీసుకునే మోటివేషన్ కొంతకాలానికి ఆగిపోతుంది. అందుకే గతంలో నేను చేసిన తప్పుల నుంచి నేర్చుకుంటూ ముందుకు వెళ్తాను.
ఉప్పాడ నేపథ్యం నుంచి వచ్చిన మీకు దర్శకుడు కావాలని ఎప్పుడు అనిపించింది?
నేను కాకినాడలో ఇంటర్ చదివాను. ఊర్లో ఉన్నప్పుడు డైరెక్టర్‌ను కావాలని రోజుకు రెండువేల సార్లు అయినా అనిపించేది. కానీ, ఇంట్లో వాళ్లకు భయపడి ఎంబీయే చేస్తానని చెప్పి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చాక ఇక్కడ ఉండలేక పిఠాపురం వెళ్లిపోవడానికి టికెట్లు బుక్ చేసుకునేవాడిని. మళ్లీ క్యాన్సిల్ చేసేవాడిని. ఇండస్ట్రీకి వచ్చాక రోజుకు రెండుసార్లు అయినా డైరెక్టర్ అవాలని అనిపించకపోతే ఊరెళ్లిపోదాం అనుకున్నాను. కానీ ప్రయత్నం మాత్రం వదల్లేదు. ఆ భయం నన్ను నిలబెట్టింది.
మీలో మీకు నచ్చిన.. ఇంట్లో వాళ్లు తిట్టే క్వాలిటీ ఏంటి?
ఎదుటివాడికి సాయం చేయాలనే గుణం నాకు ఎక్కువ. ‘రుద్రవీణ’ సినిమాలో పాటలాగే.. పక్కోడి కన్నీళ్లు చూస్తే తట్టుకోలేను. వాడు అడగకపోయినా వాడి అవసరాన్ని నేను ముందే గుర్తించి డబ్బులు ఇచ్చేస్తుంటాను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకిదే అలవాటు. ఇంతకుముందు కూడా నా భార్య ఫోన్ చేసి ‘నీ అకౌంట్‌లో ఉండాల్సిన లక్ష రూపాయలు ఏమయ్యాయి? ఎందుకు ఇలా ఎప్పుడూ దానధర్మాలు చేస్తావు? నీకు జాగ్రత్త ఎప్పుడు వస్తుంది?’ అని కోప్పడింది. నేను కష్టాలన్నీ చూసి వచ్చాను కాబట్టి సాయం చేయకుండా ఉండలేను.
హైదరాబాద్ మీలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
నేను 2003లో హైదరాబాద్ వచ్చాను. అంటే 22 ఏళ్లు దాటింది. కానీ నా యాస ఇంకా తూర్పుగోదావరిదే. సినిమా ఇండస్ట్రీ లాంగ్వేజ్ నాకు రాలేదు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చాక నా చుట్టూ ఒక చిన్న ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. మా గురువు (సుకుమార్), నా అసిస్టెంట్ డైరెక్టర్లు.. ఇలా నలుగురైదుగురు ఫ్రెండ్స్ తప్ప నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. ‘స్నేహితులు కాదు.. స్నేహం పెరగాలి’ అని నేను నమ్ముతాను. నా ఎమోషనల్ సపోర్ట్ అంతా నా కుటుంబం, నా భార్య. వీటితోపాటు సంగీతం.
సినిమా షూటింగ్ మూడేళ్లకుపైగా సాగింది కదా.. కాలంతోపాటు కథకున్న రిలవెన్స్ మారిపోతుందన్న భయం వేయలేదా?
అస్సలు వేయలేదు. ఎందుకంటే సమాజం మారినా ఎమోషన్స్ ఎప్పటికీ మారవు. ఒకరి బాధ, ఆనందం, కష్టం.. ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. నేను కోకాపేట థియేటర్ వద్దకు వెళ్తుంటే 75 ఏళ్ల వృద్ధుడు ఒకరు జనాన్ని తోసుకుంటూ నా దగ్గరకు వచ్చి ‘ఇంత బక్కగా ఉన్నావు.. ఇంత మంచి సినిమా ఎలా తీశావు బాబూ’ అని అభినందించారు. ‘20 ఏళ్ల తర్వాత ఇంత మంచి ఎమోషనల్ సినిమా చూశాం’ అని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. ఆ ఎమోషనల్ కనెక్టే సినిమాను నిలబెట్టింది.
సినిమాపై వస్తున్న విమర్శలను ఎలా తీసుకుంటారు?
దానిని మనం కచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. విమర్శల విషయానికి వస్తే.. నేనొక సామెతను నమ్ముతాను. ‘నోరు మూసుకున్న చేప ఏ గాలనికీ పడదు’. నా పనేదో నేను చేసుకుంటూ వెళ్లడమే నాకు తెలుసు. నా మొబైల్‌లో సోషల్ మీడియా కూడా ఉండదు. ఒక పొగడ్త కానీ, విమర్శ కానీ నాతో నేరుగా మాట్లాడే మనిషి చెబితేనే వింటాను. మొదట్లో కొంచెం బాధపడేవాడిని. కానీ ఇప్పుడు మారిపోయాను. విమర్శించడమే వారి పని.. వాళ్లని ఆ పని చేసుకోనివ్వాలి. మన పని మనది. నా అసిస్టెంట్ డైరెక్టర్లు, నా టీం నుంచి మాత్రమే కఠినమైన విమర్శ వస్తుంటుంది.
సినిమాలో కొన్ని సీన్లు ఇబ్బంది కలిగించాయనే వాదనపై మీరేమంటారు?
నేను ఈ సినిమాలో ఒక కొండ ప్రాంతం నుంచి వచ్చిన అమాయకపు యువకుడికి, ఒక తిరుగుబాటు ధోరణి ఉన్న అమ్మాయికి మధ్య ఉన్న ప్రేమను చూపించాలనుకున్నాను. వాడు ముట్టుకుంటేనే ప్రేమ అనుకునే రకం.. అమ్మాయేమో ఒక్క ముద్దుతోనే తాళి కట్టేసుకునేంత సెన్సిబుల్ క్యారెక్టర్. అయితే, ఈ ప్రాసెస్‌లో బ్యాలెన్స్ తప్పి ఒకటి రెండు షాట్లు ఇబ్బందికరంగా వచ్చిన మాట వాస్తవమే. అది నాకు కూడా ఇబ్బందిగా అనిపించింది. మన వల్ల ఒకశాతం మంది ఇబ్బంది పడినా అది తప్పే. ఎవరినైనా నొప్పించి ఉంటే సారీ. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి తప్పులు చేయను. ఇంకెప్పుడూ చేయకపోవడమే అసలైన సారీ.
శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి లాంటి ఇతర భాషల నటులను తీసుకోవడం వెనుక ఉన్న కమర్షియల్ లెక్కలు ఏంటి?
ఇది కమర్షియాలిటీ కోసం కాదు. మన లోకల్ ఆర్టిస్టులను తీసుకుంటే వారికి ఇక్కడున్న ఇమేజ్ వల్ల ఈ క్యారెక్టర్‌లో ఇముడుతారా? లేదా? అనే భయం ఉంటుంది. అదే శివరాజ్‌కుమార్ లాంటి వాళ్లకైతే ఒక గొప్ప ‘ఆరా’ ఉంటుంది. కానీ మన తెలుగులో వారికి నిర్దిష్టమైన ఇమేజ్ లేదు. ఆ ఆరాను పట్టుకుని మనం ఒక కొత్త ఇమేజ్‌ను క్రియేట్ చేయొచ్చు. విజయ్ సేతుపతి పాత్రను కూడా అలాగే ఊహించుకుని డిజైన్ చేశాం. డైరెక్టర్ అనేవాడు ఎప్పుడూ సినిమా పాడవాలని కోరుకోడు.
మీ తదుపరి చిత్రం ఎలా ఉండబోతోంది?
ఉప్పెన సినిమాలో ప్రేమకు అంగవైకల్యం ఉండదు. ‘రాయి పాడైపోయినంత మాత్రాన దేవుడు పాడైపోతాడు ఏంటి తల్లీ’ అని ఒక మంచి కోర్ పాయింట్ చెప్పాను. ‘పెద్ది’లో కూడా మనిషి తలచుకుంటే ఏదైనా సాధించవచ్చనే మంచి పాయింట్ ఉంది. నా సినిమాల్లో విలన్లు ఉండరు. పరిస్థితులే విలన్లుగా మారుతాయి. అయితే, ఈసారి మాత్రం ఫస్ట్ నుంచే చాలా కమర్షియల్‌గా, ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఒక సరికొత్త ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నాను.
నాన్నంటే...
మాది పక్కా వ్యవసాయ కుటుంబం. మా నాన్న వెంకటరావు గారు క్లాస్ టీచర్ కంటే స్ట్రిక్ట్. అలవోకగా, ఈజీగా వచ్చే దేనినీ ఆయన నమ్మరు. కష్టపడితేనే ఏదైనా దక్కుతుందని నమ్మే మనిషి. కష్టపడటం అంటే మాటల్లో కాదు. పొలంలో ఆయన పడిన శ్రమను చేతల్లో చూపించి మరీ మాకు నేర్పించారు. నాన్నగారు మా దగ్గర నుంచి దూరమై రెండేళ్లు అయింది. ఆయన కష్టం నా గుండెల్లో ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన పడిన శ్రమతో పోల్చుకుంటే ఇండస్ట్రీలో నా కష్టం అసలు కష్టమే కాదు. వ్యవసాయ కుటుంబం అయినప్పటికీ ఆడపిల్ల కూడా అబ్బాయితో సమానమేనని నమ్మి మా చెల్లిని డాక్టర్ చదివించారు. ‘పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు, చదువు ముఖ్యం’ అంటూ ఆడపిల్లలకు సమాన గౌరవం ఇవ్వాలనే గొప్ప సంస్కారాన్ని నేను నాన్నగారి నుంచే నేర్చుకున్నాను. మనిషి ఎంత కష్టపడితే అంత ఎత్తుకు ఎదుగుతాడనే నిజానికి మా నాన్నే నిలువెత్తు నిదర్శనం.
‘‘మనకు రైటింగ్‌లోనే కొన్ని తెలిసిపోతాయి. మనం చేసే పనిని అంత గట్టిగా నమ్మడం వల్ల కావొచ్చు. పెద్ది సినిమా థియేటర్లలో ఆసుపత్రి సీన్ వస్తున్నప్పుడు ప్రేక్షకులందరూ ‘‘అన్నా.. చరణ్... నీకు నేషనల్ అవార్డు వస్తుందన్నా’ అని అరుస్తున్నారు. చిరంజీవి గారి ఇంట్లో చరణ్ పేరుపై ఒక నేషనల్ అవార్డు చూడాలనేది నా కోరిక. అది దేవుడి దయవల్ల వచ్చేలాగా ఉంది. ఇప్పటికే బన్నీ గారికి కూడా వచ్చింది కదా.
