తరతరాల సంబరం
ABN , Publish Date - Jul 17 , 2026 | 03:36 AM
ఆషాఢ మాసం రాగానే తెలంగాణలో ఊరూరా బోనాల ఉత్సవాల సందడి ఆరంభమవుతుంది. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రధానాంశం... వర్షాకాలంలో...
వేడుక
ఆషాఢ మాసం రాగానే తెలంగాణలో ఊరూరా బోనాల ఉత్సవాల సందడి ఆరంభమవుతుంది. నెలరోజుల పాటు సాగే ఈ ఉత్సవాల్లో ప్రధానాంశం... వర్షాకాలంలో వ్యాధుల నుంచి, విపత్తుల నుంచి తమను రక్షించాలని ప్రార్థిస్తూ... గ్రామదేవతలకు బోనాలు సమర్పించడం. బోనాల సంబరాల్లో ప్రతి వేడుకకూ ఒక విశిష్టత ఉంది. ఈ వేడుకలు శతాబ్దాల నాటిదని స్పష్టం చేసే ఆధారాలు ఎన్నో ఉన్నాయి.
‘మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ తదితర గ్రామ దేవతలకు వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించే ఆచారమే బోనం’ అని 1516లో విజయనగర రాజుల కాలంనాటి ఒక శాసనం చెబుతోంది. ఆ శాసనం ప్రకారం ఈ సంప్రదాయం, దానికి అనుగుణంగా చేసే వేడుకలు అంతకన్నా చాలాకాలం ముందే ఉందని తెలుస్తోంది. ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని మత్తమర్ల తండా, హైదరాబాద్ శివార్లలోని దశర్లపల్లి, కొత్తగూడెం జిల్లాలోని అక్షరాల లొద్ది (నల్లముడి) ప్రాంతాల్లో... దేవతలకు ఆహారాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నట్టు చెక్కిన రాతి చిత్రాలు బయటపడ్డాయి. అలాగే... తన కుమార్తెకు కుమారుడు కలగాలని వరంగల్ జిల్లా మొగిలిచర్లలోని ఏకవీరాదేవిని రాణీ రుద్రమదేవి ప్రార్థించి... బోనం సమర్పించినట్టు ‘ప్రతాపరుద్ర చరిత్ర’, ‘సిద్ధేశ్వర చరిత్ర’ లాంటి గ్రంథాలు పేర్కొన్నాయి. హైదరాబాద్ నగరం ఏర్పడడానికి ముందే... చించులం గ్రామంలో బోనాల వేడుకను నిర్వహించినట్టు సూచించే ఒక మినీయేచర్ చిత్రం లభ్యమయింది. మెదక్ జిల్లా వెల్పుగొండ ఆలయంలో... తలపై కుండను ధరించిన మహిళ చిత్రం ఉంది. ప్రస్తుత సిద్ధిపేట జిల్లా పోట్లపల్లిలోని శిల్పాలలో కుండలను మోస్తున్న మహిళల చిత్రాలు ఉన్నాయి. ఇలాంటి పలు చారిత్రక, సాహిత్య ఆధారాల ప్రకారం కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ ఆచారం ఉన్నట్టు తెలుస్తోంది.
పూర్వం మూసీ నదికి వరదలు వచ్చి.. ప్లేగు లాంటి అంటువ్యాధులు వ్యాపించాయి. ప్రాణనష్టం జరిగింది. గోల్కొండలో వెలసిన జగదాంబికకు పూజలు చేస్తే పరిస్థితి చక్కబడుతుందన్న మంత్రి కిషన్ ప్రసాద్ సూచన మేరకు... నాటి గోల్కొండ ప్రభువు మీర్ మహబూబ్ ఆలీఖాన్ .. అమ్మవారి ఉత్సవాలను చేపట్టారనీ, తదనంతరం ప్రశాంతత ఏర్పడిందనీ అంటారు. నాటి నుంచి ఆషాఢ మాసంలో తొలి గురువారం లేదా ఆదివారం గోల్కొండ కోటలోని జగదంబిక ఆలయంలో తొలి బోనాల సమర్పణ ఆనవాయితీగా వస్తోంది. తదనంతరం ఆది, గురు వారాల్లో తెలంగాణ ప్రాంతమంతా గ్రామదేవతలకు బోనాలు సమర్పించి, ఉత్సవాలు నిర్వహిస్తారు. హైదరాబాద్-సికింద్రాబాద్ జంట నగరాల్లో బోనాలు సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఆషాఢమాసం చివరివారం గోల్కొండలోనే జరిగే ఉత్సవాలతో ముగుస్తాయి. ఈ ఏడాది ఆషాఢమాసం తొలి గురువారం (నిన్న) గోల్కొండ కోటలోని జగదాంబిక ఆలయంలో బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.
ప్రధాన ఉత్సవాల వివరాలు
జూలై 20 నుంచి 22:
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవాలు
ఆగస్టు 2:
సికింద్రాబాద్ ఉజ్జయని మహాంకాళి అమ్మవారి బోనాలు
ఆగస్టు 3:
రంగం, భవిష్యవాణి
ఆగస్టు 9:
లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు
ఆగస్టు 10:
ఉమ్మడి దేవాలయాల ఘటాల ఊరేగింపు
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక