చర్మానికి రక్ష ఇలా...
ABN , Publish Date - Apr 07 , 2026 | 03:52 AM
వేసవి ఎండ, వేడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఎండకు నల్లబడిన చర్మాన్ని తెల్లబరుచుకోవడం కోసం, జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడం కోసం తోచిన చిట్కాలను...
స్కిన్ కేర్
వేసవి ఎండ, వేడి చర్మాన్ని దెబ్బతీస్తాయి. ఎండకు నల్లబడిన చర్మాన్ని తెల్లబరుచుకోవడం కోసం, జరిగిన నష్టాన్ని సరిదిద్దుకోవడం కోసం తోచిన చిట్కాలను ఆశ్రయించకూడదు. చర్మ వైద్యుల పర్యవేక్షణలో, వారు సూచించే చికిత్సలనే ఎంచుకోవాలి. ఎందుకో తెలుసుకుందాం...
సాధారణంగా వేసవిలో చర్మం గురించి రెట్టింపు బెంగ పడుతూ ఉంటాం. సన్ ట్యాన్ రాకుండా సన్‌స్ర్కీన్స్ వాడుకుంటాం. వచ్చిన సన్‌ట్యాన్‌ను తొలగించుకోడానికి తెలిసిన చిట్కాలు అనుసరిస్తాం. అయితే ఫలితం సమర్థంగా ఉండాలంటే, చర్మ వైద్యుల సూచనలను తప్పక అనుసరించాలి.
భిన్నమైన సన్‌స్ర్కీన్స్
ఇప్పటివరకూ చర్మం పైన పూసుకునే సన్‌స్ర్కీన్స్ గురించి మాత్రమే మనకు తెలుసు. ఇవి కచ్చితంగా ఎండ తీవ్రత నుంచి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. అయితే ఈ సన్‌స్ర్కీన్స్ ఎక్కువ సమయాల పాటు చర్మాన్ని ఎండ బారి నుంచి కాపాడలేకపోవచ్చు. కొందరికి ఎండకు చర్మపు అలర్జీలు తలెత్తవచ్చు. ఇలాంటి వారికి అదనపు రక్షణగా ఓరల్ సన్‌స్ర్కీన్స్ ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. అలాగే పిగ్మెంటేషన్ సమస్య ఉన్న వాళ్లు, సెలవు రోజుల్లో సముద్రతీరాల దగ్గర ఎక్కువ సమయం గడపాలనుకునేవారు అదనపు రక్షణ కోసం ఓరల్ సన్‌స్ర్కీన్స్‌ను ఎంచుకోవచ్చు. కొందరికి సన్‌స్ర్కీన్ సెన్సిటివిటీ ఉండొచ్చు. ఈ అవసరాలు ఉన్న వారు చర్మం మీద సన్‌స్ర్కీన్స్ అప్లై చేసుకోవడంతో పాటు అదనంగా ఓరల్ సన్‌స్ర్కీన్స్ కూడా వాడుకోవచ్చు. ఓరల్ సన్‌స్ర్కీన్స్‌తో పాటు ఫౌండేషన్ ఆధారిత సన్‌స్ర్కీన్స్, యాంటీ పొల్యూషన్ కాంబినేషన్ కలిగిన సన్‌స్ర్కీన్స్, మాయిశ్చరైజర్ కాంబినేషన్‌తో కూడిన సన్‌స్ర్కీన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి జోడించిన సన్‌స్ర్కీన్స్, చర్మంలోకి మెరుగ్గా ఇంకిపోవడం ప్రధానంగా, జిడ్డు లేని ట్రాన్స్‌పరెంట్ జెల్ సన్‌స్ర్కీన్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. అలాగే పౌడర్ రూపంలోని సన్‌స్ర్కీన్స్ కూడా అందుబాటులోకొచ్చాయి. మేకప్ టచప్స్ చేసుకున్నట్టుగా ఈ సన్‌స్ర్కీన్స్‌ను ముఖం మీద అద్దుకోవచ్చు
ట్యాన్ రిమూవల్
సెలవు రోజుల్లో విహారయాత్రలకు వెళ్లి ఇంటికి చేరుకున్న వెంటనే, నల్లబడిన చర్మాన్ని తిరిగి సరిదిద్దే పనులకు పూనుకుంటూ ఉంటారు. ఇది సరి కాదు. ట్యాన్‌ను తొలగించుకోవడం కోసం చర్మానికి పూసుకునే మాస్క్‌లు, స్క్రబ్‌లతో చర్మం దెబ్బతిని, మరింత నల్లబడుతుంది. కాబట్టి ఇంటికి చేరుకున్న తర్వాత, కొద్ది రోజులు చర్మాన్ని అలాగే వదిలేసి, చర్మ వైద్యుల సూచనతో డిట్యాన్ చికిత్సలకు పూనుకోవాలి. ఓవర్‌నైట్ డిట్యాన్ మాస్కులతో పాటు, 20 నిమిషాల డిట్యాన్ మాస్క్‌లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వెట్ వైప్స్ మాదిరిగా పీల్ ప్యాడ్స్ కూడా ఇప్పుడు అందుబాటులోకొచ్చాయి. వీటితో కూడా సన్ ట్యాన్ తొలగిపోతుంది. అలాగే ట్యాన్‌ను తొలగించే పీలింగ్ సొల్యూషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. చర్మ తత్వం ఆధారంగా వైద్యులు సూచించే ఈ మాస్క్‌లు, సొల్యూషన్స్, పీల్ ప్యాడ్స్‌తో ట్యాన్‌ను సమర్థంగా తొలగించుకోవచ్చు.
అధిక చమట
వేసవిలో కొందరికి అధిక చమట సమస్యగా మారుతూ ఉంటుంది. ఇలాంటి వారి కోసం నోటి మాత్రలు అందుబాటులో ఉన్నాయి. కొందరి అండర్ ఆర్మ్స్‌లో చమట ఎక్కువగా పడుతూ ఉంటుంది. పిగ్మెంటేషన్, దుర్వాసన సమస్యలు కూడా వేధిస్తూ ఉంటాయి. ఈ సమస్య కోసం సమర్థమైన రోలాన్స్ అందుబాటులో ఉన్నాయి. వీటితో చమట, దుర్వాసనతో పాటు పిగ్మెంటేషన్ కూడా తగ్గుతుంది. అధిక స్వేదాన్ని తగ్గించడం కోసం ‘అయాంటోఫోరెసిస్’ చికిత్స కూడా ప్రస్తుతం అందుబాటులో ఉంది. మొదట వైద్యుల దగ్గర ఈ చికిత్స తీసుకుని, తర్వాత ఇంట్లోనే ఎవరికి వారు స్వయంగా చికిత్స చేసుకోవచ్చు. చమట దుర్వాసనకు చర్మం పైన ఉండే బ్యాక్టీరియా ప్రధాన కారణం. కాబట్టి బాహుమూలాల్లో, జననాంగ ప్రదేశంలో అవాంఛిత రోమాలను తొలగించుకోవడం ద్వారా బ్యాక్టీరియాను నివారించుకోవచ్చు. అలాగే ఆ ప్రదేశాల్లో స్వెట్ రోలాన్స్ కూడా వాడుకోవచ్చు. అలాగే స్నానం చేసే సమయంలో ఆ ప్రదేశాల్లో మాత్రమే యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడుకోవచ్చు.
దుర్వాసన రాకుండా నేరుగా చర్మం పైన కాకుండా దుస్తులకు డియోడరెంట్లు, పర్‌ఫ్యూమ్స్ వాడుకోవచ్చు. అలాగే ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి తగ్గించుకోవాలి.
డాక్టర్ స్వప్నప్రియ
డెర్మటాలజిస్ట్, కాస్మోస్యూర్, హైదరాబాద్