యమునా తీరంలో శివోహం
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:47 AM
యమునా నది పేరు వినగానే బృందావనం, శ్రీకృష్ణలీలలు గుర్తువస్తాయి. కానీ ఆ నది శివుని శిరసుపైన నెలవంకలా వంపు తిరిగిన చోట... విలక్షణమైన శివ క్షేత్రం ఒకటుంది. అది 101 ఆలయాల...
ఆలయ దర్శనం
యమునా నది పేరు వినగానే బృందావనం, శ్రీకృష్ణలీలలు గుర్తువస్తాయి. కానీ ఆ నది శివుని శిరసుపైన నెలవంకలా వంపు తిరిగిన చోట... విలక్షణమైన శివ క్షేత్రం ఒకటుంది. అది 101 ఆలయాల అద్భుతమైన సముదాయం. అక్కడ ప్రధాన దైవంగా ‘బాటేశ్వరనాథ్’ పేరుతో పరమశివుడు పూజలందుకుంటున్నాడు.
ఉత్తరప్రదేశ్‌లోని బాటేశ్వర్ ఆధ్యాత్మికంగానే కాదు, చారిత్రకంగానూ ప్రాధాన్యత ఉన్న క్షేత్రం. మత్స్యపురాణం లాంటి గ్రంథాల్లో దీని ప్రస్తావన కనిపిస్తుంది. బాటేశ్వర్‌నాథ్ ఆలయ విశిష్టతను ఇక్కడి క్షేత్ర పురాణం వివరిస్తోంది. దాని ప్రకారం... పూర్వకాలంలో ప్రాణమిత్రులైన ఇద్దరు రాజులు ఉండేవారు. తమకు పిల్లలు పుడితే, వారికి వివాహం చేసి, వియ్యంకులు అవుదామని ప్రమాణం చేసుకున్నారు. అయితే వారిద్దరికీ అమ్మాయిలే పుట్టారు. ఈ సంగతి తెలిస్తే... మిత్ర రాజు తన స్నేహాన్ని వదిలేస్తాడనే భయంతో... ఒక రాజు తనకు పుట్టినది ఆడబిడ్డ అనే విషయాన్ని రహస్యంగా ఉంచాడు. ఆమె పెరిగి పెద్దదయింది. మిత్రరాజు కుమార్తెకు, ఆమెకు వివాహం కూడా నిశ్చయమయింది. పురుషుడిగా మిత్రరాజు కుమార్తెను నమ్మించడం ఇష్టంలేని రాజకుమారి... ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బాటేశ్వర్ దగ్గర పరమశివుణ్ణి ప్రార్థించి, యమునా నదిలో దూకింది. శివుడు ఆమెను అనుగ్రహించి, ఆమె మరణించకుండా కాపాడాడు. నీటిలోంచి బయటికి వచ్చిన వెంటనే... ఆ రాజకుమారి... ఒక యువకుడిగా మారింది. ఈ సంగతి తన తల్లిదండ్రులకు చెప్పి. మిత్రరాజు కుమార్తెను వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమయింది.
మానవరూపంలో మహాశివుడు...
బాటేశ్వర్ ఆలయ సముదాయం అద్భుతమైన శిల్పాలకు నిలయం. ఈ ఆలయాలను క్రీస్తుశకం ఎనిమిది, పది శతాబ్దాల మధ్య నిర్మించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. 22వ జైన తీర్థంకరుడు నేమీనాథ్ జన్మ స్థలంగానూ ఇది ప్రసిద్ధి చెందింది. ఘాట్ల చివరి నుంచి చూస్తే... డజన్లకొద్దీ ఆలయ శిఖరాలు ఒకే తీరులో యమునా జలాల్లో ప్రతిఫలిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. ఈ సముదాయంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఆలయం ఒకటుంది. దానిలో శివుడు మానవరూపంలో... తలపై సర్పాన్ని, నెలవంకను ధరించి, కూర్చున్న భంగిమలో దర్శనమిస్తాడు. ఆయనకు ఒకవైపు పార్వతీదేవి, మరోవైపు గణపతి కొలువు తీరి ఉంటారు.
బాలేశ్వర్ పశువుల ఉత్సవం
ప్రధాన మందిరంలోని బాటేశ్వర్‌నాథ్ లింగాన్ని దర్శించుకోవడానికి ప్రతి నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తారు. మహా శివరాత్రితోపాటు శ్రావణ మాసంలో ఈ ఆలయంలో విశేషమైన పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. మిగిలిన ప్రాంతాలకు భిన్నంగా... ఇక్కడ చంద్రవంకలా మలుపు తిరిగే యమునా నదిలో స్నానాన్ని భక్తులు పరమపవిత్రంగా భావిస్తారు. బాటేశ్వర్‌నాథ్‌ను పూజిస్తే కర్మ బంధాల నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. అలాగే.. ఇక్కడ వందల ఏళ్ళుగా.. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ‘బాటేశ్వర్ పశువుల ఉత్సవం’ కూడా సుప్రసిద్ధమైనది. అక్టోబర్, నవంబర్ నెలల మధ్య... కార్తిక పౌర్ణమి సందర్భంగా జరిగే ఈ ఉత్సవానికి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నించి వేల సంఖ్యలో పశువులను, ఒంటెలను, గుర్రాలను విక్రయం కోసం తీసుకువస్తారు. వర్తకులతో పాటు ఈ వేడుకను తిలకించడానికి వచ్చే గ్రామీణులు, సాధువులతో బాటేశ్వర్ కన్నులపండుగగా ఉంటుంది.
ఎలావెళ్ళాలి?: బాటేశ్వర్ ఆలయం ఆగ్రా నగరానికి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాటేశ్వర్ హాల్ట్ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడికి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం ఆగ్రాలో ఉంది.
ఇవి కూడా చదవండి:
పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్
బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు