Aviva Beg: ప్రియాంకకు కాబోయే కోడలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:29 AM
అవీవా బేగ్... ఇప్పుడీ పేరు దేశమంతా మారుమోగుతోంది. ఉన్నట్టుండి అందరిలో ‘ఎవరీ అమ్మాయి’ అనే ఉత్సుకత మొదలైంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు...
అవీవా బేగ్... ఇప్పుడీ పేరు దేశమంతా మారుమోగుతోంది. ఉన్నట్టుండి అందరిలో ‘ఎవరీ అమ్మాయి’ అనే ఉత్సుకత మొదలైంది. కాంగ్రెస్ అగ్రనాయకురాలు, పార్లమెంటు సభ్యురాలు... ‘ప్రియాంక గాంధీ కాబోయే కోడలు’ అని తెలియగానే... అమాంతం సెర్చ్ ఇంజిన్లు బిజీ అయిపోయాయి. సామాజిక మాధ్యమాల్లో ఆమె ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. రాత్రికి రాత్రి వార్తల్లో వ్యక్తిగా మారిన అవీవా గురించి
కొన్ని విశేషాలు...
ఇటీవల అవీవా బేగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ్‌సలో ఒక ఫొటో అప్‌లోడ్ చేశారు. ప్రియాంక గాంధీ, రాబర్ట్ వాద్రాల కుమారుడు రేహాన్ వాద్రాతో కలిసి దిగిన ఫొటో అది. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఫొటో సామాజిక మాధ్యమాలన్నిటినీ చుట్టేసింది. విపరీతంగా లైక్‌లు, షేర్లు. ఆమె గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి. అదేసమయంలో రేహాన్, అవీవాకు నిశ్చితార్థం జరిగిందని గాంధీ కుటుంబ సన్నిహిత వర్గాల పేర్కొనడంతో జాతీయ మీడియాలో కథనాలు మొదలయ్యాయి.
అభిరుచులు ఒక్కటే...
రేహాన్ చిన్ననాటి స్నేహితురాలు అవీవా. ఢిల్లీలో ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. ఫొటోగ్రఫీ, స్టోరీ టెల్లింగ్, చిత్రకళ... ఇద్దరి అభిరుచులు, ఆ తరువాత మనసులు కలిశాయి. పలు జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనల కోసం ఎన్నో ప్రాంతాలు పర్యటించారు. ఏడేళ్లుగా సన్నిహితంగా ఉంటున్న అవీవా, రేహాన్... చివరకు తమ సుదీర్ఘ ప్రేమాయణాన్ని వివాహ బంధంగా మార్చుకోవాలనుకున్నారు. అందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలపడంతో... ఇటీవల పెళ్లి నిశ్చయమైంది.
స్నేహబంధం...
పాఠశాల విద్యాభ్యాసం అనంతరం అవీవా... హరియాణాలోని ‘ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ’లో జర్నలిజమ్ అండ్ మాస్ కమ్యూనికేషన్స్ చదివారు. రేహాన్ లండన్‌లోని ‘స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్’ నుంచి పాలిటిక్స్‌లో డిగ్రీ చేశారు. అవీవా తండ్రి ఇమ్రాన్ బేగ్ వ్యాపరవేత్త. తల్లి నందిత ఇంటీరియర్ డిజైనర్. చాలా ఏళ్లుగా ఇరు కుటుంబాల మధ్య స్నేహం ఉంది. ముఖ్యంగా నందిత, ప్రియాంక చాలాకాలంగా మంచి మిత్రులు. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం ‘ఇందిరా భవన్’ ఇంటీరియర్ డిజైనింగ్ పనులు నందిత ఆధ్వర్యంలోనే జరిగాయి.
సృజనాత్మక రంగం వైపు...
చిన్ననాటి తన అభిరుచులను అవీవా ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. సృజనాత్మక రంగంలో తన కెరీర్‌ను నిర్మించుకున్నారు. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా అద్భుత చిత్రాలెన్నిటినో తన లెన్స్‌లో బంధించారు. ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెయిర్-2023’లో ‘యూ కెనాట్ మిస్ దిస్’ పేరుతో వాటిని ప్రదర్శించారు. అంతకముందు ‘ది కోరమ్ క్లబ్’లో ‘ది ఇల్యూజరీ వరల్డ్’ పేరిట నిర్వహించిన ఫొటో ఎగ్జిబిషన్‌కు మంచి గుర్తింపు లభించింది. తరువాత కాలంలో ఫొటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ కంపెనీ ‘అటెలియర్ 11’ను నెలకొల్పారు. దీనికి ఆమె సహవ్యస్థాపకురాలు. ఈ స్టూడియో ప్రారంభానికి ముందు ఫొటోగ్రఫీని కొనసాగిస్తూనే కొన్నాళ్లు మీడియా రంగంలో వివిధ హోదాల్లో పని చేశారు. అంతేకాదు... ఒకప్పుడు అవీవా జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడాకారిణి. ఇక రేహాన్ కూడా ఫొటోగ్రాఫర్. విజువల్ ఆర్టిస్ట్. 2021లో ‘డార్క్ పర్‌సెప్షన్’ పేరుతో ఢిల్లీ బికనీర్ హౌస్‌లో సోలో ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఇవి కూడా చదవండి
ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి న్యూ ఇయర్ విషెస్..
వధువుతో పాటు స్నేహితులు కూడా ఏడడుగులు.. ఫన్నీ వీడియో వైరల్..